రెండు వారాల్లో 97 వేల మంది పిల్లలకు కరోనా.. అమెరికాలో..

ABN , First Publish Date - 2020-08-12T02:23:16+05:30 IST

అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పలు పాఠశాలలు తెరుచుకున్నాయి.

రెండు వారాల్లో 97 వేల మంది పిల్లలకు కరోనా.. అమెరికాలో..

వాషింగ్టన్: అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే పలు పాఠశాలలు తెరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా మరికొద్ది రోజుల్లో అన్ని పాఠశాలలు తెరుచుకునే అవకాశాలున్నాయి. ఇదే సమయంలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కరోనా మహమ్మారి పిల్లలపై ఏ విధంగా ప్రభావం చూపుతోందో చెప్పుకొచ్చింది. జూలై 16 నుంచి 30 వరకు అమెరికా వ్యాప్తంగా 97 వేల మంది పిల్లలు కరోనా బారిన పడినట్టు ఈ అకాడమి లెక్కలు చెబుతున్నాయి. దీంతో స్కూలు యాజమాన్యాలు, తల్లిదండ్రులు పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్య చెబుతూనే కరోనా నిబంధనలను పాటించేలా స్కూలు యాజమాన్యాలు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇప్పటికే తెరుచుకున్న అనేక స్కూళ్లలో పిల్లలు కనీసం ఫేస్‌మాస్క్ కూడా ధరించడం లేదని అనేక వార్తలొస్తున్నాయి. మరోపక్క పిల్లలు కరోనా బారిన పడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని మొదట్లో చెప్పినప్పటికి.. అమెరికాలో గడిచిన నాలుగు నెలల్లో 3,39,000 మంది పిల్లలకు కరోనా సోకింది. ఒక్క జూలై నెలలోనే 30 మంది పిల్లలు కరోనా కారణంగా మరణించారు. ఎక్కువ మంది పిల్లలకు కరోనా పరీక్షలు చేయడం ద్వారా వారి వల్ల కరోనా ఏ విధంగా, ఎంత వరకు వ్యాప్తి చెందుతుందో తెలుసుకునే అవకాశముందని ఓ వైద్యురాలు చెబుతున్నారు. కాగా.. అమెరికాలో ఇప్పటివరకు 5,255,392 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 166,345 మంది మృత్యువాతపడ్డారు.  

Updated Date - 2020-08-12T02:23:16+05:30 IST