వీరజవాన్ విగ్రహం... మాకు ఉద్వేగభరితం!
ABN , First Publish Date - 2020-07-08T05:30:00+05:30 IST
జీవం ఉట్టిపడే శిల్పాల తయారీలో వారిది అందెవేసిన చెయ్యి... వృత్తిలో భాగంగా దేవతామూర్తులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, స్వర్గస్థులైన వారి విగ్రహాలకు రూపకల్పన చేస్తుంటారు...

జీవం ఉట్టిపడే శిల్పాల తయారీలో వారిది అందెవేసిన చెయ్యి... వృత్తిలో భాగంగా దేవతామూర్తులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ నాయకులు, స్వర్గస్థులైన వారి విగ్రహాలకు రూపకల్పన చేస్తుంటారు. ఇటీవలే భారత్-చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్‌బాబు విగ్రహాన్ని తయారుచేసి వార్తల్లోకి ఎక్కిన పెనుగొండ వంశీయులు, వడయారు సోదరుల్లో ఒకరైన శిల్పి అరుణ ప్రసాద్ తమ శిల్పకళా నైపుణ్యం గురించి ఏమంటున్నారంటే...
‘‘మాది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం గ్రామం. మా పూర్వీకులు కర్ణాటక, మైసూర్‌కు చెందిన పెనుగొండ వంశీయులు. డిగ్రీ అనంతరం శిల్పకళలో పీజీ డిప్లమో చేశాను. భారతీయ సంప్రదాయ కళలపై మక్కువతో శిల్ప కళను నేర్చుకుని, నా సోదరుడు కరుణాకర్‌కి కూడా విగ్రహాల తయారీ
నేర్పించా. ఇద్దరం కలిసి ‘ఏకే ఆర్ట్స్’ సంస్థను ఏర్పాటు చేసి ఇప్పటిదాకా వేలాది విగ్రహాలను రూపొందించాం. శిల్పాలు అంటే ఎవరికైనా సరే నత్తా రామేశ్వరం పేరు గుర్తొచ్చేలా చేశాం. ఈ కళపై ఉన్న జిజ్ఞాసతో శిల్పాల తయారీలో మెలకువలను అధ్యయనం చేసి వెస్ట్బ్రూ యూనివర్శిటీలో 2007లో డాక్టరేట్ పొందా.
వీరజవాన్‌కు నీరాజనం...
భారత్-చైనా సరిహద్దుల్లో అశువులు బాసిన వీరజవాన్ కల్నల్ సంతోష్‌బాబు విగ్రహానికి మట్టి, సున్నపురాయి మిశ్రమంతో రూప నమూనా రూపొందించాం. సూర్యాపేటకు చెందిన సంతోష్‌బాబు స్నేహితుల కోరిక మేరకు విగ్రహాన్ని తయారుచేసి అందించాం. ఒక దేశభక్తుడి
విగ్రహం తయారు చేయడం మాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ముందుగా ఫైబర్ మిశ్రమంతో ఈ విగ్రహాన్ని డైగా చేశాం. అనంతరం ఫైౖబర్ విగ్రహానికి తుది మెరుగులు దిద్ది తైల వర్ణంతో సహజంగా ఉండే విధంగా రూపొందించాం. దేశం కోసం ప్రాణాలర్పించిన సంతోష్‌బాబు సజీవంగా ఉండాలనే ధ్యేయంతో కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకాగ్రతతో రూపొందించాం. వేలాది విగ్రహాలు చేసినప్పటికీ సంతోష్‌బాబు విగ్రహం చేస్తున్న సమయంలో మాకు ఓ రకమైన ఉద్వేగం కలిగింది.
90 అడుగుల వాసవీ మాత...
నేను ఈ కెరీర్ మొదలెట్టిన ప్రారంభంలో ఆర్య వైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని రూపొందించాం.
వాసవీ మాత విగ్రహం తయారీలో అనేక విషయాలను అధ్యయనం చేశా. ప్రతి బంధకాలను అధిగమించి విగ్రహం తయారుచేసినప్పటికీ, ఆలయ నిర్మాణం ఆలస్యం కావటంతో క్లే మోడల్స్‌ను భద్రపరచటంలో ఇబ్బందులు పడ్డా. విగ్రహం కాస్టింగ్ సమయంలో రూ.10 లక్షలతో కొనుగోలు చేసిన హైడ్రాలిక్ ప్రింటింగ్ మిషన్ పనిచెయ్యకపోవటంతో ఇబ్బందిపడ్డాం. గోదావరి ఇసుకతోనే హ్యండ్ మోడల్ చేస్తాం. అయితే అది ఉపయోగపడలేదు. దాంతో హైదరాబాద్ నుంచి రెండు లారీల వైట్ శాండ్ తెప్పించాం. 90 అడుగుల విగ్రహాన్ని తొమ్మిది పార్టులుగా చేసి టింకరింగ్ చేశాం. విగ్రహాన్ని నెలకొల్పే ప్రాంతంలో 90 అడుగుల లోతు ఫౌండేషన్ వేసుకుంటూ, కాంక్రీట్ సిప్స్, సెంటింగ్ సిమెంట్, టెక్నాలజీ ఉపయోగించాం. అమ్మవారి ముఖం డిజిటల్ త్రీడీ, ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించాం. ఆరేళ్ల కృషి ఫలితం... 90 అడుగుల భారీ శ్రీవాసవి కన్యకా పరమేశ్వరీ అమ్మవారి విగ్రహం. పంచలోహ విగ్రహాల గొప్పతనం ఏమిటంటే విగ్ర హానికి మూడు కిలోమీటర్ల చుట్టూ పాజిటివ్ వేవ్స్ వ్యాప్తి చెందుతాయి. చుట్టుపక్కల ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
రాతి విగ్రహాలతో పాటు సిమెంట్, ఫైబర్, కాంస్య, పంచలోహ విగ్రహాలు కూడా రూపొందిస్తున్నాం. ఆగమశాస్త్రం ప్రకారం దేవతామూర్తుల చరిత్రను తెలుసుకుని ఆభరణాలు, ఆయుధాలను అధ్యయనం చేసి విగ్రహన్ని తీర్చిదిద్దుతాం. ఇక మానవ విగ్రహాల విషయానికొస్తే... వేషధారణ, వారి కుటుంబీకుల చిత్రాలు, ఆ వ్యక్తి పాత, కొత్త చిత్రాలను సేకరిస్తాం. నిక్షిప్తమైన, సూక్ష్మమైన కవళికలను కంప్యూటర్లో అనాటమీ ప్రకారం కొలతలు తీసుకుంటాం. ముందుగా స్కేల్ మోడల్, క్రియేటివ్ ఆర్ట్, మొకబ్ చేసి క్లే మోడల్ ద్వారా, సిరామిక్ క్లేతో నమూనా చిత్రాన్ని రూపొందించి వారి కుటుంబ సభ్యులకు చూపించి, ఆ తర్వాత విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతాం.’’
-టి. రాంబాబు, పెనుమంట్ర