అమెరికాలో కరోనా కల్లోలం.. ఒక్క రోజులో 10 వేల కేసులు

ABN , First Publish Date - 2020-03-25T12:18:03+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను కరోనా నిలువునా వణికిస్తోంది. ఒక్క రోజులో దేశంలో 10 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 130 మంది ప్రాణాలు కోల్పోయారు.

అమెరికాలో కరోనా కల్లోలం.. ఒక్క రోజులో 10 వేల కేసులు

న్యూయార్క్‌లో పరిస్థితి ఘోరం

స్పెయిన్‌లో 24 గంటల్లో 514 మరణాలు

అమెరికాను కుదిపేస్తున్న కరోనా 

ప్రపంచవ్యాప్త మృతులు 18 వేల  పైనే!

వాషింగ్టన్‌/న్యూయార్క్‌/రోమ్‌, మార్చి 24: అగ్రరాజ్యం అమెరికాను కరోనా నిలువునా వణికిస్తోంది. ఒక్క రోజులో దేశంలో 10 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 130 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 43 మంది న్యూయార్క్‌ నగరం వారే. ఇక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరు  కరోనా బాధితులే కావడం గమనార్హం. దీంతో కరోనా కేసుల్లో అమెరికా యూర్‌పను మించిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా మరణాలు 18,299కి చేరాయి. వరుసగా రెండు రోజులు తగ్గినప్పటికీ.. ఇటలీలో మంగళవారం ఏకంగా 743 మరణాలు నమోదయ్యాయి.  స్పెయిన్‌లో 24 గంటల్లో 514 మంది చనిపోయారు. ఇరాన్‌లో మరో 122 మంది, ఫ్రాన్స్‌లో నలుగురు వైద్యులు సహా 186 మంది మృతిచెందారు. దక్షిణ కొరియాలో మరణాల సంఖ్యకు 120కి చేరింది. చైనాలోని హుబెయ్‌ ప్రావిన్స్‌లో 3 నెలల లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు.


వైరస్‌ వ్యాప్తితో వచ్చిన చెడ్డ పేరును చెరిపివేసేందుకు చైనా.. వివిధ దేశాలకు వైద్య పరికరాలు పంపుతోంది. వైరస్‌ కేసులు 950 దాటడంతో పాకిస్థాన్‌లో రైళ్లను రద్దు చేశారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తితో సెల్ఫీ దిగిన ఆరుగురు సివిల్‌ సర్వెంట్లను పాక్‌ సస్పెండ్‌ చేసింది. నోబెల్‌ శాంతి బహుమతి విజేత, ఫిన్లాండ్‌ మాజీ అధ్యక్షుడు మార్టి అహ్టిసారి కొవిడ్‌ బారినపడ్డారు. యూకే మూడు వారాల లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఫిలిప్పీన్స్‌, థాయ్‌లాండ్‌ అత్యవసర స్థితి విధించాయి. దక్షిణాఫ్రికాలో రేపటి నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి రానుంది. 


వృద్ధులను గాలికొదిలేశారు

వారంతా వృద్ధులు.. మహమ్మారి బారినపడ్డారు.. అలాంటివారిని నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. చివరకు కరోనాతో వారు కుంగి కుంగి చనిపోయారు. కొందరు జీవచ్ఛవాలుగా మిగిలారు. ఈ దారుణం స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో చోటుచేసుకుంది. స్పెయిన్‌లో వైరస్‌కు గురైన వృద్ధులను రిటైర్మెంట్‌ హోమ్‌లలో ఉంచారు. వీటిని డిస్‌న్ఫెక్ట్‌ చేసే బాధ్యత చేపట్టిన సైన్యానికి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు కనిపించాయి. పట్టించుకునేవారు లేక చాలా హోమ్‌లలో డజన్ల కొద్దీ వృద్ధులు చికిత్స పొందుతున్న మంచాలపైనే ప్రాణాలొదిలారు. మరికొందరు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వృద్ధుల చికిత్సలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. 


Read more