ట్రంప్ ఇచ్చిన హామీలేంటి?.. వాస్తవంగా జరిగిందేంటి?

ABN , First Publish Date - 2020-04-14T22:30:38+05:30 IST

అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ గత నెల 13వ తేదీన ప్రకటించారు. ఎమర్జెన్సీ ప్రకటించిన నెల రోజుల్లో అమెరికా

ట్రంప్ ఇచ్చిన హామీలేంటి?.. వాస్తవంగా జరిగిందేంటి?

వాషింగ్టన్: అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ గత నెల 13వ తేదీన ప్రకటించారు. ఎమర్జెన్సీ ప్రకటించిన నెల రోజుల్లో అమెరికా పరిస్థితి ఎలా తయారైందో చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. కరోనాను నియంత్రిస్తామంటూ ట్రంప్ ప్రజలకు గతంలో ఎన్నో హామీలిచ్చారు. అనేక ప్రైవేట్ కంపెనీల పేర్లు చెప్పి.. వాటితో కలిసి పనిచేస్తున్నట్టు చెబుతూ సమయం వృధా చేస్తూ వచ్చారు. వాస్తవానికి ట్రంప్ చెప్పిన కంపెనీలేవి ప్రభుత్వంతో కలిసి పనిచేయలేదు. ట్రంప్ చెప్పిన మాటల్లో అసలు వాస్తవమే లేదని ఆయా కంపెనీలు కొట్టిపడేశాయి. కరోనా నియంత్రణపై ట్రంప్ ప్రజలకు ఏం హామీలిచ్చారంటే.. కొవిడ్-19 లక్షణాలు ఇంటి నుంచే స్క్రీన్ చేసేలా గూగుల్ సంస్థ ఓ వెబ్‌సైట్ రూపొందిస్తోందని గతంలో ట్రంప్ చెప్పారు. వాస్తవానికి వస్తే.. గూగుల్ సంస్థ అసలు అటువంటి వెబ్‌సైట్ రూపొందించలేదు. గూగుల్‌కు చెందిన వెరిలి అనే రీసెర్చ్ కంపెనీ మాత్రం కాలిఫోర్నియాలోని ఐదు కౌంటీలలో స్క్రీనింగ్, టెస్టింగ్ సైట్లను ప్రారంభించింది. 


మరోపక్క సీవీఎస్, టార్గెట్ అనే అమెరికన్ కంపెనీలు పార్కింగ్ స్థలాల్లోనే కరోనా పరీక్షలను నిర్వహిస్తాయని ట్రంప్ చెప్పారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై టార్గెట్ కంపెనీ స్పందిస్తూ.. ప్రభుత్వంతో తాము అసలు భాగస్వామ్యం కాలేదంటూ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అనారోగ్యంతో ఉన్నామని భావించే వారందరికి ఎల్‌హెచ్‌సీ అనే హెల్త్‌కేర్ కంపెనీ టెస్టింగ్ పరికరాలను అందజేస్తుందని ట్రంప్ అన్నారు. దీనిపై ఎల్‌హెచ్‌సీ స్పందిస్తూ.. తమ సంస్థలో పనిచేసే మెడికల్ వర్క‌ర్లకు తప్పించి తాము మరెవరికి పరికరాలను అందజేయలేదని వివరించింది. ఇక వైద్యుల విషయంలో కూడా ట్రంప్ పట్టించుకున్నది ఏం లేదు. దేశంలో వైద్యుల అవసరం ఎక్కువ కావడంతో వివిధ రాష్ట్రాల్లో ప్రాక్టీస్ చేసేందుకు అనేక మంది వైద్యులకు లైసెన్స్ ఇప్పిస్తామంటూ ట్రంప్ హామీ ఇచ్చారు. వాస్తవానికి వస్తే.. అమెరికాలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలే వైద్యులు ప్రాక్టీస్ చేసేందుకు లైసెన్స్‌ను జారీ చేశాయి. అంటే, ట్రంప్ వీరి విషయంలో కూడా ఎటువంటి శ్రద్ధ తీసుకోలేదని స్పష్టంగా అర్థమవుతోంది.

Updated Date - 2020-04-14T22:30:38+05:30 IST