భారతీయ అలవాట్లతో బిజీగా గడుపుతున్న ఫ్రెంచ్‌ ఫ్యామిలీ.. ఎక్క‌డంటే..

ABN , First Publish Date - 2020-04-28T13:02:34+05:30 IST

భారత పర్యటనకు వచ్చిన ఓ ఫ్రెంచ్‌ కుటుంబం.. లాక్‌డౌన్‌తో ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో చిక్కుకుపోయింది.

భారతీయ అలవాట్లతో బిజీగా గడుపుతున్న ఫ్రెంచ్‌ ఫ్యామిలీ.. ఎక్క‌డంటే..

మహరాజ్‌గంజ్‌ (యూపీ), ఏప్రిల్‌ 27: భారత పర్యటనకు వచ్చిన ఓ ఫ్రెంచ్‌ కుటుంబం.. లాక్‌డౌన్‌తో ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో చిక్కుకుపోయింది. అయితేనేం.. స్థానికులు అక్కున చేర్చుకోవడంతో ఆ విదేశీ ఫ్యామిలీ గ్రామస్థులతో కలిసిపోతూ దేవాలయాల్లో ప్రార్థనలు జరుపుతూ లాక్‌డౌన్‌ కాలాన్ని ఆనందంగా ఆస్వాదిస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన పాట్రిక్‌ పలారెజ్‌ స్వతహాగా మోటార్‌ మెకానిక్‌ కావడంతో అన్ని వసతులున్న క్యాంపర్‌ (వ్యాన్‌లాంటి వాహనం)ను తయారుచేసుకొని అందులోనే భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడితో కలిసి ప్రపంచ యాత్రకు శ్రీకారం చుట్టాడు. భారత్‌ వచ్చిన పాట్రిక్‌ ఫ్యామిలీ గతనెల 21న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మహరాజ్‌గంజ్‌లోని సింఘోర్వా గ్రామం చేరుకుంది.


ఇక్కడి నుంచి నేపాల్‌ వెళ్లే సరిహద్దులను లాక్‌డౌన్‌ కారణంగా మూసివేయడంతో ఆ గ్రామంలోనే ఆగిపోయింది. మొదట్లో అక్కడి వాతావరణం, అలవాట్లు కొత్తగా అనిపించినా.. స్థానికుల ఆదరణతో పాట్రిక్‌ కుటుంబం చక్కగా కలిసిపోయింది. నెలరోజులుగా ఆ గ్రామంలోనే ఉంటున్న వాళ్లు.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దేవాలయానికి వెళ్లడం.. శివుడు, పార్వతి, గణేశ్‌, హనుమాన్‌ దేవుళ్లను పూజిస్తూ భారతీయ సంప్రదాయాలను చక్కగా అలవర్చుకుంటున్నారు. ఇప్పుడు పాట్రిక్‌ ఫ్యామిలీ కొద్దికొద్దిగా స్థానిక భాష హిందీని కూడా మాట్లాడుతుండడం విశేషం. 

Updated Date - 2020-04-28T13:02:34+05:30 IST