సుగంధద్రవ్యాల కల్తీ కనిపెట్టాలంటే?

ABN , First Publish Date - 2020-10-03T05:30:00+05:30 IST

వంటింట్లో సుగంధద్రవ్యాలది అగ్ర స్థానమే! కొనేటప్పుడు కల్తీ లేని, నాణ్యమైన, తాజా సుగంధద్రవ్యాలనే ఎంచుకోవాలి...

సుగంధద్రవ్యాల కల్తీ కనిపెట్టాలంటే?

  • వంటింట్లో సుగంధద్రవ్యాలది అగ్ర స్థానమే! ఇవి వంటకాలకు రుచి, సువాసనలను జోడిస్తాయి. కాబట్టి కొనేటప్పుడు కల్తీ లేని, నాణ్యమైన, తాజా సుగంధద్రవ్యాలనే ఎంచుకోవాలి. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి!


దాల్చిన చెక్క!

ఎక్కువ శాతం మనం సరుకుల షాపుల్లో కొనే సుగంధద్రవ్యం.... దాల్చినచెక్క రూపంలో ఉండే చైనీస్‌ కేసియా! నిజానికి సిసలైన దాల్చిన చెక్క... సీలాన్‌ సినమన్‌. ఈ రెండింటికీ రూపం, సువాసనల్లో తేడా ఉంటుంది. చైనీస్‌ కేసియా సువాసన తక్కువగా ఉండి, మందంగా, చుట్టలు చుట్టుకుని ఉంటుంది. సినమన్‌ పలుచగా, ఘాటుగా ఉంటుంది. పొడి రూపంలో ఉన్న దాల్చినచెక్కను కొనేటప్పుడు దానిలో ఒక చుక్క అయోడిన్‌ వేసి చూడండి. అది నీలంగా మారితే అందులో చైనీస్‌ కేసియా కలిసిందని అర్థం.


నల్ల మిరియాలు!

నల్ల మిరియాలను బొప్పాయి గింజలతో కల్తీ చేస్తూ ఉంటారు. ఈ రెండింటి ఆకారం, పరిమాణం ఒకేలా ఉండడంతో కల్తీని కనిపెట్టడం కష్టంగా ఉంటుంది. మిరియాలు కొనేటప్పుడు, నలిపి చూడాలి. ఒకవేళ అవి నకిలీవి కానట్లయితే పెద్ద ముక్కలుగా విరుగుతాయి. కొంత నూనె కూడా చేతికి అంటుకుంటుంది. ఒకవేళ నకిలీవి, పాతవి అయితే చిన్న ముక్కలుగా విరిగిపోతాయి.


మరాఠీ మొగ్గ!

ఇది ఎరుపు గోధుమ రంగులో కలపలా ఎండిపోయి ఉండడంతో దీని తాజాదనాన్ని కనిపెట్టడం కొంత కష్టం. అయుతే ఇవి నకిలీవి కావని గ్రహించడానికి పువ్వులాంటి మరాఠీ మొగ్గ సెగ్మెంట్స్‌ (రెమ్మలు) లెక్కపెట్టాలి. అవి ఎనిమిది ఉండి, వాటి లోపలి విత్తనం మెరుస్తూ ఉంటే, ఆ మరాఠీమొగ్గ సిసలైనదే! అలాకాకుండా మరాఠీ మొగ్గ ముదురు రంగులో ఉండి, తేలికగా విరిగిపోతూ ఉంటే పాతది, తక్కువ నాణ్యత కలిగినదిగా భావించాలి. 


మిరప కారం!

కారాన్ని ఇటుక పొడి, పౌడరు లేదా సబ్బురాయులతో కల్తీ చేస్తూ ఉంటారు. సిసలైన కారం పొడి నీళ్లలో కరగదు. కాబట్టి కొద్దిగా కారాన్ని గ్లాసుడు నీళ్లలో కలిపి చూడాలి. నీళ్లు రంగు మారితే ఆ ఆ కారం కల్తీదని అర్థం.


యాలకులు!

యాలకులు కొనేటప్పుడు వాటి రంగు మీద దృష్టి పెట్టాలి. తాజా యాలకులు ఉబ్బెత్తుగా ఉండి, ఆలివ్‌ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఒకవేళ ముదురు ఆకుపచ్చగా ఉంటే, తాజాగా కనిపించడం కోసం వాటికి రంగు జోడించారని గ్రహించాలి. కొనేటప్పుడు వేళ్లతో నలిపి చూడాలి. వేళ్లకు రంగు అంటుకోకపోతే కొనుక్కోవచ్చు.


లవంగాలు!

 లవంగాల తాజాదనం తెలుసుకోవడం కోసం వాటిని నీళ్లలో వేయాలి. నీళ్ల మీద పాతవి చదునుగా, తాజావి నిలువుగా తేలతాయి.


పసుపు!

పసుపు కొనేటప్పుడు, నీళ్లలో వేసి చూడాలి. నీళ్ల మీద తెల్లని పలుకులు తేలితే, ఆ పొడి సిసలైన పసుపు కొమ్ములతో తయారుకాలేదని అర్థం.

Updated Date - 2020-10-03T05:30:00+05:30 IST