అబుధాబిలో టికెట్ బుకింగ్ కేంద్రాన్ని మార్చిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్..
ABN , First Publish Date - 2020-07-10T18:02:12+05:30 IST
భారత ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తన టికెట్ బుకింగ్ కేంద్రాన్ని అబుధాబి రాజధాని నుంచి అల్ మినాలో గల ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఐఎస్సీ)కు మార్చింది.

అబుధాబి: భారత ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తన టికెట్ బుకింగ్ కేంద్రాన్ని అబుధాబి రాజధాని నుంచి అల్ మినాలో గల ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఐఎస్సీ)కు మార్చింది. ఈ కేంద్రంలో ఇవాళ్టి(జూలై 10) నుంచి కార్యాకలాపాలు మొదలుకానున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయం తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు. 'వందే భారత్ మిషన్'లో భాగంగా జూన్ 28 నుంచి డైరెక్ట్ సెల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రోజురోజుకు టికెట్ బుకింగ్ కోసం వస్తున్న భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. దీంతో ఎలక్ట్రా స్ట్రీట్లో గల ఎయిరిండియా ఎక్స్ప్రెస్ టికెట్ బుకింగ్ కేంద్రంలో రద్దీ అమాంతం పెరిగిపోయింది.
ఇక ఈ కేంద్రం భవనంలోని మొదటి అంతస్తులో ఉండడం కూడా అధికారులకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే క్యూ పెరిగినప్పుడల్లా భవనం నుంచి ప్రయాణికులు స్ట్రీట్ బయట వరకు నిబడుతున్నారు. ఆ సమయంలో కొందరు సమూహంగా ఏర్పడి ముచ్చటించుకోవడం కూడా జరుగుతోంది. దీంతో ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇది ఏ మాత్రం మంచిది కాదని భావించిన అధికారులు ఈ సమస్యను అధిగమించేందుకు ఏకంగా టికెట్ బుకింగ్ కేంద్రాన్ని మార్చేశారు. దీనిలో భాగంగానే అల్ మినాలోని ఇండియా సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ (ఐఎస్సీ)కు మార్చారు. కాగా, 'వందే భారత్ మిషన్'లో భాగంగా నాల్గో దశలో యూఏఈ నుంచి విమాన సర్వీసులు పెంచడం కూడా రద్దీ పెరగడానికి కారణమైంది.