ఆపత్కాలంలో ఆదుకోవాలంటూ.. బెంగళూరు వైద్యురాలికి బ్రిట‌న్ అభ్య‌ర్థ‌న‌

ABN , First Publish Date - 2020-05-08T10:12:36+05:30 IST

కరోనా బాధిత దేశాల్లో బ్రిటన్‌ ముందు వరుసలో ఉంది. ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి పెద్ద యుద్ధమే చేస్తోంది. రోజు రోజుకూ పేషెంట్లు పెరిగి... వైద్యులకు నిద్రాహారాలు లేని పరిస్థితి.

ఆపత్కాలంలో ఆదుకోవాలంటూ.. బెంగళూరు వైద్యురాలికి బ్రిట‌న్ అభ్య‌ర్థ‌న‌

కరోనా బాధిత దేశాల్లో బ్రిటన్‌ ముందు వరుసలో ఉంది. ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడానికి పెద్ద యుద్ధమే చేస్తోంది. రోజు రోజుకూ పేషెంట్లు పెరిగి... వైద్యులకు నిద్రాహారాలు లేని పరిస్థితి. ఈ ఆపత్కాలంలో ఆదుకోవాలంటూ బెంగళూరుకు చెందిన డాక్టర్‌ రూపా వెంకటేశ్‌ను... ఆ దేశం అభ్యర్థించింది. గతంలో అక్కడ వైద్యురాలిగా అనుభవమున్న ఆమె... తన ప్రాణాలకు ముప్పని తెలిసీ బ్రిటన్‌కు బయలుదేరుతున్నారు.


సంతోషాన్ని పంచుకోవడమే కాదు... కష్టాల్లో కన్నీళ్లు కూడా తుడవాలి. అదే మానవత్వం. బ్రిటన్‌ వెళ్లాలని డాక్టర్‌ రూపా వెంకటేశ్‌ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే అందుకు నిదర్శనం. బెంగళూరులో ఎంబీబీఎస్‌ తరువాత రూప 2002లో బ్రిటన్‌ వెళ్లారు. పీజీ చేశారు. ఆ తరువాత పదిహేనేళ్లపాటు అక్కడే ఉండిపోయారు. యూకే రెసిడెన్స్‌ పర్మిట్‌తో పాటు జనరల్‌ ప్రాక్టీషనర్‌గా ప్రాక్టీస్‌ చేసుకొనేందుకు కూడా ఆమెకు లైసెన్స్‌ ఉంది. అయితే 2016లో తిరిగి బెంగళూరు వచ్చేశారు రూప. భర్త డాక్టర్‌ వెంకటేశ్‌తో కలిసి సొంత క్లినిక్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. వెంకటేశ్‌కు కూడా బ్రిటన్‌లో ప్రాక్టీస్‌కి లైసెన్స్‌ ఉంది. వీరికి 13 ఏళ్లు, 8 ఏళ్లు వయసున్న ఇద్దరు మగపిల్లలు, మూడేళ్ల ఆడపిల్ల సంతానం. చీకూ చింతా లేకుండా సాగిపోతోంది జీవితం. 


ఇంతలో బ్రిటన్‌ ప్రభుత్వం నుంచి ఆమెకో మెయిల్‌ వచ్చింది. ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడటానికి సహకరించాలంటూ అక్కడ లైసెన్స్‌ ఉన్న వైద్యులందరినీ బ్రిటన్‌ కోరుతోంది. ఆ క్రమంలోనే రూపను కూడా అభ్యర్థించింది. రోజూ వందల సంఖ్యలో మృత్యువాతపడుతున్న బ్రిటన్‌ లాంటి దేశంలో సేవలందించడానికి వైద్యులే భయపడుతున్నారు. కానీ రూప మాత్రం అలా కాదు! మెయిల్‌ వచ్చిన వెంటనే ఆమె తన సమ్మతిని తెలిపారు. తన పెద్ద కొడుకు స్కందతో కలిసి ప్రయాణానికి సిద్ధమయ్యారు. విశేషమేమంటే... స్కంద కూడా అక్కడ వాలంటీర్‌గా పనిచేయాలనుకోవడం! 


‘‘బ్రిటన్‌లోని హాస్పిటల్స్‌లో చాలా ఏళ్లు పనిచేశాను. ఆ అనుభవంతో ఇలాంటి విషమ పరిస్థితుల్లో మరింత విస్తృత స్థాయిలో సేవలందించగలనని భావిస్తున్నాను. ఎప్పుడూ మన కోసమే కాదు... సమాజం కోసం కూడా ఆలోచించాలి. అందుకే ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాను. అలాగని నా ప్రాణాలను నేను నిర్లక్ష్యం చేస్తున్నానని కాదు... ప్రస్తుతం బ్రిటన్‌లో అనుభవంగల నా లాంటి డాక్టర్ల అవసరం ఉంది’’ అంటూ చెప్పుకొచ్చారు రూప. 


బ్రిటన్‌లో ఉన్నప్పుడు ఆమె అనేకమంది స్వైన్‌ఫ్లూ పేషెంట్లకు వైద్యం అందించారు. ఇరాన్‌-ఇరాక్‌ల మధ్య జరిగిన రసాయన యుద్ధ బాధితులకు కూడా చికిత్స చేశారు. వాస్తవానికి ఆమె పాస్‌పోర్ట్‌ గడువు రానున్న జూలైతో ముగిసిపోతోంది. రెన్యూవల్‌ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కార్యకలాపాలన్నీ స్తంభించినా, రూపా అభ్యర్థనను ప్రత్యేక కేసుగా తీసుకుంది ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రం. అత్యవసర సేవల కోసం వెళుతున్న ఆమెకు పాస్‌పోర్ట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. అది రాగానే బ్రిటన్‌ ప్రభుత్వం నడిపించే ఏదో ఒక ప్రత్యేక విమానంలో రూప వెళతారు.

Updated Date - 2020-05-08T10:12:36+05:30 IST