ఇటలీలో మరణించిన వారిలో.. 99 శాతం మందికి..

ABN , First Publish Date - 2020-03-19T22:37:50+05:30 IST

చైనాలోని వూహాన్‌లో మొదలైన కొవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని

ఇటలీలో మరణించిన వారిలో.. 99 శాతం మందికి..

రోమ్: చైనాలోని వూహాన్‌లో మొదలైన కొవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని ఆనందించేలోపే.. ఇటలీలో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతుండటం కలవరపెడుతోంది. ఒక్కరోజులోనే ఇటలీలో 475 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటివరకు ఇటలీలో 2500 మందికి పైగా మరణించగా, 31,500 పైగా కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. ఇటలీలో కరోనా బారిన పడి మరణించిన వారిలో 99 శాతం మందికి అంతకుముందే ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నట్టు నేషనల్ హెల్త్ అథారిటీ ఆధ్వర్యంలో జరిగిన స్టడీలో తేలింది. గత ఏడు రోజుల వ్యవధిలో కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 150 శాతం పెరగడంతో ప్రభుత్వం మరణించిన వారి ఆరోగ్య డేటాను వెలికితీస్తోంది. 


రోమ్‌కు చెందిన ఒక ఇన్‌స్టిట్యూట్.. దేశంలో కరోనా కారణంగా చనిపోయిన వారిలో 18 శాతం మంది మెడికల్ రికార్డ్స్‌ను పరిశీలించగా.. వీరిలో 0.8 శాతం మంది మాత్రమే కరోనా బారిన పడకముందు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. 75 శాతానికి పైగా మందికి హైబీపీ ఉన్నట్టు, 35 శాతం మంది డయాబెటిస్‌తో, మూడో వంతు మంది గుండె సమస్యతో బాధపడుతున్నట్టు స్డడీ చెప్పింది. ఇటలీలో మార్చి 17 నాటికి 50 కంటే తక్కువ వయసు కలిగిన వారు 17 మంది మరణించారు. 40 కంటే తక్కువ వయసున్న వారందరూ మగవారేనని, వీరందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారని మెడికల్ రికార్డ్స్ ద్వారా బయటపడింది. ఇదిలా ఉండగా.. ఇటలీ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య లక్ష వరకు ఉండచ్చని జీఐఎమ్‌బీఈ ఫౌండేషన్ చేసిన స్టడీలో బయటపడింది. మరోపక్క ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన డేటా.. ఇటలీలో మరణాల పెరుగుదల 12.6 శాతంగా ఉందని.. ఇది అంతకుముందు కంటే తక్కువేనని చెబుతోంది. కరోనా లక్షణాలు ఉన్న వారిని తప్ప ప్రభుత్వం మిగతా వారి గురించి పట్టించుకోవడం లేదని, అందుకే బాధితుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు మరో స్డడీ చెప్పింది.

Updated Date - 2020-03-19T22:37:50+05:30 IST