గల్ఫ్ వెళ్లే కార్మికుల వేతనాలను తగ్గించిన కేంద్రం

ABN , First Publish Date - 2020-12-20T00:32:18+05:30 IST

కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు త

గల్ఫ్ వెళ్లే కార్మికుల వేతనాలను తగ్గించిన కేంద్రం

జెడ్డా: కొత్తగా గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం వరకు తగ్గిస్తూ భారత ప్రభుత్వం మూడు నెలల క్రితం రెండు సర్క్యలర్‌లు జారీ చేసింది. ఖతార్, బహ్రెయిన్, ఓమాన్, యూఏఈ దేశాలకు వెళ్లే కార్మికుల నెలసరి వేతనాలను 200 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 15 వేలు), కువైట్ (245 డాలర్లు), సౌదీ అరేబియా (324 డాలర్లు)కు తగ్గిస్తూ.. భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ అండ్ ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమ్మిగ్రంట్స్ డివిజన్‌లోని డైరెక్టర్ స్థాయి అధికారి రాజ్ కుమార్ సింగ్ పేరిట సెప్టెంబర్ 8, 21న రెండు వేర్వేరు సర్క్యలర్‌లు జారీ అయ్యాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(దుబాయి)కి వెళ్లే కార్మికులకు వారి నైపుణ్యాన్ని, వృత్తిని బట్టి ఇటీవలి వరకు కనీస వేతనాలు 800 నుండి 1700 దిర్హమ్స్  (సుమారు రూ. 16 నుండి 34 వేలు)గా ఉండేది. ఇప్పుడు కొత్త సర్క్యలర్‌ల ప్రకారం అందరినీ ఒకేగాటన కట్టి 735 దిర్హమ్స్ (సుమారు రూ. 15 వేలు)కు తగ్గిస్తూ సర్క్యలర్‌లు జారీ చేశారు. గల్ఫ్ దేశాల ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రతిపాదన లేకున్నా భారత ప్రభుత్వం.. రిక్రూటింగ్ ఏజెన్సీలు, విదేశీ కంపెనీ మాజమాన్యాల లాబీకి తలొగ్గి, భారత ప్రవాసి కార్మికులకు తీరని అన్యాయం చేసిందని ఇమ్మిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ అధ్యక్షులు మంద భీంరెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. ఎలాంటి అధ్యయనం, చర్చలు లేకుండా మూడు నెలల క్రితం గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ జారీ చేసిన సర్క్యలర్లను రద్దు చేసి, పాత వేతనాలను కొనసాగించాలని కోరుతూ విదేశాంగ మంత్రి జైశంకర్, బీజేపీ ఎంపీ బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డిలకు శనివారం ట్వీట్ చేసినట్లు మంద భీంరెడ్డి తెలిపారు.


ఇదిలా ఉండగా, కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయి గల్ఫ్ దేశాల నుంచి తిరిగొచ్చిన వారు అధిక విమాన ఛార్జీలు, క్వారంటైన్ ఛార్జీలను చెల్లించి నష్టపోయినట్టు చెప్పారు.  యాజమాన్యాల నుంచి వారికి రావాల్సిన జీతం బకాయిలు మరియు బోనస్, పీఎఫ్, గ్రాట్యుటీ లాంటి 'ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్' (ఉద్యోగ విరమణ ప్రయోజనాలు)ను కార్మికులు పొందలేదన్నారు. ఈ క్రమంలో విదేశీ లేబర్ కోర్టులలో న్యాయ పోరాటానికి కావలసిన 'లీగల్ ఎయిడ్' (న్యాయ సహాయం) అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని భీంరెడ్డి కోరారు.


Read more