వీడియో: బిడ్డను ఎత్తుకున్నట్టు మొసలిని ఎత్తుకుని.. ఫ్లోరిడాలో..

ABN , First Publish Date - 2020-06-12T00:47:20+05:30 IST

పిల్లులు, కుక్కలను పెంచుకునే వారిని చూస్తూనే ఉంటాం. మరి కొంతమంది

వీడియో: బిడ్డను ఎత్తుకున్నట్టు మొసలిని ఎత్తుకుని.. ఫ్లోరిడాలో..

కొకొ బీచ్: పిల్లులు, కుక్కలను పెంచుకునే వారిని చూస్తూనే ఉంటాం. మరి కొంతమంది పెద్దగా ప్రమాదం లేని ఇతర జంతువులను కూడా పెంచుకుంటూ ఉంటారు. అయితే మొసలిని పెంచుకునే వారి గురించి మాత్రం ఎక్కడా విని ఉండం. కానీ.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ వ్యక్తి మొసలిని పెంచుకుంటున్నాడు. కొకొ బీచ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ మొసలికి స్వీటీ అని నామకరణం కూడా చేశాడు. స్వీటీకి సంబంధించిన ఓ టిక్ టాక్ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అయింది. పైనున్న వీడియోను చూస్తే.. ఓ షాపు ఎదుట పసుపు రంగు దుస్తులు వేసుకుని ఉన్న మొసలి కనిపిస్తుంది. ఆ మొసలిని షాపులో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి చంటిబిడ్డను ఎత్తుకున్నట్టు ఎత్తుకుని షాపులోకి తీసుకెళ్లడం కూడా చూడవచ్చు. ఆ వ్యక్తి పేరు లూయి మోర్‌హెడ్. అతడే స్వీటీని పెంచుకుంటూ వస్తున్నాడు. స్వీటీకి ఇప్పుడు ఆరేళ్ల వయసని..  స్వీటీ చిన్న వయసులో ఉన్నప్పుడు వైల్డ్‌లైఫ్ పార్క్‌లో గాయాలతో కనిపించిందని.. ఆ సమయంలో స్వీటీకి కళ్లు కూడా పోయాయని లూయి చెప్పాడు. ఇక స్వీటీని రక్షించి తానే పెంచుకుంటూ వస్తున్నట్టు తెలిపాడు. స్వీటీ ఎవరిని ఏం చేయదని.. ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటుందని లూయి చెబుతున్నాడు. శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు తాను స్వీటీని షాపుకు తీసుకువస్తుంటానని లూయి చెప్పాడు. కాగా.. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Updated Date - 2020-06-12T00:47:20+05:30 IST