ప్రత్యామ్నాయంగా ఎదిగింది
ABN , First Publish Date - 2020-12-27T10:59:09+05:30 IST
థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, ఔట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్ వేదికలన్నీ కరోనా-లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. మళ్లీ ఎన్నాళ్లకు తెరుచుకుంటాయో తెలియని సందిగ్ధంలో పడిపోయింది తెలుగు చిత్ర పరిశ్రమ. షూటింగ్‌లు జరిగే అవకాశం కూడా లేకపోవడంతో టీవీ సీరియళ్ల ప్రసారాలు కూడా నిలిచిపోవడంతో డిజిటల్ మీడియా ఒక్కటే

- థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు, ఔట్‌డోర్ ఎంటర్‌టైన్‌మెంట్ వేదికలన్నీ కరోనా-లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. మళ్లీ ఎన్నాళ్లకు తెరుచుకుంటాయో తెలియని సందిగ్ధంలో పడిపోయింది తెలుగు చిత్ర పరిశ్రమ. షూటింగ్‌లు జరిగే అవకాశం కూడా లేకపోవడంతో టీవీ సీరియళ్ల ప్రసారాలు కూడా నిలిచిపోవడంతో డిజిటల్ మీడియా ఒక్కటే ఇంటిపట్టునే ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించే ఏకైక ప్రత్యామ్నాయంగా మిగిలింది.
అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ 5లాంటి ఓటీటీల ద్వారా పలు తెలుగు చిత్రాలు విడుదలయ్యాయి.
మార్చి మార్చింది
వినోద పరిశ్రమకు మొత్తంగా చేదు అనుభవాన్ని మిగిల్చినా...ఓటీటీ లకు మాత్రం ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. థియేటర్లు, టీవీల నీడ నుంచి ఓటీటీ వెలుగులోకి వచ్చింది. సమీప కాలంలో థియేటర్లను తెరిచే అవకాశం లేకపోవడంతో కోట్ల రూపాయల ఖర్చును తిరిగి రాబట్టుకునే ఏకైక మార్గంగా తెలుగు చిత్ర నిర్మాతలకు ఓటీటీ కనిపించింది.
ఏప్రిల్‌తో మొదలు
ఈ క్రమంలో తెలుగులో జీ 5 ఓటీటీలో లాక్‌డౌన్‌లో ఏప్రిల్ 29న విడుదలైన ‘అమృతారామమ్’ లాక్‌డౌన్ తర్వాత తొలిసారి ఓటీటీలో విడుదలైన చిత్రంగా నిలిచింది. మొదట చిన్న సినిమాలు మాత్రమే విడుదలైనా, క్రమంగా అగ్రహీరోలు నటించిన చిత్రాలు కూడా ఓటీటీలో విడుదలయ్యాయి. ఇక అక్కడ నుంచి తెలుగు చిత్రాలు ఒకదాని వెంట ఒకటి ఓటీటీ బాట పట్టాయి.
నిరాశపరిచిన మే
నవదీప్, పూజితా పొన్నాడ జంటగా నటించిన ‘రన్’ చిత్రం మే 29న ఆహా ఓటీటీలో విడుదలైంది. అయితే ఇవన్నీ చిన్న చిత్రాలే కావడంతో ప్రేక్షకులను ఓటీటీ వైపు ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జూన్‌లో తొలి హిట్
అగ్రకథానాయిక కీర్తిసురేశ్ నటించిన ‘పెంగ్విన్’ చిత్రం జూన్ 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. సినిమా ప్లాప్ అయినా ఓటీటీలో విడుదలైన పెద్ద చిత్రంగా ప్రేక్షకుల గుర్తింపు పొందింది. తెలుగులోనూ ఓ ఓటీటీ హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో జూన్ 25న వచ్చిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ చిత్రం ఆ లోటును తీర్చింది. ఆ తర్వాత ఈ చిత్రం ఆహా ఓటీటీలోనూ విడుదలైంది. ఆ నెలాఖరుకు జీ5లో వచ్చిన ‘47 డేస్’ చిత్రం నిరాశపరిచింది.
జులైలో జనంలోకి
జులై మూడున ఆహాలో విడుదలైన ‘భానుమతి రామకృష్ణ’ చిత్రం సక్సెస్‌తో పాటు ప్రేక్షకులు ఓటీటీల గురించి మాట్లాడుకునేలా చేసింది. ఆ నెలాఖరుకు నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం కూడా మంచి విజయాన్నే నమోదు చేసుకుంది. ‘మహేశింటే ప్రతీకారమ్’ మలయాళ చిత్రానికి ఇది తెలుగు రీమేక్.
ఆదరించని ఆగస్టు
ఆగస్టు నెలలో ఓటీటీ చిత్రాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. ‘జోహార్’ విమర్శకుల ప్రశంసలు పొందింది. ‘బుచ్చినాయుడు కండ్రిగ’ ఆకట్టుకోలేక పోయింది.
సెప్టెంబర్ డిజాస్టర్
ఇంక కనుచూపు మేర థియేటర్‌లు తెరుచుకునే అవకాశం కనిపించకపోవడంతో పెద్ద చిత్రాలు కూడా ఓటీటీ బాట పట్టడం ఈ నెల్లో వచ్చిన ‘వి’ చిత్రంతో మొదలైంది. అమెజాన్‌ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న విడుదలైంది. నానీ, సుధీర్ బాబు నటించిన మల్టీస్టారర్ మూవీ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఆహాలో విడుదలైన ‘అమరం అఖిలం ప్రేమ’ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
నవంబర్ నంబర్ వన్
నవంబర్ నెల్లో ఏకంగా ఐదు తెలుగు చిత్రాలు ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఆహాలో వచ్చిన ‘అనగనగా ఓ అతిథి’, అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ హిట్ అయ్యాయి. ‘మా వింత గాథ వినుమా’, ‘గతం’ యావరేజ్ అనిపించుకున్నాయి. ‘గతం’ చిత్రం పనోరమా అవార్డ్‌ను గెలుచుకుంది. జీ 5లో విడుదలైన ‘మేకసూరి 2’ ప్లాపయింది.
డిసెంబర్ బ్యాక్ టూ థియేటర్స్
ఓటీటీ విడుదలకు డిసెంబర్ నెలలోనే తొలి బ్రేకు పడింది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ లాంటి పెద్ద చిత్రం తొలుత ఓటీటీలో విడుదల చేయాలనుకున్నా క్రిస్మస్ సందర్భంగా థియేటర్లలో విడుదల చేశారు. ఈ నెల్లోనే అమెజాన్‌లో విడుదలైన ‘బొంబాట్’, ‘ఐఐటీ కృష్ణమూర్తి’, ‘గువ్వ గోరింక’ చిత్రాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ‘డర్టీ హరి’ చిత్రంలో అశ్లీల కంటెంట్ ఉందనే ప్రచారం జరిగినా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.
టాప్ ఓటీటీ హిట్స్
ఆకాశమే నీ హద్దురా
కృష్ణ అండ్ హిజ్ లీలా
కలర్‌ఫొటో
మిడిల్ క్లాస్ మెలోడీస్
గతం
ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
భానుమతి రామకృష్ణ
టాప్ ఓటీటీ ప్లాప్స్
నిశ ్శబ్దం
వి
మిస్ ఇండియా
పెంగ్విన్
మా వింత గాథ వినుమా
ఓ పిట్ట కథ
దర్శకుల ఓటీటీ బాట
ఓటీటీల కోసం ప్రత్యేకంగా పలువురు దర్శకులు చిత్రాలను డైరెక్ట్ చేస్తున్నారు. కొందరు దర్శకులు కథ, కథా సహకారం అందిచడంతో పాటు నిర్మాతలుగా మారారు. దేవ్‌కట్టా యప్ టీవీ కోసం ‘ఎందుకిలా’ అనే వెబ్‌సిరీస్ చేశారు. నందినీ రెడ్డి 2018లో ‘గ్యాంగ్‌స్టార్స్’ అనే వెబ్‌సిరీస్ రూపొందించారు. వేణు ఉడుగుల చలం మైదానం నవలను వెబ్ సిరీస్‌గా చేస్తున్నారు. సుకుమార్, వంశీ పైడిపల్లి, సురేంద్రరెడ్డి వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. దర్శకులు క్రిష్ ఆహా కోసం ‘మస్తీస్’ అనే వెబ్‌సిరీస్ చేశారు. తేజ ‘ష్...టోరీస్’, సుధీర్‌వర్మ ఓథ్రిల్లర్ వెబ్‌సిరీస్ తీస్తున్నారు. ‘లస్ట్ స్టోరీస్’ తెలుగు రీమేక్‌కు నందినీరెడ్డి, సంకల్ప్‌రెడ్డి, నాగ అశ్విన్, తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తారని టాక్. ‘పలాస 1978’ దర్శకుడు కరుణకుమార్ ‘మెట్రోకథలు’ వెబ్‌ఫిల్మ్ తీశారు.
తిరిగి థియేటర్లలో విడుదల
ఓటీటీలో విడుదలైన చిత్రాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం అక్టోబర్‌లో ఆహా ఓటీటీలో విడుదలైంది. జనవరి 1న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఆహా ఓటీటీలోనే విడుదలై హిట్‌గా నిలిచిన ‘కలర్‌ఫొటో’ చిత్రాన్ని కూడా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నానీ, సుధీర్‌బాబు హీరోలుగా వచ్చిన ‘వి’ చిత్రం ప్లాప్ అయినా నాని పాపులారిటీ దృష్ట్యా థియేటర్లలోనూ విడుదలకు సిద్ధమవుతున్నారు.
ఓటీటీకి హీరోయిన్లు సై
వెండితెర స్టార్‌డమ్‌ను పక్కనపెట్టి మరీ హీరోయిన్లు ప్రయోగాలు చేస్తున్నారు. ‘లస్ట్‌స్టోరీస్’లో కియారా అడ్వాణీ, భూమిఫెడ్నేకర్, రాధికాఆప్టే, మనీషా కోయిరాలా బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. హిందీలో ‘పాయిజన్ 2’లో రాయ్ లక్ష్మీ, ‘రిజెక్ట్ ఎక్స్ 2’లో ఈషా గుప్తా నటించారు. వీరుకాక శోభితా దూళిపాళ, కల్కి కొచ్చిన్, సుస్మితాసేన్, స్వరాభాస్కర్ వెబ్‌సిరీస్‌లు చేస్తున్నారు. తెలుగులో పాయల్ రాజ్‌పుత్ ‘అనగనగా ఓ అతిథి’తో వెబ్‌చిత్రం చేశారు. ‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’తో చాందినీ చౌదరి ఆకట్టుకున్నారు.
తేజస్వీ మదివాడ ‘మన ముగ్గిరి లవ్‌స్టోరీ’లో నటించారు. తర్వాత ‘గ్యాంగ్‌స్టార్స్’లో శ్వేతాబసుప్రసాద్ నటించారు. తాజాగా సమంత ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో నటించారు. తమన్నా ‘లెవెన్త్ హవర్’ అనే వెబ్‌సిరీస్ చేస్తుంది. అక్కినేని అమల ‘హై ప్రీస్టెస్’లో నటించారు. ‘బ్రీత్ ఇన్ టూది షాడోస్’తో నిత్యామీనన్, ‘క్వీన్’ సిరీస్‌లో రమ్యకృష్ణ, తెలుగు ‘లస్ట్‌స్టోరీస్’లో ఈషా రెబ్బా ఓటీటీలో అడుగుపెట్టారు. సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో హెబ్బాపటేల్, బిందుమాధవి, దీప్తీ సతి, శ్వేతా బసు ప్రసాద్, మంజరీ ఫడ్నీస్, ప్రియా బెనర్జీ వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు.
ఓటీటీ స్పెషల్

అక్టోబర్ యావరేజ్
ఈ నెల్లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం ‘నిశ్శబ్దం’ ఓటీటీల్లో పెద్ద ప్లాప్‌గా నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం అనుష్కకు నిరాశను మిగిల్చింది. అదే నెల్లో ఆహాలో వచ్చిన ‘ఓరేయ్ బుజ్జిగా’ ఫరవాలేదనిపించుకోగా చివరి వారంలో వచ్చిన ‘కలర్‌ఫొటో’ ప్రేక్షకులకు గుర్తుండిపోయే హిట్ మూవీగా నిలిచింది.
