300 చీరలిచ్చేసి భారం దించుకున్నా!
ABN , First Publish Date - 2020-12-06T06:09:25+05:30 IST
టీవీ యాంకర్‌గా.. వివిధ కార్యక్రమాల ప్రయోక్తగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ఝాన్సీ. కొవిడ్, లాక్‌డౌన్‌ల తాకిడిని తట్టుకొని మళ్లీ తన వృత్తి జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆమెను ‘నవ్య’ పలకరించింది...

టీవీ యాంకర్‌గా.. వివిధ కార్యక్రమాల ప్రయోక్తగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి ఝాన్సీ. కొవిడ్, లాక్‌డౌన్‌ల తాకిడిని తట్టుకొని మళ్లీ తన వృత్తి జీవితంలోకి ప్రవేశిస్తున్న ఆమెను ‘నవ్య’ పలకరించింది.
లాక్‌డౌన్ అనుభవాలేమిటి?
బాగా వేగంగా వెళ్తున్న ట్రైన్‌కు సడన్‌గా బ్రేక్ వేస్తే ఏమవుతుంది? కొవిడ్ ఎఫెక్ట్ కూడా అలాగే అనిపించింది. 2019లో ఇటు టీవీలో.. అటు సినిమాల్లోనూ మంచి అవకాశాలొచ్చాయి. అంతా సవ్యంగా జరుగుతోందనుకొనే సమయానికి కొవిడ్ దెబ్బ తగిలింది. దీని వల్ల కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నా! జీవితం పట్ల నాకున్న ధృక్పథం మారింది. అందుకు కారణాలు చెబుతాను. చాలా సందర్భాలలో మనకు అవసరమైన వస్తువుల కన్నా ఎక్కువ కొంటూ ఉంటాం. వాటిని దాస్తూ ఉంటాం. ఇవి బీరువాలలో మగ్గిపోవటం తప్ప మనకు చేకూరే విలువేమి ఉండదు. ఉదాహరణకు నా దగ్గర వందల చీరలు ఉండేవి. వాటిని ఎప్పుడో ఒకటి రెండు సార్లు కడతానేమో? అటువంటప్పుడు వాటిని నేను ఎందుకు దాచాలి? కొవిడ్ సమయంలో ఈ ఆలోచన వచ్చి నా దగ్గరున్న 300 చీరలు స్నేహితులకు.. సన్నిహితులకు.. సహచరులకు బహుమతిగా ఇచ్చేసా. కేవలం నాకు అత్యంత ప్రియమైనవాటిని.. నేను సొంతంగా నేయించుకున్న చీరలను మాత్రమే ఉంచుకున్నా! ఆ తర్వాత నా మనసెంతో తేలికపడింది. జపాన్‌కు చెందిన మేరీ కాండో అనే తత్త్వవేత్త ప్రతిపాదించిన ‘మినిమలిస్టిక్ ఫిలాసఫీ’ ఇది. దీనిని అనుసరించటం వల్ల మన జీవితంలో ఉండే అదనపు భారాలు తగ్గుతాయి. ఇక రెండోది- మా పిన్నిగారు మరణించడం. కొవిడ్ వ్యాప్తిస్తున్న సమయంలో మేము విపరీతమైన జాగ్రత్తలు తీసుకున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా మా నాన్నగారికి కరోనా వచ్చింది. తగ్గింది. ఎక్కడికి బయటకు కదలని పిన్నికి కూడా వచ్చింది. సమస్య తీవ్రమయి- ఆమె మరణించింది. అది నాకు చాలా పెద్ద షాక్! మనకు అత్యంత సన్నిహితమైనవారు.. ప్రతి రోజూ పలకరించేవారు.. హఠాత్తుగా కనబడకుండా పోతే కలిగే బాధ చాలా ఎక్కువ.
మీరు సినిమాల్లో మంచి పాత్రల్లోనే నటించారు. నటిగా మీకు అనుకున్నంత గుర్తింపు వచ్చిందని భావిస్తున్నారా?
నేను నటిగానే నా వృత్తి జీవితం ప్రారంభించా! ఆ తర్వాత యాంకర్‌గా మారా! ఆ తర్వాత ప్రయోక్తగా.. నాటక రచయితగా- ఇలా రకరకాల పాత్రలు పోషిస్తున్నా. ఈ అనుభవాలన్నీ నా పరిణతిని పెంచాయి. ఇక పాత్రల విషయానికి వస్తే- ‘మల్లేశం’లో తల్లి పాత్రకు ఒక విశిష్టత ఉంది. అదే విధంగా ‘సింహ’ సినిమాలో చేసిన కామెడీ పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని మంచి పాత్రలు లభించాయి. అయితే నాలో ఉన్న నటికి తగిన పాత్రలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఉదాహరణకు ‘కృష్ణ అండ్ లీలాస్’ డైరక్టర్ రవి- ‘నా సినిమాలో ఒక సింగిల్ మదర్ పాత్ర అనుకున్నప్పుడు మీరే గుర్తుకొచ్చారు.
మీ కోసమే ఈ పాత్ర పుట్టింది’ అన్నారు. ఇదే విధంగా ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాలో పాత్ర కూడా! ఇప్పటి దాకా నేను చేసిన పాత్రలన్నీ- నాకు భవిష్యత్తులో రాబోయే పాత్రలకు ఇన్వె్‌స్టమెంట్ అనుకుంటున్నా. అయితే కొవిడ్ వల్ల మంచి పాత్రలు కూడా పోగొట్టుకున్నా. దర్శకుడు క్రిష్ ‘కొండపాలెం’ నవలను సినిమాగా ఎక్కిస్తున్నారు. దానిలో నాకు ఒక మంచి పాత్ర లభించింది. 40 రోజుల పాటు యూనిట్ అంతా ఐసోలేషన్‌లో ఉండి షూటింగ్ చేయాలనుకున్నారు. అయితే షూటింగ్ ప్రారంభం కావటానికి నాలుగు రోజులు ముందు నాన్నగారికి కొవిడ్ వచ్చింది. దాంతో ఆ సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చింది. అయితే షూటింగ్ మొదలైన తర్వాత నాన్నగారికి కొవిడ్ వచ్చి ఉంటే.. అనే ఆలోచన వస్తేనే భయంగా ఉంటుంది.
మీ ఉద్దేశంలో కొవిడ్ ప్రభావం సినీ, టెలివిజన్ రంగాలపై ఎలా ఉంది?
నాకు తెలిసి- సినిమా, టెలివిజన్ రంగాలకు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. అందరూ విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారు. సాధారణంగా ‘ఒక సినిమా ప్లాప్ అయితే.. మరో సినిమా తీద్దాం’ అనే ధోరణిలో నిర్మాతలు.. ‘ఒక సినిమా హిట్ కాకపోతే మరో సినిమాలో చేద్దాం’ అనే విశ్వాసంతో నటీనటులు ఉంటారు. ‘అసలు సినిమానే లేకపోతే’ అనే పరిస్థితి ఇప్పటి దాకా ఎవరికీ ఎదురుకాలేదు. ప్రస్తుతం పరిస్థితులు నెమ్మదిగా కుదుటపడుతున్నాయి. షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి. కొవిడ్ వల్ల వచ్చిన మరో మార్పు- ఓటీటీలు. ఇవి టెలివిజన్, సినిమా రంగాలపై కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. నేను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఒక సిరీస్‌లో నటించా. అది డబ్బింగ్ దశలో ఉంది.
మీరు థియేటర్‌లో కూడా ప్రవేశించారు కదా.. కొత్త నాటికలేవైనా ప్రదర్శనకు సిద్ధం చేశారా?
2019లో ‘పురుషసూక్తం’ అనే నాటిక వేశాం. దీనిని చాలామంది మెచ్చుకున్నారు. దీనికి నిర్మాత, దర్శకురాలిని నేనే! స్త్రీ, పురుషులకు సంబంధించిన ఒక భిన్నమైన అంశాన్ని తీసుకొని విభిన్నంగా ప్రేక్షకులకు అందించటానికి ప్రయత్నించి విజయవంతమయ్యాం! ఇలాంటి మరో భిన్నమైన నాటిక ‘డిజైర్’. దీనిని ఈ ఏడాది మార్చిలో ప్రదర్శించాల్సింది. కానీ కొవిడ్ కారణంగా వాయిదా పడింది.
- భావన
