విదేశాల నుంచి వచ్చిన 112 మందిలో.. పత్తాలేని 16 మంది..

ABN , First Publish Date - 2020-03-21T16:14:38+05:30 IST

మలక్‌పేట క్లస్టర్‌ పరిధి ఇటీవల మొత్తం 112 మంది విదేశాల నుంచి వచ్చారు.

విదేశాల నుంచి వచ్చిన 112 మందిలో.. పత్తాలేని 16 మంది..

విదేశాల నుంచి వచ్చింది 112 మంది..

96మంది గుర్తింపు.. 16 మంది ఎక్కడో.. 

చాదర్‌ఘాట్‌(హైదరాబాద్): మలక్‌పేట క్లస్టర్‌ పరిధి ఇటీవల మొత్తం 112 మంది విదేశాల నుంచి వచ్చారు. క్లస్టర్‌ పరిధిలోకి వచ్చే శాలివాహననగర్‌, మలక్‌పేట, మాదన్నపేట, జాంబాగ్‌ పార్క్‌, గడ్డిఅన్నారం పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధుల్లో విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు వైద్య సిబ్బంది పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన వారి చిరునామా, ఫోన్‌ నంబర్ల ఆధారంగా మొత్తం 112 మందిలో 96 మందిని  గుర్తించారు. మిగతా 16 మంది సమాచారం కోసం ప్రయత్నిస్తున్నారు. వారు పొందుపరిచిన చిరునామాలో లేకపోవడం, మరికొందరు ఫోన్లకు రెస్పాన్స్‌ ఇవ్వడం లేదని మలక్‌పేట ఇన్‌చార్జి క్లస్టర్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ గీత తెలిపారు. శాలివాహననగర్‌ పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ వీణ పర్యవేక్షణలో విదేశాల నుంచి వచ్చిన 21 మందికిగాను 17 మందిని గుర్తించారు. గడ్డిఅన్నారం పట్టణ ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ హిమబిందు పర్యవేక్షణలో 21 మందికి గాను 14 మందిని గుర్తించారు.


మరో ఏడు గురి జాడ తెలియరాలేదు. మాదన్నపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ గీత పర్యవేక్షణలో 36 మందికి గాను 35 మందిని గుర్తించారు.  జాంబాగ్‌ పార్క్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ బీర్జున్నీసా పర్యవేక్షణలో  12 మందిని గుర్తించారు. మలక్‌పేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ జ్యోతి పర్యవేక్షణలో  22 మందికి గాను 18 మందిని గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా వైద్యాధికారులు తెలిపారు. కాకపోతే, ఎవరికి వారు 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. 


డబీర్‌పుర క్టస్టర్‌ పరిధిలో 31 మంది.. 

డబీర్‌పుర క్టస్టర్‌ పరిధిలోని ఐదు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధుల్లో విదేశాల నుంచి వచ్చిన 31 మందిని గుర్తించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్లు క్లస్టర్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రాజకుమార్‌ తెలిపారు. ఆజంపుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ అనురాధ పర్యవేక్షణలో ఆరుగురిని గుర్తించారు. డబీర్‌పుర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ విమల పర్యవేక్షణలో ఐదుగురిని, దారుషిఫా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ దీన్‌దయాళ్‌ పర్యవేక్షణలో 14 మందికి, యాకుత్‌పుర-1 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ ఆయేషా పర్యవేక్షణలో నలుగురికి, యాకుత్‌పుర-2 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్‌ శ్వేత పర్యవేక్షణలో ఇద్దరికి వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండడంతో హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించారు. 




Updated Date - 2020-03-21T16:14:38+05:30 IST