జనసమూహాలపై బహ్రెయిన్ ఆంక్షలు.. ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు
ABN , First Publish Date - 2020-03-27T18:45:41+05:30 IST
కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గల్ఫ్ దేశాలు ఆంక్షలు విధించాయి.
బహ్రెయిన్: కరోనావైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే గల్ఫ్ దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ మహమ్మారి వ్యాప్తి, నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాయి. తాజాగా బహ్రెయిన్ కూడా జనసమూహాలపై ఆంక్షలు విధించింది. రోడ్లు, బీచ్‌లు, పార్కులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురికి మించి కనిపించకూడదని ఆంక్షలు విధించింది. ఒకవేళ ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు (లేదా) 5వేల బహ్రెయిన్ దినార్(రూ. 9, 91,410) జరిమానా (లేదా) రెండు విధించే అవకాశం కూడా ఉందని క్రౌన్ ప్రిన్స్, డిప్యూటీ సుప్రీం కమాండర్, అంతర్గత మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా తెలిపారు.
వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి సమావేశ నిషేధ చర్యలను పాటించాలని దేశ పౌరులు, నివాసితులకు అంతర్గత వ్యవహారాల శాఖ పిలుపునిచ్చింది. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా, బహ్రెయిన్‌లో ఇప్పటి వరకు 458 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు చనిపోయారు. 204 మంది కోలుకున్నారు.