సగానికి పైగా అమెరికన్లు ట్రంప్ మాటలు నమ్మడం లేదు: సీఎన్ఎన్ పోల్

ABN , First Publish Date - 2020-05-14T00:00:14+05:30 IST

అమెరికాలో కరోనా మహమ్మారి ఏ విధంగా విళయతాండవం చేస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు.

సగానికి పైగా అమెరికన్లు ట్రంప్ మాటలు నమ్మడం లేదు: సీఎన్ఎన్ పోల్

వాషింగ్టన్: అమెరికాలో కరోనా మహమ్మారి ఏ విధంగా విళయతాండవం చేస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. మరోపక్క దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోలేదనే విమర్శలు కూడా నిత్యం వినపడుతూనే ఉన్నాయి. ట్రంప్ మాత్రం అమెరికా ప్రభుత్వం కరోనాను సమర్థవంతంగా నియంత్రించిందని చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ మాటలను ప్రజలు నమ్ముతున్నారా లేదా అనే దానిపై సీఎన్ఎన్ నేషనల్ పోల్ నిర్వహించింది. ప్రతి పది మంది అమెరికన్లలో ఆరుగురికి పైగా ట్రంప్ చెబుతున్న సమాచారాన్ని నమ్మడం లేదని ఈ పోల్‌లో తేలింది. ఈ పోల్ బట్టి కరోనా అంశమే కాకుండా దాదాపు నాలుగేళ్ల పాలనలో ట్రంప్ అనేక విషయాల్లో విఫలమయ్యారని అర్థమవుతోంది. 


మరోపక్క వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం.. 1170 రోజుల పాలనలో ట్రంప్ మొత్తంగా 18 వేల అబద్దాలు లేదా ప్రజలను తప్పుదారి పట్టించే విషయాలు చెప్పారు. అంటే ప్రజలకు నిత్యం 15 అబద్దాలు చెబుతూ ట్రంప్ పబ్బం గడుపుకుంటున్నారన్నమాట. మరోపక్క దేశానికి, పాలనకు సంబంధించిన విషయాలను ట్రంప్ వదిలేసి ప్రత్యర్థులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం రిపబ్లికన్లకు ఆందోళన కలిగిస్తోంది. కరోనాను ట్రంప్ ఎదుర్కొన్న తీరు ఆయనకు నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. 2016లో మార్పు తీసుకొస్తాననే నినాదంతో ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచారని.. ఈ సారి మాత్రం ఆయనకు పలు సవాళ్లు ఎదురుకానున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

Read more