కరోనా ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ సిద్దం.. నేడు ప్రయోగం

ABN , First Publish Date - 2020-03-17T00:06:49+05:30 IST

కొవిడ్-19(కరోనా) ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఏ దేశానికాదేశం కరోనా నియంత్రణకు చర్యలు చేపడుతూనే ఉంది. మరోపక్క వాక్సిన్ తయారుచేయకుండా కేవలం నియంత్రణ చర్యలు తీసుకుంటే వైరస్

కరోనా ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్ సిద్దం.. నేడు ప్రయోగం

మాసెచూసెట్స్: కొవిడ్-19(కరోనా) ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఏ దేశానికాదేశం కరోనా నియంత్రణకు చర్యలు చేపడుతూనే ఉంది. మరోపక్క వ్యాక్సిన్ తయారుచేయకుండా కేవలం నియంత్రణ చర్యలు తీసుకుంటే వైరస్ వ్యాప్తి చెందడం తప్ప తగ్గదంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే 35 కంపెనీలు, అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్లు వ్యాక్సిన్‌ను తయారుచేసే పనిలో పడ్డాయి. వీటిలో నాలుగు కంపెనీలు ఇప్పటికే వ్యాక్సిన్‌ను తయారుచేసి జంతువులపై ప్రయోగించాయి. ఇక అమెరికాలోని మాసెచూసెట్స్‌కు చెందిన మోడర్నా అనే బయోటెక్ కంపెనీ కొవిడ్-19 ఫస్ట్ బ్యాచ్ వ్యాక్సిన్‌ను యూఎస్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్షస్ డిసీజెస్‌కు పంపింది. ఏప్రిల్‌లో ఈ వ్యాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు సిద్దమని మోడార్నా కంపెనీ తెలిపింది. అయితే ముందుగా సోమవారం ఒక పేషంట్‌పై ఎక్స్‌పెరిమెంటల్ డోస్ నిర్వహించనున్నట్టు కంపెనీ పేర్కొంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అన్నది తెలుసుకోవడమే ఈ ప్రయోగం యొక్క లక్ష్యమని సంస్థ పేర్కొంది. సియాటెల్‌లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఈ ప్రయోగం జరగనుంది. 


మోడర్నా తయారుచేసిన ఎమ్ఆర్ఎన్ఏ-1273 వాక్సిన్‌ను 45 మంది యువ, ఆరోగ్య వాలంటీర్లపై ప్రయోగించనున్నారు. మిగతా వ్యాక్సిన్‌ల మాదిరిగా కాకుండా.. ఆర్ఎన్ఏ వాక్సిన్‌లో ఎమ్ఆర్ఎన్ఏ సీక్వెన్స్‌ను ప్రవేశపెట్టారు. కణాలు ఏమి నిర్మించాలన్నది మాలిక్యూల్ చెబుతుంది. ఈ వాక్సిన్‌ను శరీరంలోకి ప్రవేశపెట్టిన తరువాత ఇమ్యూన్ సిస్టమ్ యాంటిజెన్‌ను గుర్తిస్తుంది. అనంతరం వ్యాధికి కారణమైన దాంతో పోరాడుతుంది. ఈ ప్రయోగంలో సైడ్ ఎఫెక్ట్స్ రాకుంటే త్వరలో మరిన్ని పరీక్షలు చేపట్టనున్నట్టు సంస్థ తెలిపింది. మొదటగా చేపట్టే ప్రయోగాలు విజయవంతం అయినప్పటికీ.. ఈ వ్యాక్సిన్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు కనీసం ఏడాది సమయం పడుతుంది. ఈ ప్రయోగం ఎవరిపై చేపడతారో.. వారిపై ఏడాది వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. ఆ తరువాతే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుంటుంది. వివిధ పరీక్షలు, ప్రయోగాలు చేయడానికి కనీసం ఏడాది సమయమైనా పడుతుందంటూ వాక్సిన్‌ను తయారుచేస్తున్న కంపెనీలు చెబుతున్నాయి. చైనాకు చెందిన శాస్త్రవేత్తలు ఎస్ఏఆర్ఎస్-సీఓవీ-2 అనే వైరస్‌కు చెందిన జీనోమ్ సీక్వెన్స్‌ను వెలికితీయడంతో వాక్సిన్ రూపకల్పన ప్రక్రియ వేగవంతమైందని వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. నవంబర్‌లోగా కరోనాకు వ్యాక్సిన్‌ను సిద్దం చేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మరోపక్క వ్యాక్సిన్‌ సిద్దమవ్వడానికి కనీసం 18 నెలలు పడుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. 

Updated Date - 2020-03-17T00:06:49+05:30 IST