ఇటలీలో మరణమృదంగం.. ఒక్కరోజే 1000 మంది మృతి

ABN , First Publish Date - 2020-03-28T12:58:48+05:30 IST

ఇటలీలో వెనకడుగు వేసినట్లే వేసిన కరోనా.. గతానికి మించిన దూకుడుతో విరుచుకుపడుతోంది.

ఇటలీలో మరణమృదంగం.. ఒక్కరోజే 1000 మంది మృతి

ఇటలీలో కొనసాగుతున్న మరణమృదంగం

ప్రపంచవ్యాప్తంగా మృతులు 26 వేలు 

స్పెయిన్‌లో మరో 568 మంది మృతి

ఫ్రాన్స్‌లో 299, ఇరాన్‌లో 144 మంది

సింగపూర్‌లో దగ్గరగా నిల్చుంటే జైలే!

పాజిటివ్‌ కేసులు 5.5 లక్షల పైనే..

టెహ్రాన్‌, పారిస్‌, మార్చి 27: ఇటలీలో వెనకడుగు వేసినట్లే వేసిన కరోనా.. గతానికి మించిన దూకుడుతో విరుచుకుపడుతోంది. శుక్రవారం ఒక్క రోజే దాదాపు వెయ్యి మందిని బలి తీసుకుంది. దీంతో ఆ దేశంలో మొత్తం మృతుల సంఖ్య 9,134కు చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగానూ కరోనా మరణాలు పెరుగుతున్నాయి. శుక్రవారమే 3 వేల మందిపైగా చనిపోయారు. ఇటలీ తర్వాత స్పెయిన్‌ (569) కరోనాతో వణుకుతోంది. ఆసియాలో వైరస్‌ తీవ్రంగా ఉన్న ఇరాన్‌లో మరో 144 మంది బలయ్యారు. ఈ దేశంలో 24 గంటల వ్యవధిలో దాదాపు 3 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజధాని ట్రెహాన్‌లోని ఓ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను సైన్యం యుద్ధప్రాతిపదికన 2 వేల పడకల ఆసుపత్రిగా మార్చేసింది.


ఫ్రాన్స్‌లోనూ మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. వీరిలో 16 ఏళ్ల బాలిక కూడా ఉండటం గమనార్హం. తొలిసారిగా దక్షిణాఫ్రికాలో శుక్రవారం ఇద్దరు మృతి చెందారు. పరిస్థితుల నేపథ్యంలో ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దగ్గరగా నిల్చుంటే ఆర్నెళ్ల వరకు జైలు శిక్ష విధించేలా సింగపూర్‌ కఠిన నిబంధన అమల్లోకి తెచ్చింది. వైరస్‌ జన్మస్థానం చైనాలో మూడు రోజుల తర్వాత ‘స్థానిక’ వ్యక్తికి కరోనా సోకింది. ఇటీవల ముగ్గురు నవజాత శిశువులూ వైరస్‌ బారినపడినట్లు ఓ అధ్యయనం తెలిపింది.


దుబాయ్‌ విమానాశ్రయంలో చిక్కుకున్న 22 మంది భారతీయులు సహా ఇతర దేశాల ప్రయాణికులకు సాయం చేసేందుకు యూఏఈ చొరవ చూపుతోంది. జనాభాపరంగా ప్రపంచంలో నాలుగో పెద్ద దేశమైన ఇండోనేషియాలో కరోనా ప్రభావం మొదలైన కొద్ది రోజుల్లోనే 87 మంది మృతి చెందారు. హంగెరీ రెండు వారాల షట్‌డౌన్‌ను అమల్లోకి తేగా, రష్యాలో శనివారం నుంచి ‘నాన్‌ వర్కింగ్‌ వీక్‌’ మొదలుకానుంది. కరోనా వల్ల ప్రపంచ పర్యటకం ఈ ఏడాది 20ు నుంచి 30ు పడిపోనుందని, 450 బిలియన్‌ డాలర్ల వరకు నష్టం జరగొచ్చని ప్రపంచ పర్యటక సంస్థ ప్రకటించింది.


Updated Date - 2020-03-28T12:58:48+05:30 IST