బీరుట్ ఘటనలో 171కు చేరుకున్న మరణాల సంఖ్య
ABN , First Publish Date - 2020-08-12T04:12:06+05:30 IST
లెబనాన్ రాజధాని బీరుట్లో సంభవించిన భారీ పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య 171కు చేరింది.

బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్లో సంభవించిన భారీ పేలుళ్లలో మరణించిన వారి సంఖ్య 171కు చేరుకున్నట్టు అక్కడి ఆరోగ్యశాఖ తాజాగా వెల్లడించింది. సరిగ్గా వారం రోజుల క్రితం బీరుట్ పేలుళ్లు సంభవించాయి. పేలుడు ధాటికి రాజధాని తీవ్ర విధ్వంసానికి గురికావడంతో పాటు, పోర్టు మొత్తం భస్మీపటలం అయిపోయింది. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 6 వేల మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ఇక లెబనాన్‌లో ఈ పేలుళ్లకు సంబంధించి పెల్లుబుకిన ఆగ్రహజ్వాలలకు ప్రభుత్వం తలొగ్గింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మొత్తం మంత్రివర్గం రాజీనామా చేసేసింది. ప్రధానమంత్రి హసన్ దియాబ్ అధ్యక్ష భవనానికి వెళ్లి తమ అందరి తరపున రాజీనామా అందజేసినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. బీరుట్లో గత మంగళవారం చోటుచేసుకున్న భారీ పేలుడుపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు చెలరేగిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశానికి ముందే ముగ్గురు మంత్రులు తమ పదవులకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆదివారం సమాచార మంత్రి, పర్యావరణ మంత్రులు రాజీనామా చేయగా.. సోమవారం న్యాయశాఖ మంత్రి మేరీ క్లాడ్ నజమ్ రాజీనామా చేశారు.