యోగాతో ప్రపంచాన్నే ఏకం చేయవచ్చు!

ABN , First Publish Date - 2020-06-21T05:30:00+05:30 IST

ఈ రోజు యోగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందుతోంది. ఇది కాలపరీక్షకు నిలిచిన ఏకైక సంక్షేమ ప్రక్రియ. అలా నిలవడానికి చాలా కారణాలున్నాయి. మన గురించి మనకు తెలియని ప్రాథమిక వాస్తవాలను మనం గ్రహించేలా చెయ్యడం...

యోగాతో ప్రపంచాన్నే ఏకం చేయవచ్చు!

ఈ రోజు యోగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాదరణ పొందుతోంది. ఇది కాలపరీక్షకు నిలిచిన ఏకైక సంక్షేమ ప్రక్రియ. అలా నిలవడానికి చాలా కారణాలున్నాయి. మన గురించి మనకు తెలియని ప్రాథమిక వాస్తవాలను మనం గ్రహించేలా చెయ్యడం వాటిలో ఒకటి. మన శరీరం ఒక బారోమీటర్‌ లాంటిది.. దాన్ని ఎలా చూడాలో తెలిస్తే మన గురించి సర్వం అది చెబుతుంది. అవి మన గురించి మనం ఊహించుకొనే విషయాలు కావు, మనం ఏమిటో తెలిపే వాస్తవాలు. 


ప్రస్తుత కాలంలో మునుపటికన్నా ఎక్కువగా యువతరం అయినా, పెద్దతరం వారైనా... తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఆందోళనకూ, ఆత్రుతకూ గురవుతున్నారు. ఆ అంతర్గత కల్లోలాన్ని తొలగించుకోవడానికి కనబడిన ప్రతి పద్ధతినీ వినియోగిస్తూ ఉంటారు. డిస్కోలకు వెళతారు, కార్లలో తిరుగుతారు, కొండలు ఎక్కుతారు. ఈ పద్ధతులు కొంతవరకూ పని చేస్తాయి. కానీ పూర్తి పరిష్కారం ఇవ్వవు. కాబట్టి వారు యోగా వైపు చూడడం చాలా సహజం. యోగాకు ప్రజాదరణ నానాటికీ పెరుగుతూ ఉండడానికి కారణం విద్య విస్తృతం కావడం!


‘సిక్స్‌ప్యాక్‌’ కోసమైతే...!

అయితే, ప్రపంచంలో చాలా చోట్ల యోగా చేస్తున్న పద్ధతిని చూస్తే మృత శిశువులా అనిపిస్తోంది. మీకు సిక్స్‌ప్యాక్‌ కావాలంటే టెన్నిస్‌ ఆడండి. కొండలు ఎక్కండి. యోగా అనేది ఎక్సర్‌సైజ్‌ కాదు. దీనికి ఫిట్‌నెస్‌ కన్నా భిన్నమైన కోణాలు ఉన్నాయి.  

యోగా వ్యాయామం కాదు కాబట్టి దాన్ని సూక్ష్మంగా, సున్నితంగా అభ్యాసం చెయ్యాలి. బలవంతంగా కండరాలు పెంచడానికి కాదు. భౌతిక శరీరానికి సంపూర్ణమైన స్మృతి నిర్మాణం ఉంది. ఈ భౌతిక శరీరాన్ని మనం చదవదలచుకుంటే... ప్రతీదీ - శూన్యం నుంచి ఈ దశవరకూ విశ్వంలో ఏర్పడిన తీరు- ఈ శరీరంలో రాసి ఉంటుంది. ఆ స్మృతిని వెలికి తీసుకువచ్చే మార్గం యోగా. అది జీవితాన్ని పరమ సంభావ్యత వైపు పునర్నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా ఉదాత్తమైన శాస్త్రీయమైన ప్రక్రియ. 


పరిపూర్ణమైన ఎదుగుదలకు యోగా ఉపయోగపడుతుందా?

యోగా ఎదుగుదలకు సంబంధించినది కాదు, సాధకుడు తనలో తాను లయమవడానికి సంబంధించినది! వ్యక్తిగత జీవన శక్తిని విశ్వంతో అనుసంధానం చేయడానికి ఉపయోగపడే సాధనం ఇది. మీ జీవితానుభవం తన పరిమితులను దాటి విశ్వంతో ఒకటైనప్పుడు, దాన్ని ‘యోగా’ అంటారు. మనలో ఏకత్వం, పూర్ణత్వం అనుభూతి చెందినప్పుడు దాన్ని యోగా అంటారు. 


ఏకత్వం వైపు వెళ్ళడానికి సులువైన ప్రక్రియ ఏది?

సంస్కృతంలో ‘యోగా’ అంటే ‘సంగమం’ లేదా ‘ఏకత్వం’. ఆ ఏకత్వం వైపు వెళ్ళడానికి అతి సరళమైన యోగాభ్యాసం ‘నమస్కారం’. మీలో జరిగే పోరాటంలో మొదటి మెట్టు... ‘ఇడ నాడి’ - ‘పింగళ నాడి’ మధ్య, కుడి - ఎడమ మెదడుల మధ్య, మనలో ఉండే సూర్య తత్త్వం - చంద్రతత్వం మధ్య, చైనీస్‌ తాత్త్వికతలోని ‘ఇన్‌ -’ ‘యాంగ్‌’ల మధ్య... ఇలా ఈ రెండు ధ్రువాల మధ్యా జరిగే ఘర్షణ మీ జీవితంలో లక్షల విధాలుగా బయట పడుతుంది. మీరు రెండు చేతులూ కలిపి నమస్కారం చేస్తే, మీలో ఉన్న ద్వైత భావాలను సామరస్యంతో నిర్వహించడమే కాదు, ప్రపంచాన్నే ఏకం చెయ్యగలరు.


మద్యం, మాంసం వదిలిపెట్టకుండా యోగా చెయ్యవచ్చా?

యోగా ఎవరి మీదా ఏ ఆంక్షలూ పెట్టదు. ఇది మీ జీవశక్తిని అర్థం చేసుకోవడానికి పనికివచ్చే సాధనం. బయటి రసాయనాలతో పని లేకుండా మీలో మీరే బ్రహ్మానందంగా ఉండగలిగితే... అప్పుడు మీకు మద్యం అవసరం లేదు. పొగ తాగనక్కరలేదు. నా జీవితంలో నేను ఎప్పుడూ ఎలాంటి మత్తు పదార్థాలూ తీసుకోలేదు. కానీ నా కళ్ళు ఎప్పుడూ మత్తులోనే ఉంటాయి. యోగులకు మత్తు పదార్థాలు, తాగుడు... ఇవి చిన్నపిల్లల ఆట లాంటివి. ఆ బయటి పదార్థాల వల్ల వచ్చే మత్తు కన్నా వెయ్యిరెట్ల మత్తు మాలో ఉన్న సజీవ ఉత్సాహం వల్ల కలుగుతుంది. ఎప్పుడూ దానిలో మునిగి ఉంటాం. ఆ స్థితికి చేరితే సురాపానం ఏం ఖర్మ... అమృతపానంలోనే మీరూ మునిగి తేలవచ్చు!

-సద్గురు జగ్గీ వాసుదేవ్‌


Updated Date - 2020-06-21T05:30:00+05:30 IST