ఇద్దరమ్మాయిలు ఒక ఊరు
ABN , First Publish Date - 2020-10-07T05:56:44+05:30 IST
ఇద్దరమ్మాయిలు తమ గ్రామాన్ని పరిశుభ్రమైన ఊరుగా మలిచారు. బహిర్భూమిరహితంగా, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం ఉన్న గ్రామంగా తీర్చిదిద్దారు. వీటిని సాధించడం కోసంగా నిరవధిక నిరాహారదీక్ష సైతం చేశారు...

- ఇద్దరమ్మాయిలు తమ గ్రామాన్ని పరిశుభ్రమైన ఊరుగా మలిచారు. బహిర్భూమిరహితంగా, మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం ఉన్న గ్రామంగా తీర్చిదిద్దారు. వీటిని సాధించడం కోసంగా నిరవధిక నిరాహారదీక్ష సైతం చేశారు. వారే బెంగళూరులోని ఒకే గ్రామానికి చెందిన దీక్షిత, సించనాలు. వారి గురించిన మరిన్ని విశేషాలివి...
సించనా, దీక్షితలది బెంగళూరులోని రామనగర జిల్లాలోని నాగవర గ్రామం. స్వచ్ఛభారత్ మిషన్ స్ఫూర్తితో తొలిసారిగా ఈ జిల్లాలోనే టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) చేపట్టిన ఏబీసీడీ ప్రాజెక్టు ద్వారా టాయ్‌లెట్ల నిర్మాణం అక్కడ చేపట్టారు. టికెఎం ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను ప్రారంభించింది. టాయిలెట్లను ఎలా శుభ్రంగా ఉంచాలి, పారిశుద్ధ్య ప్రాధాన్యం గురించి కూడా టీచర్లు విద్యార్థులకు బోధించేవారు. ఇలా విద్యార్థులకు చెప్పడం ద్వారా రెండు ప్రయోజనాలు పొందారు. ఒకటి ఎప్పుడూ టాయ్‌లెట్లు శుభ్రంగా ఉంటున్నాయి. రెండోది కులరహిత సంస్కృతి గ్రామంలో వృద్ధి చెందుతోంది. టికెఎం సంస్థతో కలిసి ఆ ఊరిలోని స్నేహ అనే స్వచ్ఛంద సంస్థ కూడా పనిచేస్తోంది. అయితే ఆ ఊరిలో ప్రజలు ఎలాంటి వారంటే ఇంట్లో మరుగుదొడ్లు కట్టుకోవడం అపరిశుభ్రతకు చిహ్నంగా భావిస్తారు. అందుకే కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లను స్టోర్ రూములుగా సైతం కొందరు గ్రామస్థులు వాడుతున్నారు!
దీక్షిత, సించనా ఆ గ్రామంలోని తమ నాయనమ్మ దగ్గర ఉంటూ చదువుకుంటున్నారు. వారి ఇంట్లో మరుగుదొడ్డి లేదు. అలాగే దీక్షిత ఇంట్లో కూడా మరుగుదొడ్డి సౌకర్యం లేదు. సించినా, దీక్షిత ఇరువురు ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. టాయ్‌లెట్‌కి వెళ్లాలన్నప్పుడల్లా చాలామందిలా వీళ్లు కూడా ఆరుబయటకు వెళ్లాల్సి వచ్చేది. ఎప్పుడైతే బడిలోని టాయ్‌లెట్ల వినియోగం వీరికి అలవాటైందో వారి జీవితం, ఆలోచనల్లో సైతం పెనుమార్పు వచ్చింది. అలా ఇంట్లో వాళ్లను మరుగుదొడ్లు కట్టించాలంటూ దీక్షిత, సించనాలు ఎంతో పోరాడారు. అంత డబ్బు పెట్టి మరుగుదొడ్డి కట్టించలేమని ఇంట్లో వాళ్లు నిరాకరించారు. దాంతో ఈ విషయంపై పాఠశాలలో చర్చించారు. మాటల వల్ల మరుగుదొడ్ల నిర్మాణం సాధ్యం కాదని దీక్షిత నిరవధిక నిరాహారదీక్ష చేపట్టాలనే కఠిన నిర్ణయం తీసుకుంది. ఆడపిల్లగా తన ఆత్మగౌరవం కాపాడుకోవాలని దీక్షిత భావించింది. దీక్షితకు మద్దతుగా సించనా కూడా దీక్షకి సిద్ధమైంది. ఈ ఇద్దరమ్మాయిలకు మద్దతుగా ఐదు, ఏడు తరగతులు చదువుతున్న 30 మంది విద్యార్థినులు దీక్షిత, సించనా ఇళ్లల్లో మరుగుదొడ్డి కట్టించేవరకూ బడికి హాజరుకాబోమని పట్టుబట్టారు. టీచర్లు ఒక ముఖ్యమైన సామాజిక అంశంపై తమ విద్యార్థులు పోరాటం చేయడాన్ని గర్వంగా భావించారు. చివరకు దీక్షిత, సించనాల తల్లిదండ్రులు మరుగుదొడ్లు కట్టించడానికి సిద్ధమయ్యారు.
ప్రాజెక్టు ఏబీసీడీ 2015లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు వల్ల, దీక్షిత, సంచినా పోరాటం కారణంగా చాలామంది తమ ఇళ్లల్లో మరుగుదొడ్లు కట్టుకున్నారు ఈ ప్రాజెక్టు వల్ల మరో పెద్ద లాభాన్ని కూడా పొందాము. ఆడపిల్లలు మధ్యలోనే బడి మానేయడం బాగా తగ్గిపోయింది. బాలికలు కూడా నిరాటంకంగా తమ చదువు కొనసాగిస్తున్నారు. ఇంట్లో మరుగుదొడ్డి కట్టించాలనే లక్ష్యాన్ని సాధించిన దీక్షిత, సించనాలు తమ కెరీర్ మీద ఇప్పుడు దృష్టిపెడుతున్నారు.