అమెరికాలో కరోనా కట్టడికి మరో నెలరోజులు కావాలి: ప్రవాసాంధ్ర వైద్యుడు

ABN , First Publish Date - 2020-04-07T13:26:10+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా మరో నెల రోజుల పాటు కరోనా తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ప్రవాసాంధ్ర వైద్యుడు, అమెరికాలోని అలబామా రాష్ట్రం.. సౌత్‌ఈ్‌స్ట హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవి నల్లమోతు తెలిపారు. భారతదేశంలో లాక్‌డౌన్‌ నిర్ణయం సత్ఫలితాలనిస్తున్నదంటున్న ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ ముచ్చటించింది.

అమెరికాలో కరోనా కట్టడికి మరో నెలరోజులు కావాలి: ప్రవాసాంధ్ర వైద్యుడు

ప్రవాసాంధ్ర వైద్యుడు డాక్టర్‌ రవి నల్లమోతు

ప్రపంచవ్యాప్తంగా మరో నెల రోజుల పాటు కరోనా తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ప్రవాసాంధ్ర వైద్యుడు, అమెరికాలోని అలబామా రాష్ట్రం.. సౌత్‌ఈ్‌స్ట హాస్పిటల్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రవి నల్లమోతు తెలిపారు. భారతదేశంలో లాక్‌డౌన్‌ నిర్ణయం సత్ఫలితాలనిస్తున్నదంటున్న ఆయనతో ‘ఆంధ్రజ్యోతి’ ముచ్చటించింది.


అమెరికాలో కరోనా తీవ్రత ఎలా ఉంది?

న్యూయార్క్‌లో కరోనా తీవ్రత పతాకస్థాయికి చేరింది. ప్రభుత్వం నేరుగా లాక్‌డౌన్‌ ప్రకటించనప్పటికీ.. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో సాధారణ జనజీవనం నిలిచిపోయింది. నేనుంటున్న అలబామాతో పా టు చాలా రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షల్లో జాప్యం, వైద్యపరికరాల కొరత వంటి కారణాలతో అమెరికాలో దీని తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ అంతర్జాతీయ విమానాలు చాలావరకు నడుస్తున్నాయి. కొవిడ్‌-19ను కట్టడి చేయలేకపోవడానికి ఇది కూడా కొంత కారణమనే ఆందోళన వ్యక్తమౌతోంది.


మీరు ఇటీవలే భారత్‌ వచ్చినట్టున్నారు?

నెల రోజుల సెలవులపై మార్చి ప్రారంభంలో భార త్‌కు వచ్చాను.  హైదరాబాద్‌లో పుట్టి, పెరిగాను. గాంధీ ఆస్పత్రిలో మెడిసిన్‌ చేశాను. పదేళ్లుగా అమెరికాలో సేవలందిస్తున్నాను. భారత్‌లో లాక్‌డౌన్‌ విధించిన వెంటనే ఇక్కడకు అత్యవసరంగా రమ్మని పిలుపు రావడంతో తిరిగి అమెరికా చేరుకున్నాను. 


కొవిడ్‌పై అమెరికా సన్నద్ధత ఎలా ఉంది?

నిన్న, మొన్నటి వరకు చాలా రాష్ట్రాల్లో అమెరికా వైద్యులకు వ్యక్తిగత సంరక్షణ కిట్లు అందుబాటులో లేవు. దీంతో వైద్యులు పాలిథిన్‌ ట్రాష్‌ బ్యాగులను రక్షణ దుస్తులుగా ధరించిన సందర్భాలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాస్కుల కొరత తీవ్రంగా ఉంది.  న్యూయార్క్‌ వంటి రాష్ట్రాల్లో వేగంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతుండగా, ఇతర రాష్ట్రాల్లో ఒకటి, రెండు రోజులు పడుతోంది.


అమెరికాలో లాక్‌డౌన్‌ లేకపోవడం.. భారత్‌లో విధింపును మీరెలా చూస్తారు?

భారత్‌లో లాక్‌డౌన్‌ విధించి ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. వైద్యసౌకర్యాలు నామమాత్రంగానే ఉన్న భారత్‌లో కరోనా విజృంభిస్తే నిస్సహాయంగా చూడడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అమెరికా పరిస్థితి వేరు. లక్షలాది పర్యాటకులు అమెరికాను సందర్శించే సీజన్‌ ఇది. పైగా ఇక్కడ ఉద్యోగులు జీతంగా అర్జించే మొత్తాన్ని పైసా కూడా మిగుల్చుకోకుండా ఖర్చు చేసుకోవడానికి అలవాటుపడ్డారు. జీతాలు రాకపోతే అలజడి ఏర్పడి, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ప్రభుత్వం భావించింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అమెరికా లాక్‌డౌన్‌ ప్రకటించలేకపోయింది. అదే అమెరికాకు, ప్రధానంగా న్యూయార్క్‌ వంటి నగరాలకు సమస్యగా మారింది.


కరోనాకు పూర్తిస్థాయి పరిష్కారం ఎప్పుడని భావిస్తున్నారు?

అమెరికాతో పాటు పలు దేశాల్లో కరోనా ప్రస్తుతం పతాకస్థాయికి చేరింది. ఈ స్థితి నుంచి ఒక్క కరోనా కేసు కూడా లేని స్థితికి రావడానికి కనీసం నెల రోజుల వ్యవధి అయినా పడుతుంది. భారత్‌ వంటి దేశాల్లో మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే మే చివరికల్లా కరోనా తీవ్రత పెరిగే ప్రమాదముంది. సామాజిక దూరం పాటించడం, వీలైనంత మేరకు పరిశుభ్రత చర్యలు పాటించడం మనందరి ముందున్న తక్షణ కర్తవ్యం. -స్పెషల్‌ డెస్క్‌

Read more