20 వేలకు చేరిన కరోనా బాధితులు
ABN , First Publish Date - 2020-02-06T01:55:51+05:30 IST
చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ కాలమేఘంలా కమ్ముకుంటోంది! చైనాలో నెల రోజుల వ్యవధిలో 20,438 మందికి ఈ వైరస్ సోకింది. దీని

- 426 మంది మృతి.. 492 మంది ఆరోగ్యం విషమం
- వైద్యుల పరిశీలనలో 1.71 లక్షల మంది
- 20పైగా దేశాల్లో 159 కేసుల నమోదు
చైనాలో మొదలై ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ కాలమేఘంలా కమ్ముకుంటోంది! చైనాలో నెల రోజుల వ్యవధిలో 20,438 మందికి ఈ వైరస్ సోకింది. దీని బారిన పడి ఇప్పటిదాకా 426 మంది మరణించారు. మరో 492 మంది పరిస్థితి విషమంగా ఉంది. మరో 2788 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. వీరు కాక.. మరో 23, 214 మందికి వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు.
ఇప్పటికే వైరస్ బారిన పడినవారితో సన్నిహితంగా మెలిగిన 1.71 లక్షల మందిని చైనా అధికారులు పరిశీలనలో ఉంచారు. ఇవన్నీ అధికారిక గణాంకాలు మాత్రమే. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందని.. వైరస్ బారిన పడినవారి సంఖ్య లక్షల్లో ఉంటుందని అంతర్జాతీయ వైద్యనిపుణులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ ఇప్పుడు 20కి పైగా దేశాల్లో 159 మందికి సోకింది. ఈ నేపథ్యంలో.. వైర్‌సపై పోరుకు అన్ని దేశాలూ కలిసి రావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు పిలుపునిచ్చాయి.
కాగా.. కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు వూహాన్‌లో 1000 పడకల ఆస్పత్రిని 10 రోజుల్లో నిర్మించిన చైనా అధికారులు మరో ఆస్పత్రిని కూడా ఇలాగే యుద్ధప్రాతిపదికన నిర్మించారు. 1300 పడకలున్న ఈ ఆస్పత్రిని బుధవారం నుంచి అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు.
తండ్రి క్వారంటైన్‌లో.. ఆకలితో కొడుకు మృతి
చైనాలోని హుబెయ్ ప్రావిన్స్‌కు చెందిన యాంగె చెంగ్.. వయసు 16 ఏళ్లు! కానీ లోకం తెలియని పసివాడితో సమానం. ఎందుకంటే అతడు సెరిబ్రల్ పాల్సీ బాధితుడు. అతడి తండ్రి కరోనా వైరస్ బారిన పడ్డాడనే అనుమానంతో స్థానిక అధికారులు అతణ్ని క్వారంటైన్‌లో ఉంచారు. దీంతో యాంగ్‌చెంగ్‌కు తిండి పెట్టే దిక్కులేకపోయింది. ఫలితంగా ఆకలితో అలమటించి చివరికి ప్రాణాలు విడిచాడు. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించి యాంగ్‌చెంగ్ మరణానికి కారకులైన ఇద్దరు అధికారులను ప్రభుత్వం డిస్మిస్ చేసింది.
వేలాది మంది కరోనా వైరస్ బాధితులకు రాత్రింబవళ్లు వైద్య సేవలు అందించి అలసిపోయిన వైద్యులు.. ఆస్పత్రిలోనే నేలపై కునుకు తీస్తున్నారు. చైనాలో ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోవడంతో డాక్టర్లకు విశ్రాంతి లభించడం లేదు.