ముగ్గురు గురువులు!

ABN , First Publish Date - 2020-07-10T05:30:00+05:30 IST

కొందరికి గడుస్తున్న క్షణంలో తక్షణం మనుగడ నిలబెట్టుకోవడం మాత్రమే లక్ష్యం. మరికొందరికి మాత్రం - లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసిన తరువాత, మారే పరిస్థితుల్లో అనిశ్చితిని ఎదుర్కొంటూ...

ముగ్గురు గురువులు!

కొందరికి గడుస్తున్న క్షణంలో తక్షణం మనుగడ నిలబెట్టుకోవడం మాత్రమే లక్ష్యం. మరికొందరికి మాత్రం - లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసిన తరువాత, మారే పరిస్థితుల్లో అనిశ్చితిని ఎదుర్కొంటూ, బతకడానికి కొత్త పద్ధతులు వెతుక్కుంటూ, సవాళ్ళకు ఎదురెళ్ళడం ధ్యేయం. కరోనా మహమ్మారి అనూహ్యంగా ఒక ఉమ్మడి సవాలును ప్రపంచానికి విసిరింది. అందరినీ గడగడలాడిస్తోంది. మనిషి జీవితం ఎంత సున్నితమో, బుద్బుదప్రాయమో గుర్తు చేసే కఠోర వాస్తవం. మన పరిస్థితులు మన జీవితాలను నిర్వచించలేవు. కాబట్టి ఈ విపత్తును జీవితంలో పాఠం నేర్చుకొనే ఒక అవకాశంగా మనం చూడాలి. భౌతికంగా గురువుల నుంచి మనం నేర్చుకోవడం ఇప్పుడు సాధ్యం కాదు. కనుక గురువుల్లాంటి మూడు అంశాల నుంచి మనం విశిష్టమైన పాఠాలు నేర్చుకోవాలి.


ఈ విపత్కర పరిస్థితి  మనకు మంచి  అవకాశాన్ని ఎలా అందిస్తోందో గమనించండి. ప్రేమ, సంరక్షణ, ఉదారత  ప్రపంచంలో ఎంతగా వెల్లివిరుస్తున్నాయో చూడండి. డబ్బూ, ఆహారం, సమయం, శ్రద్ధ, ఆలోచనలు, దయ... ఇలా కృతజ్ఞతను చెల్లించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అవి అవసరమైన వారికి అందిస్తే చాలామంది జీవితాలు మెరుగుపడతాయి.


మొదటి గురువు -  ప్రకృతి: ‘విశ్వాన్నంతటినీ నియత్రించగలం’ అనే అహంకారం మనది. కానీ ప్రాకృతిక ప్రపంచంలో, గ్రహసంబంధమైన జీవ్యావరణ వ్యవస్థలో మనం కూడా భాగమనే సంగతి మరచిపోయాం. ఈ జీవ్యావరణ వ్యవస్థలో సమతుల్యతను కొనసాగించడం కోసం చీమల నుంచి అనకొండల వరకూ, గబ్బిలాల నుంచి ఎలుగుబంట్ల వరకూ ప్రతిదీ కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. జంతువులతో, పర్యావరణంతో మనకు ఉన్న సంబంధాలను మనం ఇక ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యలేం. శాంతియుత సహజీవనం గురించీ, సర్వ జీవరాశులనూ గౌరవించాల్సిన ఆవశ్యకత గురించీ ప్రకృతి మనకు అద్భుతమైన పాఠాలు చెబుతోంది.

రెండో గురువు - అనిశ్చితి: మనకు తెలియనిదీ, మనకు చాలాకాలం గ్రహింపులోకి రానిదీ చాలా ఉంది. అనిశ్చితి ప్రతిచోటా ఉంది.. ఫలితాలపై మనకు నియంత్రణ లేదు. దీనివల్ల మనలో అప్రయత్నంగా కలిగే స్పందన ఏంటంటే... గతాన్ని తలచుకోవడం లేదా భవిష్యత్తు ఏమవుతుందో అని బెంగపడడం! బహుశా కరోనా సంక్షోభం మోసుకొచ్చిన ఈ అనిశ్చితి... మనం వర్తమానంతో అర్థవంతమైన సంబంధాన్ని పెంపొందించుకొనే ఒక అవకాశం కావచ్చు. అవగాహన, సర్దుబాటు ధోరణి, కష్టాలను ఎదుర్కొనే సహనం పెంచుకుంటే మన శక్తిని నాశనం చేసే ప్రవర్తనా ధోరణుల్ని వదిలించుకోగలుగుతాం.

మూడో గురువు - కృతజ్ఞత: ‘‘మన చుట్టూ ఎంతోమంది చావులకు గురవుతున్నప్పుడూ, వ్యాధితో బాధపడుతున్నప్పుడూ, కృతజ్ఞత గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉందా?’’ అనే ప్రశ్న మీరు అడగవచ్చు. ‘కృతజ్ఞత’ అనేది ఒక సాధికారమైన భావోద్వేగం. కృతజ్ఞతలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, కృతజ్ఞతాభావం మీలో ఉన్నప్పుడు ‘భయం’ అనే ఉద్వేగానికి చోటుండదు. ఈ రెండు భావాలూ ఒకేచోట మనలేవు. ఆత్రుత, బెంగ, నిస్పృహ, అనిశ్చితి... వీటన్నిటికీ విరుగుడు - కృతజ్ఞత. అది మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో రోగనిరోధక శక్తిని కోరుకోని వాళ్ళెవరుంటారు!

-అంజలీ హజారికా


Updated Date - 2020-07-10T05:30:00+05:30 IST