ఇప్పుడామె అందరి దోస్త్‌!

ABN , First Publish Date - 2020-08-19T05:30:00+05:30 IST

పెళ్ళయిన అయిదేళ్ళకే భర్తను కోల్పోయిన ఆమె ఇల్లు గడపడానికి ఎన్నో అగచాట్లు పడ్డారు. ఇప్పుడు ఇళ్ళ దగ్గరే బ్యాంకింగ్‌ సేవలను అందిస్తూ, స్వావలంబన సాధించారు...

ఇప్పుడామె అందరి దోస్త్‌!

పెళ్ళయిన అయిదేళ్ళకే భర్తను కోల్పోయిన ఆమె ఇల్లు గడపడానికి ఎన్నో అగచాట్లు పడ్డారు. ఇప్పుడు ఇళ్ళ దగ్గరే బ్యాంకింగ్‌ సేవలను అందిస్తూ, స్వావలంబన సాధించారు. దేశంలో తొలి ‘ఇ-దోస్త్‌’ అంజలీ వజరీ విజయగాథ ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తోంది. 


‘‘ఏడాది కిందట నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలనే భయం నన్ను వెంటాడుతూ ఉండేది. ఇప్పుడు ఆ భయం పోయింది’’ అంటారు ఇరవయ్యేడేళ్ళ అంజలీ వజరే. ఆమెది మహారాష్ట్రలోని  పథర్థీ గ్రామం. మెట్రిక్‌లేషన్‌ వరకూ చదివారు. సామాన్య కుటుంబానికి చెందిన అంజలికి చిన్న వయసులోనే వివాహం అయింది. పెళ్ళయిన అయిదేళ్ళకే భర్త మరణించాడు. నాలుగేళ్ల కొడుకు, వయోధికులైన తల్లితండ్రులకు అంజలే దిక్కయ్యారు. ఆమెకు తెలిసింది వ్యవసాయ పనులు చేయడం మాత్రమే. ‘‘అయితే ఎప్పుడు పని ఉంటుందో తెలీదు. కుటుంబం గడపడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింద’’ని ఆ రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు.


ఈ దశలో అనుకోకుండా ఎదురైన ఒక అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకున్నారు. సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం (ఐవిడిపి)లో భాగంగా మారుమూల గిరిజన గ్రామాలకు డిజిటల్‌ సేవలు అందించడం కోసం కొన్ని కార్పొరేట్‌, స్వచ్ఛంద సంస్థలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్‌ చేపట్టింది. దానికోసం ప్రయోగాత్మకంగా జవహర్‌ బ్లాక్‌లోని పథర్థీ గ్రామాన్ని ఎంచుకుంది. ఆ గ్రామ ప్రజలు ఎలాంటి బ్యాంక్‌ సేవలు పొందాలన్నా అటవీ ప్రాంతాలను దాటుకొని పదిహేను కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. సుమారు నలభై రూపాయలు ఖర్చు. బ్యాంకుల దగ్గర క్యూలలో నిలబడి, పని పూర్తి చేసుకొని తిరిగి రావడానికి కనీసం ఆరేడు గంటల సమయం పడుతుంది. వారికి ఇంటి ముంగిటే బ్యాంకింగ్‌ సేవలు అందించడానికి ‘ఇ-దో్‌స్త’లను నియమించాలన్నది ఈ ప్రాజెక్ట్‌ ఉద్దేశ్యం. దానికి అంజలి ఎంపికయ్యారు. శిక్షణ పూర్తయిన వెంటనే ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ(ఎఇపిఎ్‌స)లో తొలి ‘ఇ-దో్‌స్త’గా బాధ్యతలు తీసుకున్నారు.


తెల్లవారుజామునే లేచి, ఇంటి పనులు ముగించుకొని, ఉదయం ఆరు గంటలకల్లా గ్రామంలోకి అంజలి బయలుదేరుతారు. నగదు డిపాజిట్లు, విత్‌ డ్రాయల్స్‌, బిల్లు చెల్లింపుల్లాంటి లావాదేవీలను తొమ్మిది గంటల వరకూ నిర్వహిస్తారు. తరువాత బ్యాంక్‌కు వెళ్ళి, వివరాలను అందజేస్తారు. మరుసటి రోజు లావాదేవీల కోసం నగదు తీసుకుంటారు. ‘‘నా విధులు నిర్వహించడానికి స్మార్ట్‌ ఫోన్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ తీసుకువెళ్తాను. ఆధార్‌ ద్వారా వినియోగదారుల వివరాలు నిర్ధారించుకొని, సేవలు అందిస్తాను. నగదు లావాదేవీలు మాత్రమే కాదు, మొబైల్‌ ఫోన్ల రీఛార్జి, బిల్లుల చెల్లింపు, దేశీయంగా నగదు బదిలీ లాంటి సేవలు కూడా అందజేస్తూ ఉంటాను’’ అని చెప్పారామె. కిందటి ఏడాది జూన్‌లో ఈ ఉద్యోగంలో చేరిన అంజలి సుమారు 800 మందికి సేవలు అందిస్తున్నారు. ఆమెకు అయిదు వేల వేతనం, సేవలపై కమీషన్‌ అందుతాయి. ఇప్పటి వరకూ దాదాపు నలభై లక్షల రూపాయల లావాదేవీలు ఆమె జరిపారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి నెలకు రూ. అయిదు లక్షలకు పైగా లావాదేవీలు నిర్వహించానన్నారామె. ‘‘డబ్బుతో ప్రమేయం ఉన్న పని కాబట్టి ప్రారంభంలో కాస్త సందేహించాను. అలాగే మా ప్రాంతంలో నెట్‌వర్క్‌ కనెక్టివిటీ కూడా సరిగ్గా ఉండదు. ఇది ఇప్పటికీ సమస్యే. కానీ అలవాటు పడిపోయాను’’ అన్నారు అంజలి.


‘‘మొదట్లో గ్రామస్థులు నన్ను పట్టించుకొనేవారు కాదు. ఎక్కడికీ వెళ్ళాల్సిన పని ఇంటి దగ్గరకే బ్యాంకింగ్‌ సేవలు అందితే ఎంత సౌకర్యంగా ఉంటుందో అందరికీ వివరించి చెప్పాను. పొదుపు లాంటి విషయాల గురించి గ్రామంలోని మహిళలకు తరచూ చెబుతూ ఉంటాను’’ అన్నారామె.

గ్రామంలో ఇప్పుడు అందరూ ఆమెను గౌరవంగా చూస్తున్నారు. కరోనా కాలంలో ఆమె గుర్తింపు మరింత పెరిగింది. ఆర్థిక విషయాల్లో సందేహాలుంటే అడిగిలుసుకుంటున్నారు. అంజలి విజయగాథ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ఈ ఏడాది చివరకల్లా దేశంలో కనీసం వందమందికి శిక్షణనిచ్చి ‘ఇ-దో్‌స్త’లుగా తయారు చెయ్యాలని బిఐఎ్‌సఎల్‌డి ప్రణాళికలు వేస్తోంది. 






ఒకప్పుడు నా దగ్గర వంద రూపాయలు ఉంటే గొప్ప. ప్రస్తుతం గ్రామం మొత్తం కోసం లక్షల రూపాయల లావాదేవీలు చేస్తున్నా. గ్రామంలో తిరగడానికీ, బ్యాంకుకు వెళ్ళడానికీ ద్విచక్ర వాహనం కొనుక్కున్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించాను.

Updated Date - 2020-08-19T05:30:00+05:30 IST