ఇలా ఆరంభిద్దాం!

ABN , First Publish Date - 2020-03-25T06:11:38+05:30 IST

ఉగాదిని నూతన సంవత్సరం మొదటి రోజుగా జరుపుకోవడం మన ఆచారం. అలా జరుపుకోవడం కేవలం అనాదిగా వస్తున్న నమ్మకం వల్ల కాదు. దాని వెనుక మానవ శ్రేయస్సును పెంపొందించే శాస్త్ర విజ్ఞానం ఉంది.

ఇలా ఆరంభిద్దాం!

ఉగాదిని నూతన సంవత్సరం మొదటి రోజుగా జరుపుకోవడం మన ఆచారం. అలా జరుపుకోవడం కేవలం అనాదిగా వస్తున్న నమ్మకం వల్ల కాదు. దాని వెనుక మానవ శ్రేయస్సును  పెంపొందించే శాస్త్ర విజ్ఞానం ఉంది. ఇది వేల సంవత్సరాల కృషి ఫలితం. కాబట్టి దాన్ని గౌరవిద్దాం. తద్వారా మనల్ని మనం గౌరవించుకుంటూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. 


ఉగాది మొదలు 21 రోజులు...

మన సంప్రదాయంలో నిర్వహించుకొనే ప్రతి పండుగ వెనుకా, వేడుక వెనుకా ఏదో ఒక పరమార్థం, ప్రాధాన్యం ఉంటాయి. తరతరాలుగా భారతీయులు సౌరమాన, చాంద్రమాన పంచాంగాలను ప్రధానంగా అనుసరిస్తున్నారు. చాంద్రమాన సంవత్సరంలో మొదటి రోజును ‘యుగాది’ లేదా ‘ఉగాది’ అంటారు. తూర్పు దేశాల సంస్కృతిలో అన్ని అంశాలూ మనిషి శరీరంలో, చేతనలో జరిగే వాటికి అనుగుణంగానే ఉంటాయి. ఉగాది కూడా అంతే! ఈ రోజు మొదలుకొని 21 రోజుల పాటు భూమి ఒక పక్కకు ఒరిగి ఉంటుంది. దీనివల్ల  ఉత్తర ధ్రువం అత్యధిక సౌరశక్తిని పొందుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువ కావడం వల్ల మనుషులకు ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ భూమిలో శక్తి నిండేది ఆ సమయంలోనే!

ఉష్ణ మండల ప్రదేశాల్లో ఏడాదిలో ఉష్ణోగ్రత అత్యధికంగా ఉండే సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారు. మన సంప్రదాయానికి వస్తే, శరీరానికి చల్లదనాన్ని అందించే ఆముదం లాంటి నూనెలు పూసుకుంటారు. గ్రహగతితో మానవుల అనుభవానికి ఉన్న సంబంధాన్ని ఆధునిక క్యాలెండర్లు పట్టించుకోవు. కానీ సౌరమాన, చాంద్రమాన క్యాలెండర్లు (పంచాంగాలు) అలా కాదు. గ్రహగతులు మనిషి మీద చూపే ప్రభావాన్నీ, తద్వారా అతనిలో కలిగే అనుభవాలనూ పరిగణనలోకి తీసుకుంటాయి. అందుకే క్యాలెండర్‌ను అక్షాంశాల ఆధారంగా సరి చేస్తారు. 


అందుకే ఈ ప్రాముఖ్యం!

ఈ విధంగా సంవత్సరంలో మొదటి రోజైన ఉగాదికి ఎనలేని ప్రత్యేకత ఉంది. అది ఆంగ్ల సంవత్సరాది అయిన జనవరి ఒకటో తేదీకి లేదు. ఆ విశిష్టత భూమి లోపల జరుగుతున్న దానికీ, మనిషి శరీరంలో, మనసులో జరుగుతున్నదానికీ సంబంధించినది. ఇలా మనిషి శరీర నిర్మాణంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న చాంద్రమాన-సౌరమాన పంచాంగాన్ని అనుసరించి ఉగాది ఉంటుంది. గ్రహగతితో మనల్ని అనుసంధానం చేస్తుంది కాబట్టి భారతీయ క్యాలండర్‌కు శాస్త్రీయంగా కూడా ప్రాముఖ్యం. కానీ మన దేశంలోని ఈ జ్ఞానాన్ని ఈ రోజున పనికిమాలిని విషయంగా పరిగణిస్తున్నారు. దానికి కారణం కొన్ని దేశాలు మన దేశం కంటే ఎక్కువ ఆర్థిక పురోగతిని సాధించడం! కాబట్టి గుడ్డిగా వాటిని అనుసరిస్తున్నాం. 


అందరిలో దైవత్వాన్ని చూద్దాం!

ఈ నూతన సంవత్సరాన్ని అత్యున్నతంగా ఆరంభిద్దాం. ఎవరైనా పలకరించినా, ఫోన్‌ చేసినా ‘హాయ్‌’, ‘హలో’ అనవద్దు. ‘నమసే’్త, ‘నమస్కారం’ అందాం. ఇలాంటి పదాలను ఉచ్ఛరించడం మనల్ని మనం గౌరవించుకోవడమే! మనం భగవంతుని దర్శించుకున్నప్పుడూ, తలచుకున్నప్పుడూ నమస్కరిస్తాం. మన చుట్టూ ఉన్న వాళ్ళ విషయంలోనూ అదే చేద్దాం. అదే అత్యున్నత జీవన విధానం. ఈ నూతన సంవత్సరాన్ని అందరిలో దైవత్వాన్ని గుర్తించే అవకాశంగా మలచుకుందాం.

సద్గురు జగ్గీవాసుదేవ్‌

Read more