నీకు మైనింగ్‌ ఎందుకన్నారు..!

ABN , First Publish Date - 2020-11-07T05:30:00+05:30 IST

భూగర్భ గనుల్లో ఉద్యోగమంటే క్షణక్షణం భయం... ప్రాణాలతో చెలగాటం. మగవారే వెనకడుగు వేసే ఈ రంగంలోకి ఓ యువతి కోరి మరీ వచ్చింది

నీకు మైనింగ్‌ ఎందుకన్నారు..!

భూగర్భ గనుల్లో ఉద్యోగమంటే క్షణక్షణం భయం... ప్రాణాలతో చెలగాటం. మగవారే వెనకడుగు వేసే ఈ రంగంలోకి ఓ యువతి కోరి మరీ వచ్చింది. సన్నిహితులు, శ్రేయోభిలాషులు వద్దని వారించినా సవాలుగా స్వీకరించి... అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌లో దేశంలోనే తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఉదయ్‌పూర్‌లోని ‘హిందుస్థాన్‌ జింక్‌ కంపెనీ’లో డ్రిల్లింగ్‌ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంధ్య సాహసోపేత నిర్ణయం వెనుక స్ఫూర్తి ప్రదాతలు ఎవరు? అసలెందుకు ఆమె ఇటువైపు వచ్చారు? ఆమె మాటల్లోనే... 


మైనింగ్‌తో నా అనుబంధం ఇవాళ్టిది కాదు. నాన్న రఘు సింగరేణి గనుల్లో కన్వేయర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు తరచూ బొగ్గు గనులకు వెళ్లేదాన్ని. శ్రామికుల కష్టం ప్రత్యక్షంగా చూసినదాన్ని. ఆ వృత్తిలోని సాధకబాధకాలేమిటో చిన్నప్పుడే తెలుసుకున్నాను. నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు ‘మైనింగ్‌ అంటే సామాన్యమైనది కాదు. ఎంతో శ్రమ, ప్రమాదం’ అని. అయినా నాకెందుకో ధ్యాసంతా దానిపైనే ఉండేది. 


కోరి ఎంచుకున్నా... 

మా సొంత ఊరు భూపాలపల్లిలో పదో తరగతి వరకు చదివాను. ఆ తరువాత ఇంటర్‌ హైదరాబాద్‌లో. నేను ఏం చదవాలో... నాకు ఏం కావాలో ఆ సమయంలోనే ఒక స్పష్టతకు వచ్చేశాను. అందుకే ఇంజనీరింగ్‌ ర్యాంక్‌ వస్తే... కోరి మరీ మైనింగ్‌ తీసుకున్నాను. కొత్తగూడెం కేఎస్‌ఎం కాలేజీలో చేరాను. తరువాత ఎంటెక్‌ చేయాలనుకున్నాను. 2018లో గేట్‌లో ర్యాంకు వచ్చింది. కానీ అప్పటికే నాకు క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఉద్యోగం ఖాయమైంది. 


ఎనిమిది మందిలో ఇద్దరమే మిగిలాం...  

మైనింగ్‌ కోర్సులో 2013కు ముందు వరకూ అమ్మాయిలకు అవకాశం లేదు. పైగా ఈ కోర్సు అందించే కాలేజీలు దేశంలో రెండే ఉన్నాయి. ఒకటి జార్ఖండ్‌లోని ఐఎస్‌ఎం కాలేజీ. రెండోది నేను చదివిన కొత్తగూడెంలోని కేఎస్‌ఎం కళాశాల. నాతోపాటు ఎనిమిది మంది అమ్మాయిలు మాత్రమే మైనింగ్‌ కోర్సు ఎంచుకున్నారు. అందులో ఏడుగురం మాత్రమే కాలేజీలో చేరాం. తరువాత ఇద్దరు వేరే గ్రూప్‌కు వెళ్లిపోయారు. ముగ్గురికి పెళ్లి కావడంతో మధ్యలోనే వదిలేశారు. చివరకు కోర్సు పూర్తి చేసింది ఇద్దరమే. 


రీసెర్చర్‌గా మొదలు... 

కళాశాలలో నిర్వహించిన క్యాంపస్‌ ఇంటర్వ్యూలో ఎంపికయ్యాను. నాకు రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ‘హిందుస్థాన్‌ జింక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’లో రీసెర్చర్‌గా ఉద్యోగం లభించింది. ఏడాదిపాటు మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా పనిచేశాను. అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌లో ఏడాది అనుభవం తరువాత ‘డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ మైనింగ్‌ సేఫ్టీ’ (డీజీఎంఎస్‌)కు దరఖాస్తు చేసుకున్నా. నా పని తీరు పరిశీలించిన డీజీఎంఎస్‌ అధికారులు అండర్‌గ్రౌండ్‌ సెకండ్‌ క్లాస్‌ మైన్‌ మేనేజ్‌మెంట్‌ కాంపీటెన్సీ సర్టిఫికెట్‌ ఇచ్చారు. దేశంలో ఈ సర్టిఫికెట్‌ పొందిన తొలి మహిళను నేనే. దీనివల్ల భూగర్భ గనులతో పాటు ఓపెన్‌కాస్ట్‌ల్లో కూడా పనిచేసే అవకాశం లభిస్తుంది. 


నేనొక్కదాన్నే... 

చాలామంది మేనేజ్‌మెంట్‌ ట్రైనీ తరువాత రీసెర్చ్‌ వైపు వెళతారు. కానీ నేను మాత్రం భూగర్భ గనుల్లోనే పని చేయాలన్న పట్టుదలతో ఇటువైపు వచ్చాను. అలా ప్రస్తుతం అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ప్రొడక్షన్‌ డ్రిల్లింగ్‌ ఇన్‌చార్జిగా విధులు నిర్వర్తిస్తున్నాను. దేశంలోనే ఈ ఉద్యోగం చేస్తున్న తొలి మహిళను నేనే అనే విషయం తలుచుకున్నప్పుడల్లా ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంటుంది. 


వద్దన్నవారే అభినందిస్తున్నారు... 

‘నేను మైనింగ్‌ కోర్సు తీసుకొంటాను’ అన్నప్పుడు అంతా వద్దన్నారు. ‘ఆడపిల్లవి. నీకు మైనింగ్‌ ఎందుకు? సాఫ్ట్‌వేర్‌ కోర్సులేవో చేసుకోవచ్చు కదా’ అని సలహాలిచ్చారు. ఇదే మాట మా అమ్మానాన్నలకు కూడా చెప్పారు. కొందరు ఎగతాళి చేశారు. ‘గని లోపలికి వెళ్లి పని చేయడం ఆడపిల్లలకు సాధ్యమవుతుందా’ అంటూ ప్రశ్నించారు. ఆ మాటలకు చాలా బాధ పడ్డాను. అయితే మైనింగ్‌ చేయాలనే నా లక్ష్యానికి అమ్మ తులసి, మామయ్య మద్దతునిచ్చారు. ‘నా బిడ్డను మైనింగ్‌ చదివిస్తాం’ అని వద్దన్న వారందరికీ మా పేరెంట్స్‌  గట్టిగా బదులిచ్చారు. ఇప్పుడు నా కలను నిజం చేసుకున్న తరువాత ఒకప్పుడు ప్రశ్నించి, అవహేళనగా మాట్లాడినవారే అభినందిస్తున్నారు. 
నాన్న కష్టం ఇప్పుడు తెలుస్తోంది... 

డ్యూటీకి వెళ్లి వచ్చినప్పుడల్లా నాన్న అలసిపోయి కనిపించేవారు. నేను, తమ్ముడు అల్లరి చేస్తుంటే... ‘ఆపండిరా... అలసిపోయాను. నిద్ర వస్తుంది’ అనేవారు. ఆయన కష్టం ఏమిటో చిన్నప్పుడు మాకు తెలిసేది కాదు. మేము ఆడుకొంటుంటే నాన్న విసుక్కొంటున్నారు అనుకొనేవాళ్లం. కానీ, ఆయన కష్టం విలువేమిటో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. నేను డ్యూటీకి వెళ్లినప్పుడల్లా నాన్నే గుర్తుకు వస్తారు. 


ఇక్కడా అవకాశాలివ్వాలి... 

నేను కొత్తగూడెంలో చదువుకొని ఎక్కడో రాజస్థాన్‌లో పనిచేయాల్సి వస్తోంది. అలా కాకుండా ఇక్కడ చదువుకున్న అమ్మాయిలకు ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది. ఇదే విషయాన్ని ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసినప్పుడు చెప్పాను. ఆమె తప్పకుండా ప్రయత్నం చేస్తానన్నారు. 

ఒక్కటి మాత్రం చెప్పగలను... ఆడవారు ఎందులోనూ మగవారికి తక్కువ కాదని! ‘నేను చేయగలనా’ అనే సందేహం కూడా అమ్మాయిలకు ఉండకూడదు. అనుకున్న లక్ష్యం కోసం పట్టుదలగా ముందడుగు వేయాలి. ప్రస్తుం నా లక్ష్యం... మేనేజర్‌ స్థాయిగా ఎదగడం. అది నెరవేరే వరకు విశ్రమించను. 


- తడుక రాజనారాయణ, 

భూపాలపల్లి 


Updated Date - 2020-11-07T05:30:00+05:30 IST