కొవిడ్ ఎఫెక్ట్.. కస్టమర్లకు షాకింగ్ న్యూస్ చెప్పిన యాపిల్ సంస్థ!
ABN , First Publish Date - 2020-12-20T21:01:02+05:30 IST
అమెరికా, బ్రిటన్‌లో కొవిడ్ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

వాషింగ్టన్: అమెరికా, బ్రిటన్‌లో కొవిడ్ కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 69 స్టోర్‌లను తాత్కాలికంగా మూసేయడానికి సిద్ధమైంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కరోనా కాటుకు బలవుతున్నారు. ముఖ్యంగా కాలిఫోర్నియాలో ఈ మహమ్మారి కల్లోకలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ రాష్ట్రం కొవిడ్ వైరస్‌కు హాట్‌స్పాట్‌గా మారింది. యూకేలోనూ ఈ మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. దీంతో అక్కడ మళ్లీ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
ఈ క్రమంలో యాపిల్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కాలిఫోర్నియాలో ఉన్న 53 స్టోర్‌లతోపాటు, యూకేలోని 16 స్టోర్‌లను తాత్కాలికంగా మూసేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నాం. కొవిడ్ విజృంభిస్తున్న కారణంగా కొన్ని ప్రాంతాల్లో స్టోర్‌లను తాత్కాలికంగా మూసేయాల్సి వస్తోంది. సాధ్యమైనంత తొందరగా తిరిగి కస్టమర్లకు అందుబాటులోకి వస్తాం’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికాలో ఇప్పటి వరకు 17.4 మిలియన్ల మంది కొవిడ్ బారినపడగా ఇందులో 3.14లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.