అమ్మాయా? అబ్బాయా? అని చూడవద్దు!! - అలేఖ్యా హారిక
ABN , First Publish Date - 2020-03-08T06:11:37+05:30 IST
మగవాళ్లదే ఆధిపత్యమైన వినోద రంగంలో సరైన ప్రోత్సాహం దక్కితే మేమేం తక్కువ కాదు అంటూ అతివలు దూసుకుపోతున్నారు యూ ట్యూబ్ స్టార్‌గా, గీత రచయిత్రిగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా...

మగవాళ్లదే ఆధిపత్యమైన వినోద రంగంలో సరైన ప్రోత్సాహం దక్కితే మేమేం తక్కువ కాదు అంటూ అతివలు దూసుకుపోతున్నారు యూ ట్యూబ్ స్టార్‌గా, గీత రచయిత్రిగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ప్రతిభను చాటుతున్న ముగ్గురు మహిళల అంతరంగం....
‘‘చిన్న-పెద్ద, ఆడ-మగ అనే వ్యత్యాసాలు లేకుండా... ఒకరికి మరొకరు మద్దతు ఇవ్వాలి. అదే ముఖ్యం! ఎవరేం చేసినా నిరుత్సాహ పరచకుండా, పోత్సహిస్తే బాగుంటుంది. మనమంతా మనుషులం. మానవత్వంతో మెలగాలి. ఉద్యోగ వ్యవహారాల్లో, వేషాలు ఇవ్వడంలో, సహాయం చేయడంలో... అమ్మాయా? అబ్బాయా? అని తేడాలు చూడకుండా అందర్నీ సమానంగా చూడాలి’ అంటున్నారు. ‘అమెజాన్’లో ఐదంకెల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదులుకుని, నటిగా యుట్యూబ్‌లోకి వచ్చిన అలేఖ్యా హారిక. ‘దేత్తడి’ ఛానల్లో ఫిల్మ్స్ చేస్తూ... వినోదాన్ని పంచుతున్నారు. ప్రశంసలు అందుకుంటున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా అలేఖ్య మనసులోని మాటలు ఇవి....
‘‘ప్రతిరోజూ మహిళా దినోత్సవమే అని ప్రతి ఒక్కరూ అనుకుంటే... మనం ఇలా ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం రాదేమో! మా కుటుంబంలో ‘అమ్మాయిలు ఇలా ఉండాలి? అలా ఉండాలి?’ అనే నిబంధనలు ఏదీ లేవు. అమ్మ, బ్రదర్ సూపర్ స్ట్రాంగ్. ‘అమెజాన్’లో ఉద్యోగం వదిలి, యాక్టింగ్‌పై పూర్తిగా దృష్టి పెడతానని చెప్పినప్పుడు... అంతకు ముందు నటిస్తానని చెప్పినప్పుడు వద్దని చెప్పలేదు. నా మీద, నేను తీసుకున్న నిర్ణయాలపైనా నమ్మకం ఉంచారు. నేనెప్పుడైనా డల్‌గా ఉన్నా, వీడియో అనుకున్న స్థాయిలో వెళ్లలేదని మథనపడుతున్నా.. మద్దతు ఇస్తారు.
డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో యాక్టింగ్ వైపు రావాలనుకుంటున్న అమ్మాయిలకు, ఆల్రెడీ ఉన్న అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే. ఫేమ్ వెనుక పరుగులు తీయకండి. వీడియో చేసి, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనుకుంటే... మంచి కంటెంట్ ఇవ్వండి. వంద శాతం కష్టపడండి. జనాలు వీడియో చూడాలంటే, కొంచెం వైరల్ కంటెంట్ ఇవ్వాలని ఏదో చేయకండి. మంచి కంటెంట్‌తో వీడియోలు చేయండి. డిజిటల్లో ఉన్నప్పుడు వైరల్ కావడం, మంచి పేరు తెచ్చుకోవడం వేర్వేరు విషయాలు. అది తెలుసుకుని వీడియోలు చేస్తే భవిష్యత్తు ఉంటుంది.
మేము చేసే వీడియోలకు ప్రశంసలే కాదు... విమర్శలూ వస్తాయి. నా యాస, భాషపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ‘ఈ అమ్మాయి ఇటువంటి భాషే మాట్లాడుతుందా? ఈ అమ్మాయి రౌడీ పాత్రలకు మాత్రమే సెట్ అవుతుంది?’ అన్నవాళ్లు ఉన్నారు. అదే సమయంలో యాస, భాష నచ్చినవాళ్లు ఉన్నారు. రాజస్థాన్‌లో, ఒమన్, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్లకు నా భాష ఎలా అర్ధమవుతుందో తెలియదు. ప్రశంసిస్తూ మెసేజ్‌లు చేస్తారు. ఇటీవల ‘స్కూల్ డైరీస్’ చిత్రీకరణ చేస్తుంటే... ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఫ్యాన్ పేజీ హ్యాండిల్ చేసే అబ్బాయి వచ్చాడు. ఆ రోజు తన పుట్టినరోజు అట! నాతో విషెస్ చెప్పించుకోవడానికి వచ్చాడు. నేను షూటింగులో బిజీగా ఉండడంతో 2 నుండి 7 గంటల వరకు వెయిట్ చేశాడు. ‘అక్కా! నీకో సర్ప్రైజ్’ అని... ‘హారిక సిస్టర్ ఫర్ లైఫ్’ అని భుజం మీద వేయించుకున్న టాటూ చూపించాడు. ఆ టాటూ నేను మరింత బాధ్యతగా ఉండాలనే స్ఫూర్తినిచ్చింది. నేను చెప్పేది ఏమిటంటే... ఏ రంగంలో ఉన్న మహిళలకైనా ఈ విధమైన ప్రశంసలు, విమర్శలు వస్తాయనుకుంటున్నా. రెండిటినీ స్వీకరిస్తూ బాధ్యతగా ఎంచుకున్న రంగంలో మహిళలు వందశాతం కృషి చేయాలి.’’
సంబరం ఎలా చేసుకుంటాం? - గీత రచయిత్రి శ్రేష్ఠ
సొసైటీలో మహిళలకు స్వేచ్ఛ ఏది? రాణించాలనుకున్న రంగంలో ప్రోత్సాహం ఎక్కడ? అనుక్షణం అభద్రతా భావంతో బతుకుతూ, భద్రతలేని ప్రపంచంలో మహిళా దినోత్సవం ఎలా జరుపుకోవాలి? వర్ధమాన గీత రచయిత్రి శ్రేష్ఠ మనసులో ఆవేదన ఇది. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’, ‘జబర్దస్త్’, ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్‌రెడ్డి’, ‘యుద్ధం శరణం’, ‘హలో’ వంటి చిత్రాల్లో విజయవంతమైన పాటలు రాశారామె! మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, నిర్లక్ష్య ధోరణిపై ఇలా స్పందించారు.
సాహిత్యం మీదున్న మక్కువతో నేను సినిమా పరిశ్రమలో అడుగుపెట్టా. ఇరవై సినిమాలకు పాటలు రాశా. వాటిలో ప్రేక్షకాదరణ పొందిన పాటలెన్నో ఉన్నాయి. కొన్ని అవార్డులూ అందుకున్నా. అయినా అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. . నా స్థానంలో మేల్ రైటర్ ఉంటే ఇప్పటికి వంద సినిమాలు పూర్తయ్యేవి. తొమ్మిదేళ్లలో 20 సినిమాల్లో 50 పాటలతో నేను సరిపెట్టుకోవలసి వస్తుందేమో!. హిట్ సాంగ్స్ నాకు ఎన్నో ఉన్నప్పటికీ ఓ అవకాశం కోసం ఆత్రంగా ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రెమ్యూనరేషన్ విషయంలో కూడా వివక్షే. ఫిమేల్ రైటర్ ఓ పాట రాస్తే ‘బడ్జెట్ తక్కువండీ! ఇంతే ఇవ్వగలం’ అని బేరాలాడతారు. అదే మగవాళ్లు పాటలు రాస్తే.. మరో పదివేలు ఎక్కువ ఇచ్చి పంపుతారు. పూర్తిగా పురుషాధిక్య పరిశ్రమ సినీరంగం.‘ ఇక్కడ వివక్ష లేదు’ అంటే అందులో నిజం ఉండదు. ఒకవేళ అమ్మాయిలకు ప్రోత్సాహం ఉందనుకుంటే అది ఆ అమ్మాయి తన వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే! మన విలువలను కాపాడుకుంటూ ప్రోత్సహించే పెద్ద మనసు ఇండస్టీలో అంతగా లేదు. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒంటరి పొరాటం చేస్తూ, ఇక్కడి వరకూ వచ్చానంటే నాకూ ఆశ్చర్యమే. ఇక్కడ నేను ఎదుర్కొన్న సమస్యల గురించి ఎంత గొంతెత్తినా... ఎక్కడో ఓ చోట ‘నాకు అన్నం పెడుతున్న ఇండస్ట్రీ కదా’ అని పాజిటివ్ వైబ్రేషన్స్ మళ్లీ తమాయించుకునేలా చేస్తున్నాయి. కొత్తగా వస్తున్న దర్శకులు, నిర్మాణ సంస్థల నుంచి అవకాశాలు వస్తున్నాయి తప్ప గుర్తింపు ఉన్న నిర్మాణ సంస్థల నుంచి ఏ అవకాశమూ రావడం లేదు.
నేను పరిశ్రమలో అడుగుపెట్టిన ఏడాదిన్నర వరకూ అంతా బాగానే ఉంది. రామానాయుడుగారి చేతులమీదుగా ఓ అవార్డు అందుకున్నాక.. ‘ఈ అమ్మాయి ఎవరో సేఫ్‌గా వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయేలా ఉంది’ అని రాజకీయాలు మొదలుపెట్టారు. పేరొచ్చే సమయంలో ఆటంకాలు మొదలయ్యాయి. రకరకాల సమస్యలు, ఇబ్బందులతో కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా. హిట్ పాటలు, అవార్డులతో గుర్తింపు వచ్చినా తొందరగా మరచిపోయే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. ప్రతిభను తొక్కేసే చర్యలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కళకు ఎల్లలు, ప్రాంతాలు లేవంటారు కదా! వంశీ పైడిపల్లి లాంటి తెలంగాణ దర్శకులు కూడా నా లాంటి తెలంగాణ అమ్మాయికి అవకాశం ఇవ్వట్లేదు.
ఇండస్ట్రీ విషయాలు పక్కన పెడితే బయటి ప్రపంచంలో కూడా మహిళలకు ప్రోత్సాహం, భద్రత ఏది? పొద్దున్న పేపర్ తీసి చూస్తే నెలల పిల్లల నుంచి ముసలాళ్ల వరకూ అందరిపైనా అత్యాచారాలు అంటూ వార్తలు. ఇంత రక్షణ లేని ప్రపంచంలో.నూ .. మనకంటూ ఓ రోజు ఉంది దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని ఎలా అనుకొంటాం? ‘నిర్భయ’ దోషులకు ఉరి శిక్ష వేయకుండా ఇంకా రోజులు పొడిగిస్తున్నారంటే న్యాయం, రక్షణ ఎక్కడున్నాయి ? కనీసం ఇలాంటి రోజునైనా జరుగుతున్న అకృత్యాల మీద గొంతెత్తి మాట్లాడాలనీ, ఇప్పటికైనా ఈ ధోరణి మారాలంటూ పోరాటం చేయాలనిపిస్తుంది. వచ్చే ఏడాది కన్నా మంచి మార్పు వస్తే సంపూర్ణంగా మహిళా దినోత్సవ వేడుకను ఘనంగా జరుపుకోవచ్చు’

భద్రత లేదు - దివ్యా విజయ్
‘‘భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనీ, ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారనే మాటలు వినడానికే బాగుంటాయి. ‘నిర్భయ’, ‘దిశ’ లాంటి సంఘటనలు ఎన్ని ఎదురైనా భద్రత విషయంలో ఇంకా వెనకబడే ఉన్నాం. విధులు పూర్తి చేసుకుని ఓ మహిళ ఒంటరిగా ఇంటికి వెళ్లాంటే పక్కన మనిషి తోడు కావలసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఏళ్ల తరబడి మార్పు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాం. ఏళ్లు గడుస్తున్నాయి తప్ప జరిగేది, ఒరిగేది ఏమీలేదు’’ అని అంటున్నారు దివ్యా విజయ్. తెలుగు చిత్రసీమలో పేరు పొందిన ఫైట్ మాస్టర్ విజయ్ కుమార్తె ఈమె! ఆడవాళ్లకు అతి తక్కువ స్పేస్ ఉండే చిత్ర పరిశ్రమలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉన్నారు.
‘‘విజయ్ మాస్టర్ అమ్మాయిగా చాలామందికి నేను సుపరిచితమే! అమెరికాలో ఏంబీఏ చేశా. ప్రొడక్షన్లో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉందని 18 ఏళ్ల వయసులో పూర్తిగా అర్థమైంది. చదువు పూర్తి చేసి పరిశ్రమలో అడుగుపెట్టా. వర్క్ మీద ఐడియా కోసం ‘రంగస్థలం’ సినిమాకు ఇంటర్న్‌షిప్‌లా చేశా. తమ్ముడు రాహుల్‌తో ‘ఈ మాయ పేరేమిటో’ సినిమా తీశాం. ఆ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ‘ఓ బేబీ’, ‘వెంకీమామ’ - ఇలా ప్రస్తుతం ఏడు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నా. గతంలో సినిమా పరిశ్రమ అనగానే ఓ అపోహ ఉండడంతో పాటు నచ్చిన శాఖలోకి రావడానికి సరైన గేట్‌వే ఉండేది కాదు. ఇప్పుడు చదువుకున్నవాళ్లు, సినిమా ఇండస్ట్రీలో ఎలా ముందుకెళ్లాలి అన్నదానిపై అవగాహన ఉన్నవాళ్లు ఎక్కువయ్యారు. మహిళలు పరిశ్రమలో రాణించాలంటే ఉండాల్సింది మంచి కమ్యూనికేషన్. సమస్యలు, ఇబ్బందులు రంగంలో ఏ రంగంలో అయినా సహజం. వాటిని అధిగమించే టెక్నిక్ తెలియాలి. ‘ఎదుటి వ్యక్తి మనతో ఎలా ఉంటున్నారు? మనం వాళ్లతో ఎలా ఉండాలి’ అన్న విషయంలో క్లియర్‌గా ఉండాలి. నేను ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా. ఎందుకంటే నా కుటుంబ సభ్యులు ‘మనసుకు నచ్చింది చెయ్యి’ అని ఫ్రీడమ్ ఇచ్చారు. నా హద్దులు మీరకుండా ముందుకెళ్తున్నా.
సినీ పరిశ్రమ పురుషాధిక్యత గల ఇండస్ట్రీ. ఆడవాళ్లు ఇక్కడ రాణించడం అంత సులువేం కాదు. కానీ ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మార్పు వస్తోంది. ఓ మహిళ ఐటీ రంగంలో ఉన్నా, సినిమాల్లో ఉన్నా వర్క్ ఇంటిగ్రిటీ, డెడికేషన్ ఒకేలా ఉండాలి. ఎక్కడికెళ్లినా అమ్మాయిలకు భద్రత మాత్రం కరువైంది. జిమ్ నుంచి ఇంటికి వెళ్లాలంటే తమ్ముడు వస్తే కానీ వెళ్లను. తను రావడం కుదరదు అంటే ఆ రోజు జిమ్ మానేసి ఇంట్లో కూర్చుంటా. నేనే కాదు... చాలామంది అమ్మాయిలకు ఇదే పరిస్థితి. అందుకే ఈ మహిళా దినోత్సవం నుంచైనా సమాజంలో మహిళల్ని చూసే విధానంలో మార్పు రావాలని ఆశిస్తున్నాం. మహిళకు పూర్తిస్థాయి భద్రత, స్వేచ్ఛ ఉన్న రోజే అసలైన మహిళా దినోత్సవం జరుపుకోవాలి.’’
