బ్రిటన్‌లో స్మారకోత్సవానికి చార్లెస్‌ నేతృత్వం

ABN , First Publish Date - 2020-08-16T14:22:02+05:30 IST

జపాన్‌పై విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన వీజే డే స్మారకోత్సవానికి బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ (71) నేతృత్వం వహించారు.

బ్రిటన్‌లో స్మారకోత్సవానికి చార్లెస్‌ నేతృత్వం

రెండో ప్రపంచయుద్ధానికి 75 ఏళ్లు

లండన్‌, ఆగస్టు 15: జపాన్‌పై విజయం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం నిర్వహించిన వీజే డే స్మారకోత్సవానికి బ్రిటన్‌ యువరాజు చార్లెస్‌ (71) నేతృత్వం వహించారు. 1945 ఆగస్టు 15న జపాన్‌ లొంగిపోవడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన విషయం తెలిసిందే. దీన్ని పురస్కరించుకుని నిర్వహించిన వీజే డే స్మారకోత్సవంలో బ్రిటన్‌ యువరాజుతో పాటు ఆయన సతీమణి కమిల్లా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూకేవ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. జపాన్‌పై జరిగిన యుద్ధంలో బ్రిటన్‌, భారత్‌ సహా కామన్‌వెల్త్‌ దేశాలకు చెందిన 71,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో జపాన్‌ చెరలో ఉన్న 12,000 మందికి పైగా ఖైదీలు కూడా ఉన్నారు. జపాన్‌పై పోరాడి వేలాదిగా మరణించిన యూకే, కామన్‌వెల్త్‌ దేశాల సైనికులకు నివాళిగా బ్రిటన్‌ వర్చువల్‌ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జపాన్‌ను ఓడించడానికి బ్రిటిష్‌ ఇండియన్‌ ఆర్మీ ఎంతగానో దోహదపడినట్టు విద్యా పరిశోధకుడు దియా గుప్తా పేర్కొన్నారు. జపాన్‌పై పోరాటానికి 1943లో జనరల్‌ స్లిమ్‌ సారథ్యంలో విభిన్న దేశాలకు చెందిన సైనికులతో పద్నాలుగో ఆర్మీ ఏర్పాటైందని, ఇందులో ఏడు లక్షల మంది భారతీయులున్నారని గుర్తు చేశారు. 

Updated Date - 2020-08-16T14:22:02+05:30 IST