కుప్పకూలిన కార్గో విమానం.. డబ్బుల కోసం ఎగబడ్డ స్థానికులు
ABN , First Publish Date - 2020-08-23T04:21:39+05:30 IST
సూడాన్‌లో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో విమానం కుప్పుకూలింది.
జూబా, సూడాన్: సూడాన్‌లో టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో విమానం కుప్పుకూలింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 17 మంది మరణించినట్టు వార్తలొస్తున్నాయి. 15 మంది ప్యాసెంజర్లతో పాటు ఇద్దరు సిబ్బంది ఈ ప్రమాదంలో మరణించినట్టు అధికారులు చెబుతున్నారు. తీవ్ర గాయాలపాలైన ఓ వ్యక్తిని ఆసుపత్రికి తరలించామని.. అతడి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. రాజధాని జూబా సమీపంలో ఉన్న ఎయిర్‌పోర్ట్ నుంచి శనివారం ఉదయం 9 గంటలకు(అక్కడి సమయం ప్రకారం) ఈ విమానం బయలుదేరినట్టు తెలుస్తోంది. ఎన్జీవోల కోసం డబ్బు, ఆహారం, వాహనాలు, స్పేర్ పార్ట్‌లను విమానం తీసుకెళ్తున్నట్టు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కుర్ కౌల్ పేర్కొన్నారు. విమానం గాల్లోకి వెళ్లిన కాసేపటికే కుప్పకూలినట్టు.. వెంటనే అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్టు మీడియా చెబుతోంది. ఈ కార్గో విమానం సౌత్ వెస్ట్ ఏవియేషన్‌కు చెందినదిగా తెలుస్తోంది. కాగా.. విమానం కుప్పకూలిన సమయంలో డబ్బులు మొత్తం చెల్లాచెదురుగా పడ్డాయని.. ఇదే సమయంలో చుట్టు పక్కల ప్రజలు డబ్బుల కోసం ఎగబడ్డారని కుర్ కౌల్ తెలిపారు.