బహ్రెయిన్‌లో మిలియన్ మార్కును దాటిన కోవిడ్ టెస్టులు !
ABN , First Publish Date - 2020-08-20T19:55:41+05:30 IST
గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ కరోనా నిర్ధారణ పరీక్షల్లో మిలియన్ మార్కును దాటింది. ఈ మేరకు బుధవారం బహ్రెయిన్ ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

మనామా: గల్ఫ్ దేశమైన బహ్రెయిన్ కరోనా నిర్ధారణ పరీక్షల్లో మిలియన్ మార్కును దాటింది. ఈ మేరకు బుధవారం బహ్రెయిన్ ఆరోగ్యశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు 'ట్రేస్, టెస్ట్, ట్రీట్' వ్యూహంలో భాగంగా ఈ మైలురాయిని చేరుకున్నట్లు బహ్రెయిన్ ఆరోగ్య మంత్రి ఫైకా బింట్ సయీద్ అల్సలేహ్ తెలిపారు. బహ్రెయిన్‌లోని ప్రతి 1,000 మందిలో 675 మందికి పరీక్షలు నిర్వహించామని, ఇది ప్రపంచంలో అత్యధిక రేట్లలో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. ఇలా ముమ్మరంగా కోవిడ్ టెస్టులు నిర్వహించడం వల్లే తమ దేశ రికవరీ రేటు 92.2 శాతంగా ఉందని మంత్రి తెలియజేశారు.
ఇక బుధవారం దేశవ్యాప్తంగా 369 కొత్త కేసులు నమోదైతే... 357 రికవరీలు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 47,950కు చేరితే... మొత్తం కోలుకున్నవారు 44278 మంది అయ్యారు. కాగా, ఇప్పటికే 178 మందిని కోవిడ్ పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 3,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే... ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్ ఇప్పటివరకు రెండు కోట్ల 25 లక్షల మందికి ప్రబలింది. అలాగే 7.91 లక్షల మందిని కబళించింది.