కరోనాపై పోరులో భారత్‌కు అండగా అగ్రరాజ్యం.. విరాళంగా వెంటిలేటర్లు
ABN , First Publish Date - 2020-05-17T13:20:02+05:30 IST
కరోనాపై పోరులో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. రోగుల చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లను భారత్‌కు విరాళంగా అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత్, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని.. ప్రధాని నరేంద్ర మోదీ మంచి స్నేహితుడని పునరుద్ఘాటించారు.

కరోనాపై పోరులో అండగా ఉంటాం: ట్రంప్
వాషింగ్టన్, మే 16: కరోనాపై పోరులో భారత్‌కు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. రోగుల చికిత్సకు అవసరమైన వెంటిలేటర్లను భారత్‌కు విరాళంగా అందజేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. భారత్, అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని.. ప్రధాని నరేంద్ర మోదీ మంచి స్నేహితుడని పునరుద్ఘాటించారు. ‘‘భారత్‌లోని స్నేహితుల కోసం అమెరికా వెంటిలేటర్లను విరాళంగా అందజేస్తుందని ప్రకటించడానికి గర్వపడుతున్నా’’ అని ట్రంప్ ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే ఎన్ని వెంటిలేటర్లను ఇస్తున్నారన్న విషయాన్ని మాత్రం శ్వేతసౌధం వెల్లడించలేదు. ‘‘మేం చాలా వెంటిలేటర్లను భారత్‌కు పంపుతాం. నేను ప్రధాని మోదీతో మాట్లాడాను. పెద్ద సంఖ్యలోనే వెంటిలేటర్లను పంపుతాం’’ అని ట్రంప్ విలేకర్లతో చెప్పారు.
కనిపించని శత్రువుపై కలిసి పోరాడి విజయం సాధిస్తామని, ప్రస్తుత సంక్షోభ సమయంలో భారత్‌కు, ప్రధాని మోదీకి అండగా ఉంటామని స్పష్టం చేశారు. కాగా.. ట్రంప్ ప్రకటనకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘థాంక్యూ ట్రంప్. మహమ్మారిపై పోరులో మనమంతా కలిసి పనిచేయాల్సిందే. ఇలాంటి సమయంలో అన్ని దేశాలూ కలిసిమెలిసి పనిచేయాలి. ప్రపంచానికి కరోనా నుంచి విముక్తి కల్పించేందుకు దేశాలన్నీ ఎంత ఎక్కువ పనిచేస్తే అంత మంచిది’’ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత్‌తో పాటు పలు దేశాలకు వెంటిలేటర్లను అందిస్తున్నామని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ మెక్ ఎనానీ చెప్పారు. కరోనాకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు భారతీయ అమెరికన్లు చేస్తున్న కృషి ఎనలేదని ట్రంప్ కొనియాడారు. వారు గొప్ప పరిశోధకులని ప్రశంసించారు.
ఆంక్షలతో ప్రవాసుల్లో అసహనం
వీసాలకు సంబంధించి కేంద్రం విధించిన ఆంక్షలపై ‘ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఐ)’ కార్డులున్న భారత అమెరికన్లలో తీవ్ర అసహనం నెలకొంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్య ల్లో భాగంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తూ కేం ద్రం గత నెలల్లో ఓసీఐ కార్డులను తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రవాసులు వీసా రహిత ప్రయాణానికి అనువుగా ఈ కార్డులను మంజూరు చేస్తోంది. అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలు గత ఏడాది 90వేలకు పైగా కార్డులు జారీ చేశాయి. పలువురు హెచ్1బీ, గ్రీన్‌కార్డుదారుల పిల్లలు అక్కడే పుట్టడంతో వారంతా ఓసీఐ పరిధిలోకి వస్తారు. కేంద్రం ఆంక్షల వల్ల ఓసీఐ కార్డులున్న మైనర్ల తల్లిదండ్రులే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు.