కరోనా చిన్న విషయం కాదు.. తేలికగా తీసుకుంటే..!

ABN , First Publish Date - 2020-05-18T14:38:39+05:30 IST

ప్రపంచ దేశాలను కరోనా దడదడలాడిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో కింకర్తవ్యం అంటూ ఆయా దేశాలు తలలు ప

కరోనా చిన్న విషయం కాదు.. తేలికగా తీసుకుంటే..!

  • ప్రపంచ దేశాలను  అల్లాడిస్తున్న కొవిడ్‌-19
  • బ్రెజిల్‌లో ఐసీయూలు ఫుల్‌


బ్రెజిల్‌, మే 17: ప్రపంచ దేశాలను కరోనా దడదడలాడిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో కింకర్తవ్యం అంటూ ఆయా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితే లాటిన్‌ అమెరికా దేశమైన బ్రెజిల్‌లోనూ ఉన్నా అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో మాత్రం కరనాను తేలికగా తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ‘ఇది చిన్నపాటి జ్వరమే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై వైద్య వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బ్రెజిల్‌లో కరోనా పాజిటివ్‌ కేసులతో ఐసీయూలు నిండిపోయాయి. ఇప్పటి వరకు 15 వేల మంది మృత్యువాత పడ్డారు. 3, 4 రోజులుగా ప్రతి 24 గంటలకు 800 మంది చొప్పున మృతి చెందుతున్నారని అఽధికారులు చెప్పారు. ‘‘కరోనా చిన్న విషయం కాదు. దీనిని తేలికగా తీసుకుంటే ప్రాణాలకే ముప్పు’’ అని కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వైద్యుడు డీ ఓలివేరా చెప్పారు. మరోపక్క, అధ్యక్షుడు బోల్సొనారో మాత్రం కరోనా ప్రభావం లేని వారంతా తిరిగి పనులు ప్రారంభించాలని, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడరాదని ఆదేశించారు. ఇక, దక్షిణమెరికా దేశమైన వెనిజులాలో ఒక్కరోజులోనే 19 మందికి పాజిటివ్‌ నమోదైంది. 10 మంది మృతి చెందారు. ఇక, బహిరంగ ప్రదేశాల్లో కూడా మాస్కులు ధరించాలని చైనా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, బీజింగ్‌లో మాత్రం దీనిని మినహాయించారు.


కొవిడ్‌ నియంత్రణలోనే ఉందని, కాబట్టి మాస్కుల ధారణ నిబంధనను ఎత్తేస్తున్నామని అధికారులు తెలిపారు. భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందన్నారు. ఆదివారం ఒక్కరోజే 17 కొత్త కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.  


ఇటలీలో 24 గంటల్లో 153 మంది మృతి

ఇటలీలో గడిచిన 24 గంటల్లో 153 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 31,763కు పెరిగింది. ఇక, సింగపూర్‌లో ఆదివారం ఒక్కరోజే 682 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 28,038కి చేరిందని అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారు ఉంటున్న డార్మెటరీల్లోనే ఉన్నాయని చెప్పారు. కాగా, గత రెండు నెలలతో పోల్చుకుంటే స్పెయిన్‌లో మరణాల రేటు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం 87 మంది మృతి చెందారని, మార్చి 16 నాటి పరిస్థితితో పోల్చుకుంటే మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. దీనికి ముందు రోజుకు 900 మరణాలు నమోదయ్యాయని చెప్పారు. టర్కీలోనూ కేసుల తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 41 మంది మృతి చెందారు. 


Updated Date - 2020-05-18T14:38:39+05:30 IST