కరోనా ఎఫెక్ట్.. 70 రోజుల తర్వాత తన తల్లిని కలుసుకున్న ఏడేళ్ల బాలుడు
ABN , First Publish Date - 2020-05-29T06:25:03+05:30 IST
కరోనా వైరస్ కారణంగా ఓ ఏడేళ్ల బాబు తన తల్లిని దాదాపు 70 రోజుల తర్వాత కలుసుకున్న ఘటన యూఏఈలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే.. బ్రిటన్కు చెం

యూఏఈ: కరోనా వైరస్ కారణంగా ఓ ఏడేళ్ల బాబు తన తల్లిని దాదాపు 70 రోజుల తర్వాత కలుసుకున్న ఘటన యూఏఈలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళితే.. బ్రిటన్కు చెందిన జెస్సికా ఫిట్జాన్ అనే మహిళ తన కుటుంబంతో కలసి గత కొద్ది సంవత్సరాలుగా యూఈఏలో నివసిస్తున్నారు. అయితే లాక్డౌన్కు ముందు జెస్సికా ఫిట్జాన్.. ఓ పనిపై బ్రిటన్ వెళ్లారు. కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలం సృష్టించడం మొదలు పెట్టడంతో ప్రపంచం మొత్తం స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. విమాన సర్వీసులు కూడా నిలిచిపోవడంతో జెస్సికా ఫిట్జాన్.. బ్రిటన్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో తన తల్లిపై బెంగపెట్టుకున్న ఏడేళ్ల ఆర్చీ.. రాస్ అల్ ఖైమా అధినేత, యూఏఈ సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమికి లేఖ రాశాడు. తన తల్లిని తనతో కలపాలని ఆర్చీ.. తన లేఖలో కోరాడు. దీంతో రాస్ అల్ ఖైమా అధినేత స్పందించారు. జెస్సికా ఫిట్జాన్ను యూఏఈ రావడానికి అనుమతించారు. దీంతో కొద్ది రోజుల క్రితం అమె యూఏఈ చేరుకున్నారు. 14 రోజుల క్వారెంటైన్ తర్వాత.. ఆమె తన కొడుకు ఆర్చీని కలుసుకున్నారు. కాగా.. జెస్సికా ఫిట్జాన్ క్వారెంటైన్ కేంద్రం నుంచి బయటికి రావడాన్ని గమనించిన ఆర్చీ.. పరుగెత్తుకెళ్లి.. ఆమెను హత్తుకున్నాడు. ఆర్చీ తన తల్లిని కలుసుకున్న దృశ్యాలను స్థానిక మీడియా ప్రసారం చేసింది. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.