450 మంది భారతీయులను విడుదల చేసిన సౌదీ ప్రభుత్వం!

ABN , First Publish Date - 2020-09-27T23:24:28+05:30 IST

కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియాలో చిక్కుకున్న సుమారు 450 మంది భారతీయులు.. అక్కడి నిర్బంధ కేంద్రాల నుంచి విడుదలయ్యారు. ఇందులో కొంత మంది ఇప్పటి

450 మంది భారతీయులను విడుదల చేసిన సౌదీ ప్రభుత్వం!

రియాద్: కరోనా నేపథ్యంలో సౌదీ అరేబియాలో చిక్కుకున్న సుమారు 450 మంది భారతీయులు.. అక్కడి నిర్బంధ కేంద్రాల నుంచి విడుదలయ్యారు. ఇందులో కొంత మంది ఇప్పటికే భారత్ చేరుకోగా.. మరికొంత మంది బయల్దేరారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ఉధృతి.. ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన తొలినాళ్లలో మెజార్టీ దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. ఈ క్రమంలో పొట్టకూటి కోసం.. సౌదీ అరేబియాకు వెళ్లిన సుమారు 450మంది భారతీయులు ఉపాధిని కోల్పోయారు. దీంతో వారికి పూట గడవటం కష్టమైంది. ఈ క్రమంలో వారు అక్కడ భిక్షాటన చేశారు. భిక్షాటన చేయడాన్ని సౌదీలో నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో వారిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి, నిర్బంధ కేంద్రాలకు తరలించారు.


ఈ క్రమంలో వారు తమ సమస్యను సామాజిక కార్యకర్త.. అమ్జద్ ఉల్లా ఖాన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన స్పందించి.. వారి సమస్యను భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రియాద్‌లోని భారత ఎంబసీ అధికారులు.. సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో సుమారు 450 మంది భారతీయులను సౌదీ ప్రభుత్వం శనివారం రోజు విడుదల చేసింది. 450 మందిని స్వదేశానికి తరలించడం కోసం ఎంబసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో కొంత మంది ఇప్పటికే భారత్‌కు చేరుకోగా.. మరికొంత మంది బయల్దేరారు. 


Updated Date - 2020-09-27T23:24:28+05:30 IST