కొవిడ్ టీకా తీసుకోను.. అది నా హక్కు: బోల్సోనారో

ABN , First Publish Date - 2020-11-27T21:30:44+05:30 IST

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో... తాజాగా కొవిడ్ టీకా విషయమై కూడా మరోసారి అలసత్వంతో కూడిన వ్యాఖ్యలు చేశారు.

కొవిడ్ టీకా తీసుకోను.. అది నా హక్కు: బోల్సోనారో

బ్రెసిలీయా: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌పై మొదటి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో... తాజాగా కొవిడ్ టీకా విషయమై కూడా మరోసారి అలసత్వంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో తాను కరోనా వ్యాక్సిన్ తీసుకోనేది లేదని చెప్పారు. అంతేగాక అది తన హక్కు అని చెప్పుకొచ్చారు. ఇక బ్రెజిల్‌లో ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా తర్వాత అత్యధిక మరణాలు నమోదైంది బ్రెజిల్‌లోనే. అయినా, అధ్యక్షుడు ఇలా వైరస్ పట్ల అలసత్వం ప్రదర్శించడం గమనార్హం. 


ఇక మొదట్లో దేశంలో కరోనా ప్రభావం అంతగా లేనప్పటికీ.. బోల్సోనారో వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలపై దృష్టిసారించకపోవడంతో తక్కువ వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కొవిడ్ విజృంభించింది. అధ్యక్షుడి నిర్లక్ష్య ధోరణి వల్ల చివరకు అమెజాన్ అడవుల్లోని మారుమూల గ్రామాలకు సైతం వైరస్ పాకింది. కాగా, జూలైలో బోల్సోనారో స్వయంగా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కూడా ఆయన అలసత్వంగా వ్యవహరించారు. మీడియా సమావేశం ద్వారా తనకు కొవిడ్ సోకిన విషయాన్ని తెలియజేసిన ఆయన... మీడియా వాళ్లకు కొంచెం దూరంలో నిలబడి, ముఖానికి ఉన్న మాస్క్ తీసేసి తనకు వైరస్ సోకినట్లు ధృవీకరించారు. ఆ సమయంలో అధ్యక్షుడి చర్యతో ఆశ్చర్యపోవడం మీడియా వాళ్ల వంతైంది. ఇలా మొదటి నుంచి కరోనా పట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న బోల్సోనారో... వ్యాక్సిన్ విషయంలో కూడా అదే నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు. దీనికి తాజాగా ఆయన చేసిన(తాను టీకా తీసుకోనని) వ్యాఖ్యలే నిదర్శనం అని చెప్పవచ్చు.  గురువారం మీడియాతో మాట్లాడిన బోల్సోనారో... తాను ఎట్టిపరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకోనన్నారు. అది తన హక్కు అని చెప్పారు. అలాగే ఫేస్‌మాస్క్‌పై కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మాస్క్ ధరిస్తే వైరస్ వ్యాప్తి చెందదనడానికి సరియైన శాస్త్రీయ ఆధారాలు లేవని బోల్సోనారో చెప్పుకువచ్చారు. అంతేగాక తన దేశ ప్రజలకు కూడా కొవిడ్ టీకా అవసరం లేదని అన్నారు. వ్యాక్సిన్ అవసరం అంటూ ఉంటే అది తన పెంపుడు కుక్కకేనని ఆయన చమత్కరించారు. ఇక బ్రెజిల్‌లో మహమ్మారి విరుచుకుపడుతుంటే.. అధ్యక్షుడు మాత్రం దేశంలో వైరస్ ప్రభావం అంతగా లేదని చెప్పడం కొసమెరుపు. 

Read more