జీ లే... మై ఫ్రెండ్‌

ABN , First Publish Date - 2020-10-07T06:41:08+05:30 IST

మనసులోని ఆందోళనలు, బాధలను మరిపించే శక్తి సంగీతానికి ఉందంటారు. అందుకే ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ కరోనా కాలంలో ‘జీ లే’ అంటూ శ్రావ్యమైన గీతంతో మనోల్లాసాన్ని కలిగిస్తున్నారు యువ సంగీత ద్వయం రాజీవ్‌ వి. భల్లా, బెన్నీ దయాల్‌...

జీ లే... మై ఫ్రెండ్‌

మనసులోని ఆందోళనలు, బాధలను మరిపించే శక్తి సంగీతానికి ఉందంటారు. అందుకే ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ కరోనా కాలంలో ‘జీ లే’ అంటూ శ్రావ్యమైన గీతంతో మనోల్లాసాన్ని కలిగిస్తున్నారు యువ సంగీత ద్వయం రాజీవ్‌ వి. భల్లా, బెన్నీ దయాల్‌. వారు విడుదల చేసిన ఈ సింగిల్‌ ఇప్పుడు నెట్టింట వేలాది మందిలో ఉత్సాహాన్ని నింపుతోంది.


జీవితమంటే పోరాటం. సమస్యలు వచ్చాయని, సవాళ్లు ఎదురవుతున్నాయని భయపడి వాటికి దూరంగా పారిపోవడం పరిష్కారం కాదు. ఎదిరించి నిలబడితేనే గెలిచేది. కంపోజర్‌ రాజీవ్‌ వి. భల్లా, బాలీవుడ్‌ గాయకుడు బెన్నీ దయాల్‌ రూపొందించిన ‘జీ లే’ పాట వింటున్నంతసేపూ ఇలాంటి స్ఫూర్తి రగిలించే మాటలే వినిపిస్తాయి. కరోనా వచ్చి, జీవితం తలకిందులైపోయిన వేళ ఎందరో మనోవేదన అనుభవించారు. ఉన్నట్టుండి కొలువులు పోయి కొందరు... భవిష్యత్తును తలుచుకొని మరికొందరు... భయాందోళనల్లో గడుపుతున్నారు. అలాంటివారికి తమ పాట ద్వారా భరోసా కల్పించే ప్రయత్నం చేశారు ఈ సంగీత ద్వయం. ప్రస్తుత పరిస్థితులను అతిగా ఊహించుకొని అనవసర ఒత్తిడిలోకి వెళ్లవద్దని చెబుతూనే, ముందు మంచి రోజులు ఉన్నాయని దైర్యం నింపుతున్నారు. 


మంచి కారణం కోసం... 

బెన్నీ దయాల్‌ ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌, జై జై శివశంకర్‌, దారూ దేశీ’ తదితర సూపర్‌హిట్‌ గీతాలెన్నింటినో ఆలపించాడు. సామాన్యులే కాదు... సెలబ్రిటీలకు కూడా అతడి పాటంటే క్రేజ్‌. ఇక వర్ధమాన సంగీత దర్శకుడు రాజీవ్‌ది బాణీలు కూర్చడంలో భిన్నమైన శైలి. ప్రత్యేకించి కుర్రకారును ఆకట్టుకొనే బీట్‌ఫుల్‌ గీతాలు ఇవ్వడంలో దిట్ట. ఇలా వైవిధ్యం ఉన్న ఈ ఇద్దరు యువ కళాకారులు కలిసి ఒక మంచి కారణం కోసం పనిచేశారు. ఉపశమనం... సందేశం... 

‘‘నిజానికి నేను బెన్నీ దగ్గరకు వేరొక పాటతో వెళ్లాను. అది విని అతను ‘ఇంకేమన్నా ఉన్నాయా’ అని అడిగాడు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు కావల్సింది మానసిక ఒత్తిడుల నుంచి కాస్తంత ఉపశమనం. దాంతోపాటే ఎంతోకొంత సందేశం కూడా ఇవ్వగలిగితే బాగుంటుందనుకున్నా. అలా ఆలోచిస్తుంటే తట్టిందే ‘జీ లే’ పాట. రేపటి గురించి దిగులు వద్దు. ఈ రోజును ఆస్వాదించు. ఏదో జరిగిపోతోందని కలత చెందుతూ సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. హాయిగా, ఆహ్లాదంగా, ప్రకాశవంతంగా జీవించమనే సందేశం ఇందులో ఉంటుంది’’ అంటాడు రాజీవ్‌. ఈ పాటకు సంగీతంతో పాటు లిరిక్స్‌ కూడా అతనే రాశాడు. 


మనమే రాక్‌స్టార్స్‌...  

‘‘రాజీవ్‌ నా దగ్గరకు వచ్చినప్పుడు కాదనలేకపోయాను. ఎందుకంటే మొదటిది నేను అతని సంగీతానికి అభిమానిని. రెండోది సామాజిక కోణం ఉందీ పాటలో. ముఖ్యంగా ప్రపంచానికి ప్రస్తుతం కావల్సింది ఆశావహదృక్పథంతో పాటు ధైర్యం నింపే నాలుగు మంచి మాటలు. ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదురై ఉండవచ్చు... కానీ మనందరిలో అద్భుతాన్ని సాధించేదేదో ఉంటుందని మరిచిపోవద్దు. అలా మన బలాలను గుర్తుచేసుకొంటూ... దానిపై దృష్టి పెట్టమని చెప్పే ఓ చిన్న ప్రయత్నం ఈ పాట. మన జీవితంలో మనమే రాక్‌స్టార్స్‌ అన్నది గ్రహిస్తే చాలు’’ అంటూ చెప్పుకొచ్చాడు బెన్నీ దయాల్‌. యూట్యూబ్‌తో పాటు ‘స్పూటిఫై, హంగామా, యాపిల్‌ మ్యూజిక్‌’ తదితర అన్ని మ్యూజిక్‌ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలైన ఈ పాట ఎంతో క్రేజీగా మారింది. యూట్యూబ్‌లో అయితే రెండు లక్షలమందికి పైగా వీక్షించారు. అంతేకాదు... ఈ పాట తమ ఆలోచనా ధోరణిని మార్చిందని చాలామంది కామెంట్లు పెట్టారు. 


బయటకు వెళ్లకుండానే...  

‘‘మన జీవితానికి కొన్ని పరిమితులుంటాయి. ఆ పరిమితుల్లో ఉంటూనే... సాధ్యమైనంత ఆస్వాదించాలి. అదే సమయంలో ప్రతి రోజూ ఎంతోకొంత పురోగతి కోసం ప్రయత్నించాలి’’... ఇది బెన్నీ మాట. వీరిద్దరూ గతంలో కలిసి పనిచేశారు. ఆ పరిచయంతోనే మళ్లీ ఇలా ఒక్కటయ్యారు. కరోనా విజృంభణ, లాక్‌డౌన్ల పరంపర సాగుతున్న సమయంలోనే ‘జీ లే’ సింగిల్‌ను విజయవంతంగా విడుదల చేశారు ఈ సంగీత ద్వయం. పాట రికార్డింగ్‌లో ఎలాంటి సవాళ్లూ ఎదుర్కోలేదట వీరు. ‘‘మా ఇరువురి ఇళ్లల్లో రికార్డింగ్‌ స్టూడియోలు ఉన్నాయి. ఎవరికి వారు రికార్డ్‌ చేసి, నోట్స్‌ షేర్‌ చేసుకున్నాం. ఎవరూ అడుగు బయట పెట్టలేదు. ఎక్కడా ఇబ్బంది పడలేదు’’ అంటాడు రాజీవ్‌.
అలరించే వీడియో... 

‘జీ లే’ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో రెండు రకాలుగా విడుదల చేశారు రాజీవ్‌, బెన్నీ. ఇందులో వీరిద్దరూ కనిపిస్తారు. విశాల్‌ దడ్లానీ, సలీమ్‌ మర్చంట్‌, అర్మాన్‌ మాలిక్‌ తదితర కళాకారులు మధ్య మధ్యలో తెరపై మెరుస్తారు. మరో వీడియో యానిమేటెడ్‌ క్యారెక్టర్ల హమ్మింగ్‌తో విభిన్నంగా సాగిపోతుంది. ఆ అనుభూతి పొందాలంటే ఒక్కసారి యూట్యూబ్‌లోకి వెళ్లి ‘జీ లే’ అనండి. 

Read more