న్యూయార్క్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2020-07-19T04:37:07+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

న్యూయార్క్‌లో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే..

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్ నెలల్లో అయితే న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేది. నిత్యం వందలాది మంది చనిపోయేవారు. దేశంలో ఇప్పటికి కరోనా వ్యాప్తి తగ్గకపోయినా.. న్యూయార్క్‌లో మాత్రం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది. న్యూయార్క్‌లో శుక్రవారం 754 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తంగా నిర్వహించిన పరీక్షల్లో కేవలం 1.3 శాతం మందికి మాత్రమే కరోనా పాజిటివ్‌గా తేలింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 4,06,305కు చేరింది. ఇక శుక్రవారం కరోనా కారణంగా 11 మంది మరణించగా.. ఈ సంఖ్య 25,035కు చేరింది. న్యూయార్క్‌లో గత కొద్ది కాలం నుంచి పాజిటివ్ రేట్ ఒక శాతానికి అటు ఇటుగానే ఉంటోంది. గతంలో నిత్యం వంద మందికి తగ్గకుండా చనిపోయేవారు. ఇప్పుడు ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణిస్తున్న వారి సంఖ్య చాలా వరకు తగ్గిందనే చెప్పుకోవాలి. 


న్యూయార్క్ ప్రజలు ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి సమర్థవంతంగా చేయడం వల్లే కరోనా అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం చెబుతోంది. కేసులు తగ్గాయని ప్రజలు నిర్లక్ష్యం వహించకూడదని.. కరోనాతో ఇంకా చాలా పోరాటం చేయాల్సి ఉందని తెలిపింది. ఇక అమెరికాలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఇదే నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా న్యూయార్క్ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. గడిచిన వారం రోజుల్లో ఏ రాష్ట్రంలో అయితే పాజిటివ్ రేట్ పది శాతానికి పైగా ఉందో ఆ రాష్ట్రాలపై నిబంధనలు విధించింది. ఆయా రాష్ట్రాల నుంచి న్యూయార్క్ వచ్చే వారు తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

Updated Date - 2020-07-19T04:37:07+05:30 IST