మాటలు కాదు... మనసులు కలపాలి

ABN , First Publish Date - 2020-07-15T05:30:00+05:30 IST

జంటగా ఎన్నిరోజులు కలిసి ఉన్నారనేది కాదు... భావోద్వేగాల పరంగా ఎంత దగ్గరగా ఉన్నారనేది ముఖ్యం. మీరు ఎవరితోనైతే జీవితంలో చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తారో వారిని భాగస్వామిగా ఎంచుకోవడం, వారితో అడుగేయడం ఏమంత కష్టమేమీ కాదు...

మాటలు కాదు... మనసులు కలపాలి

జంటగా ఎన్నిరోజులు కలిసి ఉన్నారనేది కాదు... భావోద్వేగాల పరంగా ఎంత దగ్గరగా ఉన్నారనేది ముఖ్యం. మీరు ఎవరితోనైతే జీవితంలో చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదిస్తారో వారిని భాగస్వామిగా ఎంచుకోవడం, వారితో అడుగేయడం ఏమంత కష్టమేమీ కాదు. ఏ బంధమైనా ఎక్కువ రోజులు నిలబడాలంటే ఇద్దరూ పాటించాల్సినవి... 


  1. మాటలతో మనసు కలపాలి: ప్రతి బంధాన్నీ నిలబెట్టేది మాటల ప్రవాహమే. అది మీ ఆఫీసు పని, కుటుంబం, మీరు భావోద్వేగానికి గురయ్యే విషయాలు... ఇలా ఏవైనా మాట్లాడుతూ ఉన్నంత వరకూ మీ బంధానికి ఢోకా ఉండదు. మీ అభిప్రాయాలు, సమస్యలు మీ భాగస్వామితో పంచుకోవడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. మీ ప్రియమైన వారితో మీకున్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. 
  2. గొడవలను ఒక్కటిగా: ప్రతి జంట మధ్యా చిన్న చిన్న సమస్యలు, గొడవలు రావడం సహజమే. అయితే ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలున్న జంట మాత్రం అవేమీ పట్టించుకోదు. అలాగని సమస్యలకు దూరంగానూ వెళ్లరు. ఎదుటివారిపై నింద వేసుకోకుండా ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. 
  3. అంగీకారం: భిన్నాభిప్రాయాలు, విరుద్ధమైన ఆలోచనలు ఏ బంధంలోనైనా ఉండేవే. అయితే మీ భాగస్వామి ఆలోచనలు, అభిప్రాయాలకు విలువ ఇవ్వడం ముఖ్యం. అలాగని వారు చెప్పే ప్రతి విషయాన్నీ ఒప్పుకోవాలని కాదు. కానీ విమర్శలు, కొత్త ఆలోచనలకు స్థానం బంధం దృఢంగా ఉంటే తప్ప సాధ్యం కాదు. 
  4. గౌరవించుకోవాలి: ఒకరి మీద ఒకరికి ప్రేమతో పాటు గౌరవమూ ఉండాలి. దాంతో వ్యక్తిగతంగా మెరుగయ్యే వీలుంటుంది. మీది ముచ్చటైన జంట అనేందుకు ఇదొక సంకేతం. మీ భాగస్వామి ఇష్టానిష్టాలు, అవసరాలు తెలుసుకోవాలి. అలానే వారికి స్వేచ్ఛనివ్వడం, వారికోసం సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో కూడా అర్థం చేసుకోగలగాలి. 
  5. వెన్నంటి ఉండాలి: ఆనంద క్షణాలే కాదు బాధ, అనారోగ్యం వంటివీ బంధాన్ని బలపరుస్తాయి. అందుచేత మీ భాగస్వామి అనారోగ్యంతో బాధ పడుతున్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెన్నంటి ఉండాలి. వారితో ఎక్కువ సమయం గడపాలి. మీరు అలా ఉన్నంత కాలం మీ అనుబంధం ఎప్పటికీ బీటలు వారదు. 
  6. నాణ్యమైన సమయం: మీ బంధం చాలా రోజులది కావొచ్చు. కానీ ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఎంతగా కోరుకుంటారు, జంటగా నాణ్యమైన సమయం గడిపేందుకు ఎంత ఇష్టపడతారనేది చాలా ముఖ్యం. దాంతోనే మీ రిలేషన్‌షిప్‌ ఎంత బలమైనదో తెలుస్తుంది. మీ మధ్య అన్యోన్యతకు నిలువెత్తు నిదర్శనం కూడా ఇదే! 

Updated Date - 2020-07-15T05:30:00+05:30 IST