ప్రేమ ఒక్కటే చాలదు!

ABN , First Publish Date - 2020-11-25T06:21:18+05:30 IST

ఒక ప్రేమ బంధం నూరు వసంతాలుగా విలసిల్లాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంఽధం బలపడేందుకు ప్రేమ కన్నా ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒక జంట అన్యోన్యంగా మెలిగేందుకు...

ప్రేమ ఒక్కటే చాలదు!

ఒక ప్రేమ బంధం నూరు వసంతాలుగా విలసిల్లాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంఽధం బలపడేందుకు ప్రేమ కన్నా ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒక జంట అన్యోన్యంగా మెలిగేందుకు, మధుర స్మృతులను పోగేసుకొనేందుకు ఇవి తోడ్పడతాయి. అవేమిటంటే... 


ఒకరిని ఒకరి నమ్మడం: మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నారు అనేది ముఖ్యమే. అయితే మీకు వారిపై నమ్మకం లేకపోతే ఎంత ప్రేమ ఉన్నా అర్థం ఉండదు. నమ్మకం ఉంటేనే ఏ అనుబంధం అయినా కలతలు, కలహాలు లేకుండా సాగుతుంది. కష్టసమయంలో, అవసరంలో వారికి చేయందించి మీ ప్రేమను, నమ్మకాన్ని నిరూపించుకోవడం ఉత్తమం.

పరస్పరం గౌరవించుకోవడం: గొడవ పడినప్పుడు లేదా మనస్ఫర్థలు వచ్చినప్పుడు అవతలి వారు మిమ్మల్ని గౌరవించనప్పుడు ప్రేమ అంతా ఉట్టిదే అనిపిస్తుంది. అయితే ఎక్కువ రోజులు కలిసి నడవాలనే జంటకు ఒకరి మీద ఒకరికి గౌరవం ఉండాలి. గౌరవించుకోవడం అంటే ఒకరి ఇష్టాలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వడం. 

భద్రత భరోసా: ఒక బంధంలో ఉన్నప్పుడు మీరు సురక్షితం, భద్రంగా ఉన్నామనే భరోసా లేనప్పుడు మీ మధ్య ఎంత ప్రేమ ఉన్నా ఏం లాభం. కష్టసమయాల్లో, ఆపద సమయాల్లో అండగా నిలబడడం, ‘నేనున్నాను’ అనే భరోసా ఇవ్వడం ఎంతో ముఖ్యం. ప్రేమించిన వారి నుంచి అభయహస్తం లభిస్తే ఇద్దరి మధ్య సఖ్యత పెరుగుతుంది.

మనస్ఫూర్తిగా ఇష్టపడడం: ప్రేమించిన వ్యక్తిపై కొన్నాళ్లకు ఇష్టం తగ్గిపోయినా కూడా తప్పదు అనుకొని ప్రయాణం చేస్తుంటారు కొందరు. అటాంటప్పుడు మీ మధ్య చెప్పలేనంత ప్రేమ ఉన్నప్పటికీ, మీ భాగస్వామి సాంగత్యంలో ప్రేమగా మెలగడం, నవ్వుతూ గడపడం లేదంటే మీ లైఫ్‌ జర్నీ అనుకున్న విధంగా సాగట్లేదని గ్రహించాలి. అందుచేత మీ భాగస్వామిని మనస్ఫూర్తిగా ఇష్టపడడం చాలా అవసరం.

మాట్లాడడం: ప్రేమ బండికి మాటల ప్రవాహం ఇంధనం లాంటిది. మీరు మీ భాగస్వామితో అరమరికలు లేకుండా మాట్లాడుతున్నారంటే మీ ప్రేమ చిరకాలం నిలిచి ఉంటుంది. ఒకరితో బంధంలో ఉన్నప్పుడు వారిపై ఇష్టాన్ని, ప్రేమను తెలియజేసేందుకు, తగవులను తేల్చేందుకు మాట్లాడడమే మంత్రదండం లాంటిది. మీ ప్రియతమపై మీకు ఉప్పెనంతా ప్రేమ ఉండి ఏం లాభం, దాన్ని వ్యక్తం చేసే భాష లేనప్పుడు.

Read more