ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపం!

ABN , First Publish Date - 2020-10-12T05:55:41+05:30 IST

రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వాళ్లు. అందరికీ అన్నం పెట్టే ఆ రైతన్నలు గత మూడు వందల రోజులుగా రోడ్డు పైకి వచ్చి న్యాయం చేయమంటూ ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని వారు, ఇప్పుడు రోజుల తరబడి దీక్షల్లో కూర్చుంటున్నారు. మాకు న్యాయం జరిగే వరకు ఆందోళనను విరమించమని అంటున్న అమరావతి మహిళల అంతరంగం ఇది...

ఊపిరి ఉన్నంత వరకు పోరాటం ఆపం!

రాజధాని కోసం భూములిచ్చిన రైతులు వాళ్లు. అందరికీ అన్నం పెట్టే ఆ రైతన్నలు గత మూడు వందల రోజులుగా రోడ్డు పైకి వచ్చి న్యాయం చేయమంటూ ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని వారు, ఇప్పుడు రోజుల తరబడి దీక్షల్లో కూర్చుంటున్నారు. మాకు న్యాయం జరిగే వరకు ఆందోళనను విరమించమని అంటున్న అమరావతి మహిళల అంతరంగం ఇది.


ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకురావడంతో అమరావతి ఆందోళనలతో అట్టుడుకుతోంది. అమరావతి నుంచి రాజధాని విశాఖకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళనకు బాట పట్టారు. వారి ఉద్యమానికి ఈ రోజుకి సరిగ్గా 300 రోజులు. రైతులు ఇంత పెద్ద స్థాయిలో ఉద్యమం చేయడం ఇదే ప్రథమం. ఈ ఉద్యమాన్ని ముఖ్యంగా ముందుండి నడిపిస్తోంది... మహిళలే. రోజు ఆందోళనలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు. వాళ్లందరూ ఎన్నడూ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయితే ఈ ఉద్యమ అనుభవం తమకు కొత్త పాఠాలు నేర్పుతోందని అంటూనే లక్ష్య సాధనలో అనేక కష్ట, నష్టాలు ఎదుర్కొంటున్నామని చెమర్చిన కళ్లతో అంటున్నారు. ’టీవీల్లో ఇలాంటి ఆందోళనలు చూడడమే తప్ప ప్రత్యక్ష అనుభవం లేదు. మాట్లాడటమే చేతగాని మేము నేడు గొంతెత్తి నినాదాలు చేస్తున్నాము. రోజూరోడ్డెక్కుతున్నాం. మా శ్వాస ఉన్నంత వరకూ పోరాడతాం. మాకు న్యాయం జరగాలి. రాష్ట్ర భవిష్యత్తు కోసం నాడు మా భూములు త్యాగం చేశాం. నేడు దానిని నిలబెట్టుకోవటానికి తనువంతా పుండ్లు చేసుకుని పోరాడుతున్నాం. కన్న బిడ్డలాంటి అమరావతిని కాపాడుకోవటానికి ప్రసవం బాధను భరిస్తున్నాం’ అని అమరావతి  మహిళలు అంటున్నారు.

 జి. మనోజ్‌ కుమార్‌, గుంటూరు







కంటి నిండా నిద్రపోయి నెలలవుతోంది!

నాకు 22ఏళ్ల వయసులో భర్త చనిపోయాడు. ఉన్న ఎకరం 5సెంట్లలో వ్యవసాయం చేసుకుంటూ, కూలి పనులకు వెళుతూ ఇంటిని లాకొచ్చాను. ఇద్దరు పిల్లల పెళ్లి చేశాను. అమరావతి కోసం ఉన్న కాస్త భూమి ఇచ్చేశాను. ఇప్పుడు మళ్లీ రాజధాని మారుస్తామంటున్నారు. ఉన్నదంతా ఇచ్చాం ఎలా బతకాలో తెలియడం లేదు. పిల్ల కాపురం పాడై నా దగ్గరే ఉంటుంది. కిందామీద పడి మనవడిని ఇంజనీరింగ్‌లో చేర్చాం. ఇక్కడే ఉద్యోగం వస్తుంది కళ్ల ముందు ఉంటాడని అనుకున్నాం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆలోచిస్తుంటూ గుండె చెరువైపోతోంది. నిద్ర రావడం లేదు. కంటి నిండా నిద్రపోయి నెలలవుతోంది. ఆరోగ్యం పాడైయింది. బీపీ పెరిగింది. మందు బిల్ల అంటే తెలియని నేను రోజుకో బి.పి బిల్ల వేసుకోవాల్సి వస్తోంది. ఏది ఏమైనా మా పిల్లల భవిష్యత్తుతో పాటు... రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ పోరులో విజయం సాధించే వరకు పాల్గొంటూనే ఉంటాను.

- పొన్నం రాజేశ్వరి, తుళ్లూరు



 పండగ లేదు... పబ్బం లేదు!

పదినెలల నుంచి పండగ, పబ్బం ఏదీ లేదు. ఓ శుభకార్యంలో పాల్గొన్నది లేదు. ఊళ్లలో ఎవరి నోట విన్నా అమరావతి గురించే. ఈ వయసులో మాకెందేకీ బాధలు. కన్నీరు దిగమింగుకొని బతుకుతున్నాం. అమరావతికి భూములివ్వటమే మేం చేసిన తప్పా? తృప్తిగా పిల్లలకు ఇంత వంట చేసి పెట్టి చాలా రోజులయింది. వాళ్లు ముద్ద సహించటం లేదంటున్నారు. నాపైన 4 కేసులుపెట్టారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చేసిన త్యాగం నేడు నవ్వుల పాలవుతోంది. గంటల తరబడి కూర్చొని నడుము, తుంటి నొప్పులు వస్తున్నాయి. ఇంకెన్ని ఇబ్బందులు పెడతారో పెట్టండి. మేము మాత్రం ఊపిరి ఉన్నంత వరకు అమరావతి కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. రాజధానిగా అమరావతిని నిలబెట్టుకుంటాం.

- జి. ప్రభావతి, మందడం





పిల్లోడు చదువులో వెనకబడుతున్నాడు

నేను ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాను. ప్రభుత్వం అమరావతి తరలింపు నిర్ణయాన్ని మార్చుకోవాలని ఉద్యమంలోకి వచ్చాను. మాములుగా మొదలైన నా పోరాటం అనేక మలుపులు తిరిగింది. అమరావతిపై అనేక అసత్య ప్రచారులు జరుగుతున్న సమయంలో దళిత మహిళా జేఏసీని ఏర్పాటు చేశాను. అసైన్డ్‌ రైతుల కష్టాలపై అనేక వేదికల్లో పాల్గొని వారి కష్టాలను ప్రభుత్వం ముందు ఉంచాను. ఈ సమయంలో పిల్లోడి ఆలనా పాలన ఇంట్లో పెద్దలకు వదిలేశాను. దీంతో వాడు చదువులో వెనకబడ్డాడు. చిన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకున్న బామ్మ ఆసుపత్రి పాలైనప్పుడు ఢిల్లీలో ఆందోళన చేస్తున్నాం. అప్పుడు ఆమె పక్కన ఉండలేకపోయాను. నినాదాలు ఎక్కువగా ఇవ్వడంతో కుడి భుజం నొప్పి పెడుతోంది. డాక్టర్‌ వద్దకు వెళితే ఫిజియోథెరపి అవసరమన్నారు. అది చేయించుకునే సమయం కూడా లేదు. మేము ఏమైనా పరవాలేదు. పోరు మాత్రం అపేది లేదు. అమరావతిని సాధించుకుంటాం.

- కె. శిరీష, రాయపూడి







పవిత్ర మాసంలో దీక్ష చేసినట్లుగా చేస్తున్నాం

నా వయసు 70 సంవత్సరాలు. జీవితంలో అన్ని బాధ్యతలు తీరిపోయాయి. ఈ తరుణంలో అమరావతి పోరు మొదలయింది. పిల్లలు పోలీసులతో దెబ్బలు తింటూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వారి కోసం నేనూ ఆందోళన బాట పట్టా. రోజు శిబిరానికి వస్తున్నా. నన్ను చూసి నా వయసు వారు పదిమంది వస్తున్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్ష చేసినట్లుగా... అమరావతి కోసం దీక్ష చేపట్టాం. ఈ వయసులో నిరాహార దీక్షలు చేస్తున్నాం. రైతులతో కలిసి పెరిగాం. అందరి కలిసి ఉంటాం. మా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులు నాకు ఊహ తెలిసినాక చూడలేదు. ఊరిలో జనాలు ఎంత మంది ఉన్నారో అంతమంది పోలీసులు ఉంటున్నారు. అందరూ బాగుండాలనదే మా అకాంక్ష. అమరావతి అందరిది. దాన్ని నిలబెట్టుకోవటం కోసం తుది శ్వాస వరకు పోరులో నేను భాగమవుతాను. 

- ఫాతిమాబీ, రాయపూడి





రాత్రి మిషన్‌ కుడుతూ... పగలు ఆందోళనలో పాల్గొంటూ...

సంవత్సరం క్రితం నా భర్త పోయాడు. బాధలో ఉన్న నాకు రాజధాని తరలింపు వార్త పిడుగులా అనిపించింది. అసరాగా ఉన్న 83 సెంట్ల భూమిని అమరావతి ఇచ్చాను. ఇప్పుడు ఆ భూమి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. దీనిపై పోరాడుతున్న వారితో నేను సైతం అంటూ ఉద్యమంలోకి వచ్చాను. కాని పిల్లలను పోషించుకోవాలి. దానికోసం రాత్రుళ్లు మిషన్‌ కుట్టుకుంటూ పగలు శిబిరంలో ఆందోళనలకు హాజరవుతున్నాను. నా పరిస్థితి గమనించి తోటి మహిళలు నాకు అండగా నిలుస్తున్నారు. నాకు సాయం చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిబిరంలో ఉంటున్నాను. దీంతో ఆరోగ్యం పాడయింది. తీవ్రమైన వెన్నునొప్పి వస్తోంది. అయినా వెనకడుగు వేసేది లేదు. నా బిడ్డలాంటి ఎందరో తల్లుల బిడ్డల కోసం ఈ పోరాటం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి కోసం అందరితో కలిసి పోరాటంలో పాల్గొంటాను.

- ఎన్‌. విమలారెడ్డి, తుళ్లూరు





మానసిక ఆందోళనకు గురవుతున్నాం

రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉద్యమంలోకి వచ్చాం. దీనికోసం ప్రాక్టీస్‌ వదిలేసాను. అన్ని గ్రామాలతో పాటు ఇతర నియోజకవర్గ కేంద్రాలు, దేశ రాజధాని డిల్లీలోను ఆందోళనలు నిర్వహించాం. ఈ దశలో కుటుంబానికి పూర్తిగా దూరం అవుతున్నాం. పిల్లలతో కొద్ది సమయం కూడా గడపలేకపోతున్నా. వారికి చేబితే అర్థం చేసుకుంటున్నారు. అయితే అమరావతిని వ్యతిరేకించే వారు మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారు. మాటలతో వేధిస్తున్నారు. చెప్పనలవి కాని మాటలు అంటున్నారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు మనకు ఇదంతా అవసరమా అంటున్నారు. అయినా రాష్ట్రం కోసం తప్పదని నిర్ణయించుకున్నాను. ఈ ఉద్యమంలో మహిళ పాత్ర గురించి అందరు చెప్తున్నారు. అయితే వారు పడుతున్న ఇబ్బందులు మాత్రం అనేకం. అనేక రోగాల బారిన పడుతున్నారు. డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు.

- డాక్టర్‌ రాయపాటి శైలజ, మహిళా జేఏసీ నేత

Updated Date - 2020-10-12T05:55:41+05:30 IST