75 కోట్ల దోమ‌ల‌తో యూఎస్ స‌రికొత్త ప్ర‌యోగం !

ABN , First Publish Date - 2020-08-22T15:30:14+05:30 IST

జ‌న్యుప‌రంగా వృద్ధి చేసిన సుమారు 75 కోట్ల దోమ‌ల‌తో అగ్ర‌రాజ్యం అమెరికా స‌రికొత్త ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతోంది.

75 కోట్ల దోమ‌ల‌తో యూఎస్ స‌రికొత్త ప్ర‌యోగం !

వాషింగ్ట‌న్ డీసీ: జ‌న్యుప‌రంగా వృద్ధి చేసిన సుమారు 75 కోట్ల దోమ‌ల‌తో అగ్ర‌రాజ్యం అమెరికా స‌రికొత్త ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతోంది. వివ‌రాల్లోకి వెళితే... ప్ర‌పంచ‌దేశాల్లో ప్ర‌తి యేటా వ‌ర్షాకాలంలో అనేక మంది డెంగ్యూ, టైఫాయిడ్‌, మ‌లేరియా వంటి విష జ్వ‌రాలతో పాటు జికా, చికున్‌గున్యా, ఎల్లో ఫీవ‌ర్ వంటి వ్యాధుల బారిన ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. దీనికి ప్ర‌ధాన కార‌ణం దోమ‌లే. ప్ర‌ధానంగా ఏడిస్ ఏజిప్టి అనే ఆడ దోమ‌లు కుట్ట‌డం వ‌ల్ల ఈ వ్యాధులు సంక్ర‌మిస్తున్నాయి. అందుకే ఆ దోమ‌ల‌ను నివారించేందుకు గాను యూఎస్ స‌రికొత్త‌ ప్ర‌యోగానికి తెర‌లేపింది. అందుకు గాను ఫ్లోరిడాలో జ‌న్యు ప‌రంగా వృద్ధి చేసిన 75 కోట్ల మ‌గ దోమ‌ల‌ను వ‌ద‌ల‌నున్నారు. బ్రిట‌న్‌కు చెందిన అమెరికాలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హించే ఆక్సిటెక్ కంపెనీ ల్యాబ్‌ల‌లో పెద్ద ఎత్తున ఈ దోమ‌ల‌ను పెంచింది. OX5034గా పిలిచే ఇవ‌న్నీ జ‌న్యుప‌రంగా మార్పులు చేయ‌బ‌డిన దోమ‌లు.


వీటిని త్వ‌ర‌లో ఫ్లోరిడాలోని ఫ్లోరిడా కీస్ ద్వీపాల్లో వ‌దిలేందుకు రెడీ అవుతున్నారు అక్క‌డి అధికారులు. ఆ దోమ‌ల‌న్నీ మ‌గ‌వే కావ‌డంతో అక్క‌డి ఆడ ఏడిస్ దోమ‌ల‌తో సంయోగం జ‌రుపుతాయి. దీంతో ఆడ ఏడిస్ దోమ‌లు కొంత నిర్దిష్ట‌మైన కాల‌వ్య‌వ‌ధిలో మ‌ర‌ణించ‌డం జ‌రుగుతుంది. ఇలా వాటి వృద్ధిని అరిక‌ట్ట‌వచ్చని అధికారులు చెబుతున్నారు.ఈ పైల‌ట్ ప్రాజెక్ట్‌కు అమెరికా తాజాగా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. 2016లో బ్రెజిల్ కూడా ఇలాంటి ప్ర‌యోగ‌మే చేసి విజ‌య‌వంత‌మైంది. దీంతో అప్ప‌టి నుంచి అక్క‌డ విష జ్వ‌రాల‌ను వ్యాప్తి చేసే దోమ‌ల సంఖ్య భారీ త‌గ్గ‌డంతో ఆయా వ్యాధుల బారిన ప‌డే వారి సంఖ్య కూడా గ‌ణనీయంగా త‌గ్గింది. అందుకే అమెరికా కూడా ఈ ప్ర‌యోగానికి ప‌చ్చ‌జెండా ఊపింది. 

Updated Date - 2020-08-22T15:30:14+05:30 IST