ట్రంప్‌కు కరోనా సోకడంపై చైనా రియాక్షన్ ఇది !

ABN , First Publish Date - 2020-10-03T17:36:34+05:30 IST

ట్రంప్‌ కరోనా బారిన పడ్డ విషయంలో ప్రపంచదేశాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఐరోపా, ఉత్తర దక్షిణ అమెరికా దేశాలు దిగ్ర్భాంతిని, సానుభూతిని వ్యక్తం చేయగా, కొన్ని ఇస్లామిక్‌ దేశాలు హేళన చేశాయి.

ట్రంప్‌కు కరోనా సోకడంపై చైనా రియాక్షన్ ఇది !

ట్రంప్‌ కరోనా బారిన పడ్డ విషయంలో ప్రపంచదేశాల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఐరోపా, ఉత్తర దక్షిణ అమెరికా దేశాలు దిగ్ర్భాంతిని, సానుభూతిని వ్యక్తం చేయగా, కొన్ని ఇస్లామిక్‌ దేశాలు హేళన చేశాయి. ఈ కష్ట సమయంలో మీకు మా పూర్తి మద్దతుంటుంది అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ అధికార పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ మాత్రం ఎగతాళి చేసింది. ‘‘కరోనావైర్‌స్‌ను తక్కువ చేసి చూసినందుకు ట్రంప్‌ దంపతులు తగిన మూల్యం చెల్లించారు. అమెరికాలో పరిస్థితికి ఇది అద్దంపడుతోంది. త్వరలో జరిగే ఎన్నికల్లో ట్రంప్‌ విజయావకాశాలపై ఈ పరిణామం ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని గ్లోబల్‌ టైమ్స్‌ చీఫ్‌ హూ షిజిన్‌ అన్నారు. ఇరాన్‌, సిరియా, ఇరాక్‌లోని ఇస్లామిక్‌ గ్రూపులు, టర్కీ నెగెటివ్‌గా స్పందించాయి. ఇప్పటికి తెలిసొచ్చిందా? అంటూ ఎద్దేవా చేశాయి.  


ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మహమ్మారి కరోనాను మొదటి నుంచి తేలికగా తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సూక్ష్మజీవి గురించి అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఊదరగొట్టారు. వైద్య నిపుణులు హెచ్చరించిన మొదట్లో ట్రంప్ వారి అభిప్రాయాలను సైతం బేఖాతరు చేశారు. దాంతో అగ్రరాజ్యంపై కొవిడ్ పంజా విసిరింది. ఏకంగా రెండు లక్షల మందిని బలిగొంది. ఆర్ధిక వ్యవస్థను కూడా కోలుకోలేని దెబ్బ కొట్టింది. అటు నెమ్మదిగా దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రభావం ఎక్కువ కావడం గమనించిన ట్రంప్ ఆ తర్వాత దిద్దుబాటు చర్యలకు దిగారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ట్రంప్ నిర్ణక్ష్యం కారణంగా యూఎస్ భారీ మూల్యం చెల్లించుకోకతప్పలేదు. 


అనంతరం ట్రంప్ కొవిడ్ వ్యాక్సిన్ విషయమై ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. నిన్న మొన్నటి వరకు అదిగో వ్యాక్సిన్.. ఇదిగో వ్యాక్సిన్.. అంటూ ఊదరగొట్టారు. ఎన్నికల కంటే ముందే వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన అధ్యక్షుడు... తాజాగా అదే వైరస్ బారిన పడ్డారు. ‘‘కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నాం... ఈ శత్రువును మనం నిర్మూలించగలం.’’ అని చెప్పుకొచ్చిన ట్రంప్ ఇప్పుడు అదే శత్రువుతో పోరాడాల్సి రావడం గమనార్హం. కొన్ని సందర్భాల్లో ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ను సైతం కొవిడ్ విషయంలో ఎగతాళి చేశారు. బిడెన్ కరోనా పరీక్షలు చేయించుకోవడం మంచిదంటూ ఉచిత సలహా ఇచ్చారు. తొలి ముఖాముఖి చర్చలో అయితే ట్రంప్ మరింత రెచ్చిపోయారు. 


‘‘మాస్క్‌ పెట్టుకుని ప్రజలకు దూరంగా ఉండే మీరు అమెరికన్లకు ఏం చేరువవుతారు? ప్రపంచంలో నేను చూసిన అతి పెద్ద మాస్క్‌ మీరే..’’ అని హేళన చేశారు. ఇప్పుడు పరిస్థితి తారుమారు అయింది. ట్రంప్ కరోనా సోకి ఆస్పత్రిలో ఉంటే.. బిడెన్ ఎంచక్కా ప్రచార ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్ కొవిడ్ బారిన పడడం అందరినీ షాక్‌కు గురి చేసింది. వివిధ దేశాలు ట్రంప్‌కు కరోనా సోకడం పట్ల విచారం వ్యక్తం చేశాయి. కొన్ని ఇస్లామిక్‌ దేశాలు హేళన చేశాయి. అయితే, ఈ వైరస్ విషయమై మొదటి నుంచి డ్రాగన్ దేశాన్ని టార్గెట్ చేసిన ట్రంప్‌పై ఇప్పుడు ఆ దేశం కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతోంది. ట్రంప్ మహమ్మారి బారిన పడడంపై తనదైన శైలిలో చురకలు అంటిస్తోంది. ఇప్పుడు ట్రంప్‌కు సూక్ష్మజీవి పవర్ ఎంటో తెలుస్తుందని చెబుతోంది డ్రాగన్ దేశం.  

Updated Date - 2020-10-03T17:36:34+05:30 IST