భారత్‌పై విషం కక్కుతున్న చైనా సోషల్‌ మీడియా !

ABN , First Publish Date - 2020-06-21T13:24:55+05:30 IST

చైనాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌లు కూడా భారత్‌పై విషం కక్కుతున్నాయి. తాజాగా ‘వీ చాట్‌’ యాప్‌ చైనాలోని భారత రాయబార కార్యాలయం చేసిన పోస్టులను ఏకపక్షంగా తొలగించింది.

భారత్‌పై విషం కక్కుతున్న చైనా సోషల్‌ మీడియా !

వీ చాట్‌, వీబో యాప్‌ల ఇష్టారాజ్యం

న్యూఢిల్లీ, జూన్‌ 20: చైనాకు చెందిన సోషల్‌ మీడియా యాప్‌లు కూడా భారత్‌పై విషం కక్కుతున్నాయి. తాజాగా ‘వీ చాట్‌’ యాప్‌ చైనాలోని భారత రాయబార కార్యాలయం చేసిన పోస్టులను ఏకపక్షంగా తొలగించింది. ఇలా తొలగింపునకు గురైన పోస్టుల్లో 20 మంది భారత సైనికులు అమరులైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యల వీడియో కూడా ఉంది. సరిహద్దు వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ జారీచేసిన ప్రకటననూ ఇష్టారాజ్యంగా తొలగించారు. శనివారం ఉదయం వీ చాట్‌ యాప్‌ వినియోగదారులు ఆయా పోస్టులను క్లిక్‌ చేయగా.. ‘‘రచయిత ఈ పోస్టును తొలగించారు’’, ‘‘ఇది చట్టాలను ఉల్లంఘించేలా ఉండటంతో తొలగించాం’’, ‘‘చైనా దేశ రహస్యాలు, జాతీయ భద్రతకు విఘాతం కలిగించేలా ఉండటంతో తొలగించాం’’ అనే సమాధానాలు కనిపించాయి. అయితే సరిహద్దు వ్యవహారంపై వీచాట్‌, వీబో యాప్‌లలో చేసిన పోస్టులను తామే తొలగించుకున్నామనడంలో వాస్తవం లేదని చైనాలోని భారత రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ట్విటర్‌ తరహాలో చైనాలో వాడకంలో ఉండే వీబో యాప్‌ కూడా సరిహద్దు అంశాలతో ముడిపడిన పలు పోస్టులను తొలగించినట్లు తెలిసింది. 

Updated Date - 2020-06-21T13:24:55+05:30 IST