కృష్ణబిల రహస్యాలు ఛేదించినందుకు.. ముగ్గురికి ‘భౌతిక’ నోబెల్‌

ABN , First Publish Date - 2020-10-07T09:25:49+05:30 IST

కాంతిని సైతం తమలోకి లాగేసుకుని మళ్లీ బయటకు తప్పించుకోకుండా

కృష్ణబిల రహస్యాలు ఛేదించినందుకు.. ముగ్గురికి ‘భౌతిక’ నోబెల్‌

స్టాక్‌హోమ్‌, అక్టోబరు 6: కాంతిని సైతం తమలోకి లాగేసుకుని మళ్లీ బయటకు తప్పించుకోకుండా మింగేసే కాలబిలాలను అర్థం చేసుకునే కీలక పరిశోధనలు నిర్వహించిన ముగ్గురు శాస్త్రవేత్తలను.. భౌతిక శాస్త్రంలో ఈ ఏటి నోబెల్‌ వరించింది. ఆ ముగ్గురిలో ఒకరు.. బ్రిటన్‌ శాస్త్రవేత్త రోగర్‌ పెన్‌రోజ్‌, రెండో శాస్త్రవేత్త జర్మనీకి చెందిన రీన్‌హార్డ్‌ గెంజెల్‌ కాగా.. మరొకరు అమెరికాకు చెందిన మహిళా శాస్త్రవేత్త ఆండ్రియా ఘెజ్‌. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్‌ హాకింగ్‌తో కలిసి పనిచేసిన సర్‌ రోగర్‌ పెన్‌రోజ్‌కు.. బహుమతి 10 కోట్ల క్రోనార్లలో సగం (మన కరెన్సీలో దాదాపు రూ.4 కోట్లు) ఇవ్వనున్నారు. మిగతా సగాన్ని రెండు భాగాలు చేసి ఆండ్రియాఘెజ్‌కు, రీన్‌హార్డ్‌ గెంజెల్‌కు పంచనున్నారు. ఐన్‌స్టీన్‌ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం తాలూకూ అనివార్య పర్యవసానమే  కృష్ణబిలాలు అనే విషయాన్ని సర్‌ రోగర్‌ పెన్‌రోజ్‌ నిరూపించారు.


కృష్ణబిలాలు/కాలబిలాలు ఉన్నాయా లేవా అనే విషయంపై 18వ శతాబ్దం చివరి దాకా చాలా సందేహాలు ఉండేవి. అసలు కృష్ణబిలాలనేవే లేవని.. అవి కేవలం కాగితాల మీద లెక్కలేనని చాలా మంది పరిశోధకులు అభిప్రాయపడేవారు. అవి ఉన్నాయని గుర్తించడానికి వారికి దశాబ్దాలు పట్టిందని.. వాటి ఉనికిని నిరూపించడానికి ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతం ఉపకరించిందని,  నోబెల్‌ కమిటీ సభ్యుడు ఉల్ఫ్‌ డేనియల్‌ సన్‌ పేర్కొన్నారు. రోగర్‌ పెన్‌రోజ్‌ ఆ లెక్కలను అర్థం చేసుకుని.. ఏదైనా నక్షత్రం నశించిపోయినప్పుడు అది కృష్ణబిలంగా మారుతుందని నిరూపించాడని వివరించారు. ఇక.. మన సౌరవ్యవస్థ ఉన్న మిల్కీవే పాలపుంత నడిమధ్యలో ఉన్న ‘శాగిటేరియస్‌ ఏూ’ అనే ప్రాంతంలో గల భారీ ద్రవ్యరాశిగల కృష్ణబిలం (దాని ద్రవ్యరాశి మన సూర్యుడి ద్రవ్యరాశి కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ. 


అర్థమయ్యేలా చెప్పాలంటే.. 43 లక్షల సూర్యుళ్ల ద్రవ్యరాశితో సమానం) ఉనికికి సంబంధించిన నమ్మదగ్గ ఆధారాలను గెంజెల్‌, ఆండ్రియా 1990ల్లో ఇవ్వగలిగారు. అందుకే వారికి ఈ గౌరవం. కాగా.. 1901 నుంచి 2019 దాకా భౌతిక శాస్త్రంలో 200 మందికి నోబెల్‌ బహుమతిని ప్రకటించగా వారిలో కేవలం ముగ్గురు మహిళా శాస్త్రవేత్తలే గెలుచుకున్నారు. వారు.. మేడమ్‌ మేరీ క్యూరీ, మారియా గొప్పెర్ట్‌ మేయర్‌, డోన్నా స్ట్రిక్‌లాండ్‌. వారి తర్వాత ఆ ఘనత సాధించిన నాలుగో మహిళగా ఆండ్రియా ఘెజ్‌ నిలిచారు. నోబెల్‌ పురస్కారం తనకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని.. భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి గెలుచుకున్న నాలుగో మహిళ నిలవడాన్ని తానొక బాధ్యతగా భావిస్తానని ఘెజ్‌ పేర్కొన్నారు.


Updated Date - 2020-10-07T09:25:49+05:30 IST