హిట్లర్ మీమ్‌తో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి రూ. కోటి నష్ట పరిహారం

ABN , First Publish Date - 2020-08-11T23:44:10+05:30 IST

అడాల్ఫ్ హిట్లర్ మీమ్‌తో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తికి నష్టపరిహారంగా 1,43,000 డాలర్లు(రూ. కోటి 6 లక్షలు) లభించాయి.

హిట్లర్ మీమ్‌తో ఉద్యోగం కోల్పోయిన వ్యక్తికి రూ. కోటి నష్ట పరిహారం

సిడ్నీ: అడాల్ఫ్ హిట్లర్ మీమ్‌తో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తికి నష్టపరిహారంగా 1,43,000 డాలర్లు(రూ. కోటి 6 లక్షలు) లభించాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్కాట్ ట్రేసీ అనే వ్యక్తి ఆస్ట్రేలియాలోని బీపీ అనే పెట్రోలియం సంస్థలో పనిచేసేవాడు. 2019 జనవరిలో స్కాట్ తమ సిబ్బందికి సంబంధించిన ఫేస్‌బుక్ గ్రూప్‌లో హిట్లర్ మీమ్ పోస్ట్ చేశాడు. హిట్లర్ మీమ్ కంపెనీ నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ సంస్థ స్కాట్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో స్కాట్ ఫెయిర్ వర్క్ కమిషన్(ఎఫ్‌డబ్ల్యూసీ)ను ఆశ్రయించాడు. స్కాట్‌ను అన్యాయంగా సంస్థ తొలగించిందని ఈ ఏడాది మొదట్లో ఎఫ్‌డబ్ల్యూసీ తీర్పునిస్తూ అతడు తిరిగి పనిలో చేరేలా మార్గాన్ని సుగమం చేసింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ బీపీ సంస్థ మే నెలలో ఫెడరల్ కోర్టుకు వెళ్లగా అక్కడ సంస్థకు వ్యతిరేకంగానే  తీర్పువచ్చింది. ఇక స్కాట్ ఇప్పటివరకు కోల్పోయిన ఆదాయాన్ని పూడ్చేందుకు ఎఫ్‌డబ్ల్యూసీ అతడికి 1,43,000(రూ. కోటి 6 లక్షలు) డాలర్ల పరిహారాన్ని ఇస్తున్నట్టు తాజాగా వెల్లడించింది. స్కాట్‌ను తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని కూడా బీపీ సంస్థకు సూచించింది. మరోపక్క తాము ఎఫ్‌డబ్ల్యూసీ నిర్ణయంపై సమీక్ష జరుపుతున్నట్టు బీపీ సంస్థ మంగళవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇక ఆస్ట్రేలియన్ వర్కర్స్ యూనియన్(ఏడబ్ల్యూయూ) కూడా ఎఫ్‌డబ్ల్యూసీ నిర్ణయాన్ని స్వాగతించింది.

Updated Date - 2020-08-11T23:44:10+05:30 IST