ఆమె 80 ఇయర్స్ యంగ్‌!

ABN , First Publish Date - 2020-07-18T05:30:00+05:30 IST

ఉషా సోమన్‌... ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచిన మిళింద్‌ సోమన్‌ తల్లి. అంతేకాదు అతడికి స్ఫూర్తి తనే. వృద్ధాప్యంలోనూ మారథాన్‌ పరుగు, సాహసయాత్రలతో ఎంతో హుషారుగా....

ఆమె 80 ఇయర్స్ యంగ్‌!

ఉషా సోమన్‌... ఫిట్‌నెస్‌కు మారుపేరుగా నిలిచిన మిళింద్‌ సోమన్‌ తల్లి. అంతేకాదు అతడికి స్ఫూర్తి తనే. వృద్ధాప్యంలోనూ మారథాన్‌ పరుగు, సాహసయాత్రలతో ఎంతో హుషారుగా, ఉత్సాహంగా గడుపుతున్నారామె. ఈమధ్యే తన 81వ పుట్టినరోజున 16 పుషప్స్‌ చేసి, జీవితంలో ఫిట్‌నెస్‌ అవసరాన్ని చాటిన ఆవిడ విశేషాలివి. 


ఉష తన ఫిట్‌నెస్‌ చాటుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.  ఏప్రిల్‌లో వారి ఇంటి డాబా మీద కోడలు అంకితతో కలిసి ఒంటి కాలితో పరుగెత్తారు. తనతో పోటీగా పరుగెత్తిన అత్యయ్యను చూసి ‘‘నేను ఒకవేళ 80 ఏళ్లు జీవిస్తే, మీలానే ఫిట్‌గా ఉండాలని కోరుకుంటా. మీరు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారు’’ అని ఆ వీడియోకు కామెంట్‌ జోడించారు అంకిత. గత ఏడాది ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా కుమారుడు మిళింద్‌తో కలిసి ఆగకుండా 16 పుషప్స్‌ తీశారు. ఉష 2016లో చీరకట్టులోనే కాళ్లకు చెప్పులు లేకుండానే మారథాన్‌లో పాల్గొన్నారు. గతంలో 100 కి.మీ దూరాన్ని 41 గంటల్లో చేరుకొని వార్తల్లో నిలిచారు కూడా!. మిళింద్‌ తరచుగా తన తల్లి ఫిట్‌నెస్‌ వీడియోలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ అందరిలో స్ఫూర్తి నింపుతుంటారు.


మారథాన్‌ రన్నర్‌గా, ఫిట్‌నెస్‌ ఐకాన్‌గా మిళింద్‌ సోమన్‌, ఆయన భార్య అంకితా కొన్వార్‌ సుపరిచితమే. తాజాగా వీరికి మిళింద్‌ అమ్మ ఉషా సోమన్‌ జతకలిశారు. ఇటీవల (జూలై 3న) 81వ పడిలో అడుగుపెట్టిన ఆమె తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకొన్నారు. కొడుకు మిళింద్‌, కోడలు అంకిత సమక్షంలో ఎంతో ఉత్సాహంగా 15 పుషప్స్‌ తీసి కేక్‌ కట్‌చేశారామె. తల్లి పుషప్స్‌ తీస్తున్న వీడియోను మిళింద్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ఆ వీడియో చూసి ఫిట్‌నెస్‌, యోగా శిక్షకురాలు శిల్పాశెట్టి ‘వావ్‌.. ఇది ఎంతో  స్ఫూర్తిదాయకం’ అంటూ కామెంట్‌ చేశారు. ‘మీరు అమోఘం’ అని అర్జున్‌ రాంపాల్‌ ప్రశంసించారు. ఎనిమిది పదుల వయసులోనూ ఆవిడ హుషారు, ఫిట్‌నెస్‌ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.  


అరవై ఏళ్ల వయసులో ట్రెక్కింగ్‌

బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా ఉద్యోగవిరమణ తర్వాత ఉష తన మలి జీవితాన్ని కొత్తగా గడపాలనుకున్నారు. విరామ సమయాన్ని సాహసయాత్రలు, మారథాన్‌ పరుగుతో ఆస్వాదించడం మొదలెట్టారు. కొడుకు మిళింద్‌తో కలిసి మారథాన్‌లో పరుగులు తీసేవారు. అరవయేళ్ల వయసులో ట్రెక్కింగ్‌ నేర్చుకున్నారు. ఎవరెస్ట్‌ పర్వతం బేస్‌ క్యాంప్‌తో పాటు ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమింజారో శిఖరాన్ని అధిరోహించారు. 


రోజూ నడక, సంప్రదాయ ఆహారం

‘‘ఆహార నియమాల గురించీ, ఎక్కువ ప్రొటీన్‌, సరైన మోతాదులో కార్బోహైడ్రేట్‌ ఫుడ్‌ తీసుకోవడం వంటివి నేను అస్సలు పట్టించుకోను. మన సంప్రదాయ ఆహారమే అన్నివిధాలా పరిపూర్ణమైనది. నేను ట్రెడిషనల్‌ ఫుడ్‌నే తింటాను. ఫిట్‌నెస్‌ అనేది శరీరానికే కాదు మనసుకూ సంబంధించినది. మానసికంగా దృఢంగా ఉండాలి. మనసే కదా మనల్ని నడిపించేది’’ అంటారు ఉష. ఆమె దృష్టిలో వయసనేది ఒక అంకె మాత్రమే. మీకు ఫిట్‌నెస్‌ మీద ఇష్టం పెరగడానికి కారణం ఏమిటని అని ఎవరైనా అడిగితే ‘‘ఫిట్‌నెస్‌ గురించి నాకు అంతగా తెలియదు. శారీరకంగా ఉత్సాహంగా ఉండడం జీవితంలో ఒక భాగం. నేను ఎక్కువ సమయం నడకను ఇష్టపడతా.


రోజూ ఉదయం 5 కి.మీ నడుస్తా. నన్ను నేను ఎప్పుడూ బిజీగా ఉంచుకుంటా.  ఇప్పుడు టెక్నాలజీ రాకతో అందరి జీవనశైలి మారిపోయింది. ప్రతి ఒక్కరూ తమకు ఉన్నదానికన్నా ఎక్కువ కోరుకుంటున్నారు. తమ అవసరాలేమిటో మరచిపోతున్నారు. అయితే అవసరాల మేరకు పనిచేయడం, ఎప్పుడూ సంతోషంగా ఉండడం, సానుకూలంగా ఆలోచించడం తప్ప ఇంకేమీ అవసరం లేదు’’ అని బదులిస్తారామె. పరుగులోనూ, ఆత్మవిశ్వాసంలోనూ యువరక్తం నిండిన ఉషా సోమన్‌ జీవితం నేటి తరానికి ఆదర్శనీయం.

Updated Date - 2020-07-18T05:30:00+05:30 IST