పెద్ద సమస్యే.. ఏం జరుగుతుందో చూడాలి: ట్రంప్‌

ABN , First Publish Date - 2020-06-22T14:11:23+05:30 IST

భారత్‌, చైనాల మధ్య పెద్ద సమస్యే వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని తెలిపారు. ‘‘ఇది అత్యంత గడ్డు కాలం. మేం భారత్‌తో మాట్లాడుతున్నాం. చైనాతోనూ మాట్లాడుతున్నాం. వారి మధ్య పెద్ద సమస్య ఉంది’’ అని..

పెద్ద సమస్యే.. ఏం జరుగుతుందో చూడాలి: ట్రంప్‌

వాషింగ్టన్‌, జూన్‌ 21: భారత్‌, చైనాల మధ్య పెద్ద సమస్యే వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఇరుదేశాల మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని, వాటిని పరిష్కరించేందుకు అమెరికా ప్రయత్నిస్తుందని తెలిపారు. ‘‘ఇది అత్యంత గడ్డు కాలం. మేం భారత్‌తో మాట్లాడుతున్నాం. చైనాతోనూ మాట్లాడుతున్నాం. వారి మధ్య పెద్ద సమస్య ఉంది’’ అని అన్నారు. కరోనా వచ్చిన తర్వాత తొలిసారి ఓక్లహామాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లేముందు ఆయన శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడారు.


భారత్‌, చైనాల మధ్య పరిస్థితిపై మీ అంచనా ఏమిటన్న ప్రశ్నకు ట్రంప్‌ స్పందిస్తూ.. ‘‘భారత్‌, చైనా తీవ్రస్థాయిలో ఘర్షణపడ్డాయి. మేం పరిస్థితులను గమనిస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి’’ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చైనాపై ధ్వజమెత్తారు. ప్రపంచ దేశాలన్నీ కరోనాపై పోరాడుతుండగా చైనా మాత్రం పొరుగుదేశాలతో కయ్యానికి కాలుదువ్వుతూ తన దుర్బుద్ధిని చాటుకుందని ఆరోపించారు.  


అది ‘కుంగ్‌ ఫ్లూ’ 

కొవిడ్‌-19 వైరస్‌ విషయంలో ట్రంప్‌ మరోసారి చైనాపై ధ్వజమెత్తారు. వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి ఆ దేశమే కారణమన్నారు. ఓక్లహామాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా 4.50 లక్షల మంది చనిపోయారని, 85 లక్షల మందికి పైగా వైర్‌సబారిన పడ్డారని, దీనంతటికీ కారణం చైనాయేనని ఆరోపించారు. ఈ వైర్‌సను ఆయన ‘కుంగ్‌ ఫ్లూ’గా అభివర్ణించారు. వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్‌ వివరాలను చైనా ప్రపంచానికి చెప్పకుండా దాచిపెట్టిందని విమర్శించారు. అందరూ ఇదో వైరస్‌ అంటున్నారని.. కానీ, తాను దీన్ని కుంగ్‌ ఫ్లూ అంటానని చెప్పారు. మరోవైపు టల్సా, ఓక్లహామాల్లో ట్రంప్‌ ర్యాలీల కోసం పనిచేసిన ఆరుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఎవరూ నేరుగా ర్యాలీకి హాజరు కాలేదని అధికారులు చెప్పారు. టల్సాలో ట్రంప్‌ ర్యాలీ వద్ద ఆందోళనకారులు ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ అంటూ నినాదాలు చేశారు.  


టెస్టులు తక్కువ చేస్తే సరి..! 

అమెరికాలో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులను తగ్గించేందుకు ట్రంప్‌ తన అధికారులకు ఓ సలహా ఇచ్చారు. టెస్టుల సంఖ్యను తగ్గించాలన్నారు. అమెరికాలో 2.50 కోట్ల మందికి టెస్టులు చేశామని, ఏ దేశంలోనూ ఈ స్థాయిలో పరీక్షలు చేయలేదని చెప్పారు. ఇన్ని పరీక్షలు చేయడం వల్లే అత్యధిక కేసులు నమోదవుతున్నాయన్నారు. కాబట్టి   టెస్టుల సంఖ్యను తగ్గించాలని సూచించినట్లు చెప్పారు. 


Updated Date - 2020-06-22T14:11:23+05:30 IST