ఆకలి తీర్చే అన్నపూర్ణ...
ABN , First Publish Date - 2020-12-28T05:50:01+05:30 IST
ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగిన ప్రతిసారీ ఆమె గళమెత్తుతారు. న్యాయం పక్షాన నినదిస్తారు. ఇంట, బయట హింసను ఎదుర్కొనే బాధితురాళ్లకు బాసటగా నిలుస్తారు...

ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగిన ప్రతిసారీ ఆమె గళమెత్తుతారు. న్యాయం పక్షాన నినదిస్తారు. ఇంట, బయట హింసను ఎదుర్కొనే బాధితురాళ్లకు బాసటగా నిలుస్తారు. ఆపదవేళ సాటి మనిషికి సాయం చేసేందుకు ముందుకొస్తారు. అలా లాక్‌డౌన్‌లో కొన్నివందల మంది నిరుపేదల ఆకలితీర్చారు. హైదరాబాద్‌ని వరదలు ముంచెత్తినప్పుడు నాలుగు వేల కుటుంబాలకు సాయమందించారు. ‘‘అన్నం తింటున్న ప్రతి ఒక్కరూ, అన్నదాతకు అండగా నిలవాలి’’ అనే సంకల్పంతో ఢిల్లీలోని సింఘు సరిహద్దుకెళ్లి రైతు ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఆమే అమూమత్ సొసైటీ ప్రధాన కార్యదర్శి ఖలీదా పర్వీన్. ఆమె నవ్యతో ముచ్చటించారు.
‘‘నీ తల్లిపాదాల కిందే స్వర్గముంద’’ని దివ్య ఖురాన్ బోధిస్తుంది. ఆడవాళ్ల పట్ల అణకువగా మసులుకోమనీ చెబుతుంది. అందుకు విరుద్ధంగా మహిళలపై అణచివేత, ఆంక్షలు పెచ్చుమీరాయి. ఇస్లాం ప్రకారం వరకట్నం తీసుకోవడం నిషిద్ధం. వరుడే వధువుకి మెహర్(కన్యాశుల్కం) చెల్లించాలి. కానీ అమ్మాయి తెల్లగా అందంగా ఉండాలి. బాగా చదువుకోనుండాలి. సంప్రదాయబద్ధంగా నడుచుకోవాలి. ఆస్తిపరురాలవ్వాలి వంటి డిమాండ్స్ అబ్బాయిల వైపు నుంచి బాగా పెరిగాయి. దాంతో ముస్లిం కుటుంబాల్లోనూ కట్న, కానుకల కోసం భార్యను వేధిస్తున్న కేసులు ఈ మధ్య ఎక్కువయ్యాయి. రోజుకి ఆరునుంచి పది మంది బాధితురాళ్లు మమ్మల్ని ఆశ్రయిస్తుంటారు. అందులో తొంభై శాతం మహిళలు భర్త, అత్తమామల చేతిలో వేధింపులు ఎదుర్కొంటున్నవాళ్లే. బాగా చదువుకొన్న ఒక అబ్బాయి, తాను పెళ్లికి పనికిరానని తెలిసి కూడా పీజీ చదివిన అమ్మాయిని పెళ్లాడాడు. తర్వాత విషయం తెలిసినా అమ్మాయి సహించి, భర్తతోనే జీవితాంతం కలిసుండాలని కోరుకుంది. కానీ అతను మాత్రం అనుమానంతో నిత్యం ఆమెను మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. ఏడాదిన్నర గడిచాక, ఆ సంగతి గ్రహించిన అమ్మాయి పుట్టింటోళ్లు, ఒంటి నిండా దెబ్బలతో ఉన్న తనను ఒకరోజు మా కౌన్సెలింగ్ సెంటర్‌కి తీసుకొచ్చారు. సరే! తర్వాత చట్టప్రకారం అతనికి తగిన శిక్షపడేలా చూశాం. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ జంట విడాకులూ తీసుకున్నారు. కానీ బాగా చదువుకొన్న అమ్మాయిలు సైతం హింసను సహించడం బాధాకరం. ఆలు,మగ లు విడిపోవాలనుకుంటే...తలాక్ చెప్పే అవకాశం మగాళ్లకెలా ఉందో, ఖులా చెప్పే హక్కునూ ఆడవాళ్లకు ఇస్లాం న్యాయశాస్త్రం కల్పించింది. అయితే, బాకీపడ్డ మెహర్‌ను చెల్లించకుండా ఉండేందుకు విడాకులు పొందాలనుకొనే కొందరు భర్తలు, ‘ఖులా’ చెప్పాలని భార్యలను బాధిస్తున్న కేసులు మా దృష్టికొస్తుంటాయి. అలాంటి సమయంలో ముస్లిం పర్సనల్ లా ప్రకారమేగాక, అవసరాన్ని బట్టి ఐపీసీ చట్టాలనూ ఆశ్రయిస్తున్నాం. ఇక చిన్నచిన్న అపార్థాలతో సంసారాన్ని పాడుచేసుకునే జంటలూ తారసపడుతుంటాయి. వాళ్లను తిరిగి ఒక్కటి చేసేందుకు ప్రయత్నిస్తుంటాం. అందుకు మా వద్ద ఎనిమిది మంది ఫ్యామిలీ కౌన్సెలర్లు నిరంతరం అందుబాటులో ఉంటారు. ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ సేవల్నీ మొదలుపెట్టాం.
అమ్మ ప్రేమతో...
మహిళా సాధికారతతోనే దేశం ముందుకెళుతుందని నా ప్రగాఢ విశ్వాసం. అందుకే కొందరు మహిళలతో కలిసి పదేళ్ల కిందట ‘అమూమత్ సొసైటీ’ నెలకొల్పాం. అమూమత్ అంటే ‘అమ్మలు’ అనర్థం. కష్టంలో ఉన్న ఆడవాళ్లను అమ్మలా అక్కున చేర్చుకొని, ఆదరించాలనేదే మా సంస్థ ప్రధాన ఉద్దేశం. ఆడవాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు రకరకాల కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా బస్తీల్లో బడికి దూరమైన 18ఏళ్ల లోపు అమ్మాయిలను గుర్తించి, ఓపెన్ స్కూలు ద్వారా వాళ్లను మళ్లీ చదువుకు దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు కావాల్సిన పుస్తకాలు, ఫీజుల బాధ్యత మాదే. ప్రతియేటా ఐదుగురు అమ్మాయిల ఉన్నత చదువుకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని సమకూర్చుతున్నాం. మా సంస్థ సేవల్ని కేవలం ముస్లిం మహిళలకే పరిమితం చేయలేదు. కుల, మతాలకు అతీతంగా సమాన దృక్పథంతో వ్యవహరించడం మా సంస్థ ప్రథమ నియమం. నేను అల్లాను ఆరాధించినా, భారత రాజ్యాంగానికి విధేయురాలిని. ఈ దేశ పౌరురాలిని. కనుక ప్రజాస్వామిక విలువల పరిరక్షణ ఉద్యమాల్లో ముందుంటా. అదే నాకు ఆనందం కూడా. తెలంగాణ మహిళా, ట్రాన్స్‌జండర్ సమన్వయ పోరాట కమిటీలోనూ భాగస్వామినైనందుకు గర్విస్తున్నా.
ఒక భారతీయురాలిగా...
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని రైతుల పోరాటం నన్ను కదిలించింది. నాది వ్యవసాయ కుటుంబం కాకపోవచ్చు. మా తాత, తండ్రి రైతులు కాకపోవచ్చు. కానీ ఒక భారతీయురాలిగా నాకు వ్యవసాయంతో అవినా భావ సంబంధం ఉంది. ఆ మాటకొస్తే, ఈ దేశంలోని ప్రతి మనిషి మనుగడ పాడి, పంటతో ముడిపడుంది. మూడు పూటలా అన్నం తింటున్న వ్యక్తిగా అన్నదాతకు మద్దతు పలకడం నా కర్తవ్యం అనుకున్నా. అప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లా! సింఘు సరిహద్దులో రెండురోజులున్నాను. అక్కడి రైతులు నన్ను తమ ఇంటి ఆడపిల్లకు మల్లే ఆదరించారు. వేలమంది తచ్చాడే ఆ పరిసరాల్లో అపరిశుభ్రతకు తావేలేదు. తాత్కాలిక మరుగుదొడ్లు అయితే చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. వందల మంది వినియోగించే టాయిలెట్లను అంత క్లీన్‌గా ఎలా ఉంచగలు గుతున్నారా అని ఆశ్చర్యమేసింది. రైతుపోరాట క్షేత్రంలోని సమైక్య జీవన సౌందర్యానికి ముగ్ధురాలినై, అక్కడికక్కడే తెలుగులో ఒక కవిత రాసి వాళ్లకు చదివినిపించా. వారంతా చాలా సంతోషించారు. నేనున్న రెండు రోజుల్లోనే ఒక జీవితకాలానికి సరిపడా స్థైర్యాన్ని, సంతోషాన్ని పొందాను. తామనుకొన్నది సాధించుకొనే తిరిగెళతామనే మొక్కవోని దీక్ష ఆ రైతులందరి ముఖాల్లో నాకు కనిపించింది.
వరద సాయం...
హైదరాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాల్లోనూ వారం పాటు రోజుకొక వెయ్యిమందికి సరిపడా ఆహారం వండి పంపాం. వరద బాధితుల సహాయార్ధం అమూమత్ స్టోర్ తెరిచాం. తద్వారా బాధితులకు కుక్కర్, వంటపాత్రలు, గ్యాస్టవ్ తదితర వంటసామాగ్రి, నిత్యావసరాలు, వస్త్రాలు, దుప్పట్లు తదితర వస్తువులను పంచాం. సుమారు నాలుగు వేల కుటుంబాలకు అమూమత్ వరద సాయమందించిందని గర్వంగా చెప్పగలను. నష్టపోయిన కొందరు వీధివ్యాపారులకు తిరిగి జీవనోపాధి కల్పించేందుకు అవసరమైన సామాగ్రిని సమకూర్చాం. లాక్‌డౌన్‌లోకానీ, వరద సమయంలోనైనా మేం చేపట్టిన సహాయ కార్యక్రమాలకు యువత అండగా నిలవడం నాకు సంతోషాన్నిచ్చింది. నా ప్రతి యాక్టివిటీని సోషల్‌మీడియాలో షేర్ చేసుకోవడం ద్వారా, చాలామంది యువతీ, యువకులు ముందుకొచ్చి, వలంటీర్లుగా వ్యవహరించారు. వాళ్లందరి తోడ్పాటుతోనే క్లిష్ట సమయాల్లో నాకు చేతనైనంత మేరకు పరులకు సాయపడగలిగాను.
మూఢాచారాలకు వ్యతిరేకంగా...
ముస్లిం సమాజంలోనూ మూఢాచారాలు, అంధ విశ్వాసాల వల్ల మరీ ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. చేతబడి, బాణామతి కి మల్లే జాదు-టోనా పేరుతో అమాయకులను మోసం చేసి కొందరు జాదూగర్లు సొమ్ము చేసుకుంటున్నారు. అలాంటి మాయగాళ్లను గుర్తించి, నేను వాళ్ల ఆటలు కట్టించిన సందర్భాలున్నాయి. అప్పుడు నాపై కొందరు బెదిరింపులకూ పాల్పడ్డారు. అయినా, భయపడలేదు. ‘అమూమత్ సొసైటీలో అంతా ఆడవాళ్లే ఉంటరు కదా. ముఫ్తీ (మగ న్యాయకర్త) లేకుండా భార్య, భర్తల మధ్య తగవులెట్ల తీరుస్తరు. కనుక మీరు కౌన్సెలింగు సెంటర్ నడపనీకే వీల్లేదన్నారు. అలాంటోళ్లకూ గట్టిగా బదులిచ్చాం. మహిళా సాధికారతకు అడ్డుగా నిలుస్తున్న పలు సమస్యలను గుర్తించి, వాటిపై మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టి పనిచేయాలనుకుంటున్నాం. అందుకోసం మా సేవల్ని విస్తృతం చేసేందుకూ ప్రయత్నిస్తున్నాం.
అపోహలు పోగొట్టాలి...
ముస్లింల పట్ల మిగతా సమాజంలో చాలా రకాల అపోహలున్నాయి. అంతెందుకు, నేను ఎన్నోసార్లు వివిక్షలెదుర్కున్నాను. కొన్నేళ్ల కిందట వరంగల్‌లో మేమొక ఇల్లు కిరాయికి తీసుకున్నాం. ముస్లింలకు ఇల్లెట్లా ఇస్తారని మా ఇంటి యజమాని మీద చుట్టుపక్కవాళ్లంతా కోపడ్డారు. ‘మీరు మాంసం తిని బొక్కలు పక్కిళ్లలోకి విసిరేస్తారట కదా’ అని పక్కింటామె నా ముఖంమీదే అడిగింది. పాతబస్తీలో ఎవడో ఒక గల్లీ లీడర్ అండతో కొద్దిమంది కరెంటు బిల్లు, ఇంటి పన్ను కట్టకుంటే, మిగతా ముస్లిం కమ్యూనిటీనంతా నిందించడం సరైందేనా. ఇలా ఒకటా, రెండా ముస్లింలమీద ఎన్నో దుష్ప్రచారాలు సాగుతున్నాయి. రకరకాల రాజకీయ కారణాల వల్ల అవి ఇప్పుడు మరింత పెరిగాయి. వాటిని ప్రభుత్వాలే పోగొట్టాలి. మతాలు వేరైనా మనుషులంతా కలిసుండాలని నమ్ముతాను. అందుకోసం నా వంతు కృషి చేస్తాను.’’
- కె. వెంకటేశ్, ఫొటోలు: లవకుమార్
ఫ్రైడే కిచెన్...
లాక్‌డౌన్‌లో మా ఇల్లు ఒక కమ్యూనిటీ కిచెన్‌ను తలపించేది. మా గల్లీలోని యువకులంతా మా ఇంటి ఆవరణలో జమయ్యేవారు. అదీ కరోనా నిబంధనలు పాటిస్తూనే. మేమంతా కలిసి రోజుకి 500 మందికి సరిపడా భోజనాలను వండేవాళ్లం. తర్వాత వాటిని ప్యాక్ చేసి, వివిధ ప్రాంతాల్లోని పేదలు, వలసశ్రామికులకు పంచేవాళ్లం. జనతాకర్ఫ్యూ రోజు సాయంత్రం ఆరింటప్పుడు మా ఇంటి ముందుగా ఒక ముసలాయన నీరసంగా కాళ్లీడ్చుకుంటూ వెళ్లడం చూశా. ఆయన్ని ఆపి, ‘‘అన్నం తిన్నావా’’ అనడిగితే, ‘‘లేదమ్మా’’ అన్నాడు. అప్పటికప్పుడు అతని ఆకలి తీర్చినా, నా మనసెందుకో కుదుటపడలేదు. ‘పొరుగు వ్యక్తి పస్తుంటే, పరలోకంలో నీవు ప్రశ్నించబడతావు’ అని ‘హదీ్‌స’లోని మహమ్మద్ ప్రవక్త మాటలు గుర్తొచ్చాయి. ఆ వెంటనే యాభై మందికి అన్నంకూర వండి, ప్యాక్ చేసి తీసుకెళ్లి, పేవ్‌మెంట్లమీద ఉండే వాళ్లకు పంచాను. రెండవ రోజు నాకు మా కాలనీ యువకులతో పాటు మరికొందరు మహిళల సాయం తోడైంది. మేమంతా కలిసి...అన్నానికీ నోచుకోని నిరు పేదలుండే కొన్ని ప్రాంతాలను గుర్తించాం. అక్కడ రోజూ మధ్యాహ్నం ఆహారం పంచేవాళ్లం. మరొకరోజు చింతల్‌మెట్ ప్రాంతంలో ఒక పెద్దామె ‘‘మా పాలిట అన్నపూర్ణమ్మలా వచ్చినవు. నీవు సల్లగుండాలె’’ అంటూ నన్ను దీవించడం మరిచిపోలేను. అలా 64రోజుల పాటు నిత్యం ఐదొందల మంది ఆకలితీర్చే అవకాశం కలిగింది. అదే స్ఫూర్తితో ‘‘ఫ్రైడే కిచెన్’’ పేరుతో ప్రతి శుక్రవారం వందమంది పేదలకు భోజనం అందిస్తున్నాం.
నాకిష్టమైన తెలుగు టీచర్...
నేను పుట్టింది కేరళలోని పాలక్కాడ్. మా నాన్న ఉద్యోగరీత్యా నా పదో ఏట హైదరాబాద్‌కి వచ్చాం. అప్పటి నుంచి నా చదువు, పెళ్లి, ఉద్యోగం, సోషల్ సర్వీసు అంతా ఇక్కడే. చిన్నప్పుడు స్కూల్లో మా తెలుగు టీచర్ మురహరాచార్యులు సర్ ప్రోత్సాహం వల్లే నేనింత బాగా తెలుగు మాట్లాడగలుగుతున్నా. తెలుగులో కవిత్వం కూడా రాయగలుగుతున్నా. అప్పట్లో నేను ఆటవెలది, తేటగీతిలో పద్యాలు కూడా రాసేదాన్ని. ఆయన నన్ను సొంత బిడ్డలా చూసేవారు. ఇప్పటికీ మురహరాచార్యులు సర్‌ని తలచుకోని రోజు లేదు.
